టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాక్ మ్యాచ్ అంటేనే నరాల తెగే ఉత్కంఠ. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన పోరులో టీమిండియా సునాయాస విజయం సాధించినట్లు పైకి కనిపించినా, ఆ విజయానికి అసలు ఆర్కిటెక్ట్ మాత్రం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఆరంభంలో ఇషాన్ కిషన్ దంచికొట్టినా.. మ్యాచ్ చేజారకుండా పాక్ స్పిన్ ఉచ్చును బద్దలు కొట్టింది సూర్య భాయ్ వ్యూహమే.
మైదానంలో సూర్య వేసిన 'సైలెంట్ స్కెచ్' చూసి పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా షాక్ అయ్యాడు. అసలు ఆరుగురు స్పిన్నర్లతో దిగిన పాకిస్థాన్ ఎక్కడ బోల్తా పడింది? సూర్యకుమార్ ఆడిన ఆ కీలక ఇన్నింగ్స్ వెనుక ఉన్న మాస్టర్ ప్లాన్ ఏంటి?
పాకిస్థాన్ ఈ మ్యాచ్ కోసం ఒక వింత ప్లాన్ వేసింది. ప్రపంచంలో ఏ జట్టూ చేయని సాహసం చేస్తూ ఏకంగా ఆరుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగింది. ఇందులో మిస్టీరియస్ స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్ పై వాళ్లు చాలా ఆశలు పెట్టుకున్నారు. నిజానికి పాక్ స్పిన్నర్లు బాగానే బౌలింగ్ చేశారు. కానీ ఇక్కడే భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన అనుభవాన్ని రంగరించాడు.
తారిఖ్ బౌలింగ్ ను ఎక్కువగా తానే ఎదుర్కొని, వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. మరో ఎండ్ లో తిలక్ వర్మ ఇబ్బంది పడుతున్నా, సూర్య మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. పరుగులు రాకపోయినా పర్లేదు కానీ, వికెట్ ఇవ్వకూడదనేది సూర్య ప్లాన్. సహనం కోల్పోకుండా ఆడిన సూర్య 29 బంతుల్లో 32 పరుగులు చేసి 19వ ఓవర్ వరకు క్రీజులో పాతుకుపోయాడు.
ఈ మ్యాచ్ కోసం సూర్య ఎంత హోం వర్క్ చేశాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. పిచ్ పై అవగాహన, ఎంత స్కోరు చేయాలి అనే క్లారిటీతో పాటు తారిఖ్ ను ఎలా ఎదుర్కోవాలో ముందే ప్లాన్ చేసుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్ లో మిగతా బ్యాటర్లకు తారిఖ్ యాక్షన్ తో బౌలింగ్ చేసి మరీ చూపించాడు.
15వ ఓవర్ వరకు సూర్య-తిలక్ జోడి వికెట్ పడకుండా ఆడటంతో పాక్ స్పిన్నర్లు చేతులెత్తేశారు. వారు పొదుపుగా బౌలింగ్ చేసినా, వికెట్లు తీయలేకపోవడంతో మ్యాచ్ గమనం పూర్తిగా మారిపోయింది. చివర్లో సూర్య భారీ షాట్ కు ప్రయత్నించి ఔటైనా, అప్పటికే జరగాల్సిన నష్టం పాక్ కు జరిగిపోయింది. ఈ వ్యూహాత్మక బ్యాటింగే భారత్ కు విజయాన్ని కట్టబెట్టింది.
ఓటమి అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ తమ వైఫల్యాలను ఒప్పుకున్నాడు. తమ స్పిన్నర్లు గత ఆరు నెలలుగా అద్భుతంగా రాణిస్తున్నారని, కానీ ఈరోజు వాళ్లకు కలిసి రాలేదని వాపోయాడు. కీలక సమయాల్లో ఎగ్జిక్యూషన్ లోపించిందని, బ్యాటింగ్ లోనూ పవర్ ప్లేలోనే 3-4 వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగిందని అంగీకరించాడు.
టాస్ గెలిచి ఛేజింగ్ ఎంచుకున్నామని, ఎందుకంటే మొదటి ఇన్నింగ్స్ లో పిచ్ స్టికీగా ఉందని, బంతి గ్రిప్ అయ్యిందని వివరించాడు. రెండో ఇన్నింగ్స్ లో పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించినా తమ బౌలర్లు, బ్యాటర్లు పరిస్థితులకు తగ్గట్టు ఆడలేకపోయారని సల్మాన్ విశ్లేషించుకున్నాడు.
పెద్ద మ్యాచ్ ల్లో భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం ముఖ్యమని, ఆ విషయంలో తాము విఫలమయ్యామని పాక్ కెప్టెన్ అంగీకరించాడు. తాము ఇలాంటి మ్యాచ్ లు చాలా ఆడామని, కానీ ఈరోజు తమ రోజు కాదన్నాడు. అయితే ఈ ఓటమి నుంచి త్వరగా కోలుకోవాల్సిన అవసరం ఉందని, రెండు రోజుల్లో జరిగే తదుపరి మ్యాచ్ తమకు డూ ఆర్ డై అని స్పష్టం చేశాడు. ఆ మ్యాచ్ గెలిస్తేనే సూపర్ ఫోర్ కు అర్హత సాధిస్తామని, అప్పటి నుంచి కొత్త టోర్నీలా భావించి ముందుకు వెళ్తామని సల్మాన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
వ్యూహం గెలిచింది.. ఆవేశం ఓడింది!
ఆరుగురు స్పిన్నర్లు ఉన్నా.. ఒక్క సూర్యకుమార్ ప్లాన్ ముందు పాక్ పప్పులు ఉడకలేదు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ అంటే ఇదే!

