Vizianagaram MP Praises Padma: నిజాయితీకి సలాం చేసిన ఎంపీ

naveen
By -
Vizianagaram MP Praises Padma


చెన్నై వీధుల్లో చెత్త ఏరుకునే ఓ సాధారణ మహిళ నిజాయితీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పేదరికం వెంటాడుతున్నా, కళ్లముందు రూ.45 లక్షల విలువైన బంగారం ఉన్నా, మనసు మార్చుకోకుండా దాన్ని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 


ఆమె నిజాయితీకి మెచ్చిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పుడు ఆమెకు అరుదైన గౌరవం దక్కేలా కృషి చేస్తున్నారు. ఏకంగా ఆమెను ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు తీసుకెళ్లి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పరిచయం చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారు.


తమిళనాడు రాజధాని చెన్నైలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మ, గత నెలలో విధి నిర్వహణలో ఉండగా ఒక బ్యాగును గుర్తించారు. అందులో ఏకంగా రూ.45 లక్షల విలువ చేసే ఆభరణాలు ఉండటంతో ఆమె ఒక్కక్షణం ఆశ్చర్యపోయినా, వెంటనే తేరుకుని ఆ బ్యాగును పోలీసులకు అప్పగించారు. అనంతరం ఆ నగలను అసలు యజమానులకు చేర్చారు. పద్మ చూపిన ఈ నిజాయితీని తమిళనాడు సీఎం స్టాలిన్, సూపర్ స్టార్ రజినీకాంత్ సహా ఎందరో ప్రముఖులు ఇప్పటికే ప్రశంసించారు. 


అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆమెకు మరింత పెద్ద గుర్తింపు రావాలని భావించారు. ఈ మేరకు ఆయన ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. పద్మ నిజాయితీకి జాతీయస్థాయిలో గుర్తింపునివ్వాలని, కేంద్రం తరఫున ఏదైనా ప్రత్యేక అవార్డుకు ఆమె పేరును సిఫార్సు చేయాలని కోరారు.


ఎంపీ అప్పలనాయుడు కేవలం లేఖ రాయడమే కాకుండా, పద్మతో స్వయంగా వీడియో కాల్‌లో మాట్లాడి అభినందించారు. సమాజంలో ఇంకా విలువలు, నీతి బతికే ఉన్నాయనడానికి పద్మ, దురై వంటి కార్మికులే నిదర్శనమని ఆయన కొనియాడారు. చెత్తలో దొరికిన సుమారు 20 సవర్ల బంగారం, కిలో వెండిని క్షణం ఆలస్యం చేయకుండా తిరిగిచ్చిన వారి గొప్ప మనసును ఎంత పొగిడినా తక్కువేనని అన్నారు. 


ఇలాంటి ప్రేరణాత్మక ఘటనలపై ప్రధాని మోదీకి కూడా లేఖ రాశానని, నిజాయితీగా పనిచేసే ప్రతి సామాన్య పౌరుడి వెనుక ప్రభుత్వం నిలబడాలన్నదే తన అభిమతమని ఎంపీ తెలిపారు. అంతేకాకుండా, త్వరలోనే పద్మను స్వయంగా రాష్ట్రపతి దగ్గరకు తీసుకెళ్తానని ఆయన మాటిచ్చారు.


మరోవైపు రాష్ట్ర రాజకీయాలపై కూడా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు స్పందించారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే విజన్ డాక్యుమెంట్ అని అభివర్ణించారు. రైతులకు అండగా నిలుస్తూ వ్యవసాయం, సాగునీటి రంగాలకు పెద్దపీట వేయడం శుభపరిణామమని అన్నారు. 


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించారని, విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి రంగాల్లో స్పష్టమైన ప్రణాళికలతో ఈ బడ్జెట్ ఉందని ప్రశంసించారు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించే సత్తా ఈ బడ్జెట్‌కు ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


 నిజాయితీకి దక్కిన నిజమైన గౌరవం! 

కోటీశ్వరులు కూడా ఆశపడే ఈ రోజుల్లో.. పేదరికంలో ఉన్నా పరుల సొమ్ము ఆశించని పద్మ లాంటి వారికి రాష్ట్రపతి చేతుల మీదుగా సత్కారం జరిగితే.. అది మొత్తం దేశానికే గర్వకారణం.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!