Pakistan Economic Crisis: మ్యాన్ హోల్ మూత దొంగిలిస్తే జైలుకే!

naveen
By -

Pakistan Economic Crisis

Pakistan Economic Crisis: మ్యాన్ హోల్ మూతలు ఎత్తుకెళ్తే 10 ఏళ్లు జైలు! దొంగల కోసం సీఎం వేడుకోలు


దేశం దివాలా తీస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పడానికి పాకిస్థాన్ (Pakistan) ఒక ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ ఆర్థిక మాంద్యం ఏ స్థాయికి చేరిందంటే.. జనం తినడానికి తిండి లేక రోడ్ల మీద ఉండే మ్యాన్ హోల్ (Manhole) మూతలను దొంగిలించి అమ్ముకుంటున్నారు. ఉదయం ప్రభుత్వం మూత పెడితే.. రాత్రికల్లా మాయమైపోతోంది. దీంతో విసిగిపోయిన పంజాబ్ ముఖ్యమంత్రి మరియం నవాజ్ (Maryam Nawaz) ఏకంగా ప్రజలను వేడుకుంటూ వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. అసలు ఒక దేశం మ్యాన్ హోల్ మూతలను కాపాడుకోవడానికి కఠిన చట్టాలు తెచ్చే పరిస్థితికి ఎందుకు వచ్చింది?


ఉదయం ఫిక్స్.. రాత్రికి మాయం!

ప్రపంచ బ్యాంకు (World Bank) నివేదిక ప్రకారం పాకిస్థాన్‌ జనాభాలో 45 శాతం మంది పేదరికంలో మగ్గుతున్నారు. ఆకలి కేకలు జనాలను దొంగలుగా మారుస్తున్నాయి. పాకిస్థాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో మ్యాన్ హోల్ మూతల దొంగతనం ఒక పెద్ద సమస్యగా మారింది. దాదాపు 30 కిలోల బరువుండే ఈ ఇనుప మూతలను ఎత్తుకెళ్లి స్క్రాప్ మార్కెట్ (Scrap Market)లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం కొత్తవి వేయడం, దొంగలు ఎత్తుకెళ్లడం.. ఇది అక్కడ నిత్యకృత్యమైంది.


ముఖ్యమంత్రి వార్నింగ్.. 10 ఏళ్లు జైలు!

పరిస్థితి చేయి దాటిపోవడంతో పంజాబ్ సీఎం మరియం నవాజ్ సీరియస్ అయ్యారు. మ్యాన్ హోల్ మూతలు దొంగిలించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూనే, కఠిన హెచ్చరికలు జారీ చేశారు. "ఇకపై మ్యాన్ హోల్ మూతలు దొంగిలించినా, వాటిని ఎవరైనా కొనుగోలు చేసినా.. ఏడాది నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధిస్తాం" అని స్పష్టం చేశారు. కేవలం జైలు శిక్షే కాదు, భారీ జరిమానాలు కూడా ఉంటాయని హెచ్చరించారు.


ప్రాణాలు పోతున్నాయి.. 50 లక్షల జరిమానా

ఈ దొంగతనాలు కేవలం ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టాన్ని కూడా కలిగిస్తున్నాయి. ఈ మధ్యే లాహోర్ (Lahore)లో మూత లేని మ్యాన్ హోల్‌లో పడి తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోవడం కలచివేసింది. అందుకే, ఇకపై మ్యాన్ హోల్‌లో పడి ఎవరైనా మరణిస్తే.. దానికి కారణమైన దొంగలకు పదేళ్ళ జైలు శిక్షతో పాటు 50 లక్షల పాకిస్థానీ రూపాయల జరిమానా విధిస్తామని ప్రభుత్వం కొత్త రూల్ తెచ్చింది.


ఆకలి చట్టాలకు భయపడదు! 

జైలు శిక్షలు, జరిమానాలు విధిస్తే దొంగతనాలు ఆగుతాయేమో కానీ, ఆకలి ఆగదు. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కోలుకోనంత వరకు.. జనం ఇలాంటి చిల్లర దొంగతనాలకు తెగబడుతూనే ఉంటారు. ఇది కేవలం శాంతిభద్రతల సమస్య కాదు, ఆకలి సమస్య.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!