Bengal Elections: మమత 'యువ సాథీ' వర్కౌట్ అవుతుందా?

naveen
By -
Bengal Elections


పశ్చిమ బెంగాల్ రాజకీయ రణరంగం రసవత్తరంగా మారింది. మూడోసారి కాదు.. ఏకంగా నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కాలని మమతా బెనర్జీ (Mamata Banerjee) ఉవ్విళ్లూరుతుంటే, ఈసారి ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుస్తోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై సుప్రీం కోర్టు మెట్లెక్కిన దీదీ.. ఇప్పుడు యువతను ఆకర్షించేందుకు ఒక బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు. 


అదే 'యువ సాథీ' (Yuva Sathi). మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు వినిపించే 'నిరుద్యోగ భృతి' హామీలాంటిదే ఇది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు నమ్ముకున్న ఈ ఫార్ములా బెంగాల్‌లో దీదీకి అధికారాన్ని కట్టబెడుతుందా? లేక యువత ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతారా?


బెంగాల్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల కోసం టీఎంసీ ప్రభుత్వం 'యువ సాథీ' పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చింది. 21 నుంచి 40 ఏళ్ల వయసున్న నిరుద్యోగ యువతకు నెలకు రూ.1500 చొప్పున ఆర్థిక సాయం అందించడమే దీని లక్ష్యం. పదో తరగతి పాసైన ఎవరైనా దీనికి అర్హులే. 


ఏప్రిల్ 1 నుంచి నగదు జమ చేస్తామని హామీ ఇస్తున్నా, అప్పటికే ఎన్నికల కోడ్ అడ్డువచ్చే ఛాన్స్ ఉంది. అయినా సరే, అప్లికేషన్ల కోసం యువత క్యూ కడుతున్నారు. నిజానికి నిరుద్యోగ భృతి అనే కాన్సెప్ట్ పుట్టిందే బెంగాల్ గడ్డపై. 1978లోనే జ్యోతి బసు సర్కార్ దీనిని ప్రవేశపెట్టింది. ఇప్పుడు మమత అదే పాత మంత్రాన్ని కొత్త సీసాలో పోసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.


ఈ 'నిరుద్యోగ భృతి' అనే మాయాజాలం తెలుగు రాష్ట్రాలకు కొత్తేమీ కాదు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి ఈ హామీ ఒక కారణం. 2018లో 'ముఖ్యమంత్రి యువనేస్తం' పేరుతో అమలు చేసినా, అప్పటికే ఆలస్యం జరగడంతో 2019లో అధికారం కోల్పోయింది. తెలంగాణలోనూ 2018లో కేసీఆర్, 2023లో కాంగ్రెస్ నిరుద్యోగ భృతి హామీలు ఇచ్చాయి. అవి అమలు కాకపోయినా, ఎన్నికల్లో గెలవడానికి మాత్రం ఈ హామీలు పనిచేశాయన్నది విశ్లేషకుల మాట. 


పార్టీలు మారినా, రాష్ట్రాలు మారినా.. యువత ఓట్లను కొల్లగొట్టడానికి 'నగదు బదిలీ'ని మించిన ఆయుధం లేదని రాజకీయ పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. ఇప్పుడు మమత కూడా అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారు.


అయితే దీదీ వ్యూహంపై బీజేపీ నిప్పులు చెరుగుతోంది. ఇది కేవలం ఎన్నికల స్టంట్ అని బీజేపీ సీఎం అభ్యర్థి సువేందు అధికారి కొట్టిపారేశారు. గతంలో 'యువ శ్రీ' పేరుతో 17 లక్షల మందిని ఊరించి, కేవలం లక్ష మందికే సాయం చేశారని, ఇప్పుడు మళ్లీ కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. బెంగాల్ యువతకు కావాల్సింది బిచ్చం కాదని, గౌరవప్రదమైన ఉద్యోగాలని ఆయన కౌంటర్ ఇస్తున్నారు. 


పరిశ్రమలు రాకుండా అడ్డుకుని, ఉపాధిని దెబ్బతీసి.. ఇప్పుడు రూ.1500 ఇస్తామంటే యువత నమ్మరని బీజేపీ వాదిస్తోంది. దరఖాస్తుల కోసం బారులు తీరిన ఆ క్యూలైన్లలో కనిపిస్తున్నది ప్రభుత్వంపై నమ్మకమా? లేక నిరుద్యోగపు నిస్సహాయతా? అనేది ఎన్నికల ఫలితాలే తేల్చాలి.


హామీల వల.. ఓట్ల పంట! 

నిరుద్యోగ భృతి హామీ తెలుగు నాట గెలుపు గుర్రాలను ఎక్కించింది. ఇప్పుడు బెంగాల్‌లోనూ అదే సెంటిమెంట్ రిపీట్ అయితే.. దీదీ నాలుగోసారి సీఎం కావడం ఖాయం. కానీ యువత ఆలోచన మారితేనే సీన్ రివర్స్ అవుతుంది.


Tags:

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!