కాంగ్రెస్ పార్టీకి బయట శత్రువులు అవసరం లేదేమో.. సొంత పార్టీ నేత మణిశంకర్ అయ్యర్ (Mani Shankar Aiyar) చాలు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలిచే ఈ సీనియర్ నేత.. మరోసారి బాంబు పేల్చారు. త్వరలో జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అంతేకాదు, శశిథరూర్, పవన్ ఖేరా వంటి కీలక నేతలను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.
'కమ్యూనిస్టులను ద్వేషించే కంటే మన వాళ్లు ఒకరినొకరు ఎక్కువగా ద్వేషించుకుంటారు' అంటూ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు హస్తం పార్టీలో కలకలం రేపుతున్నాయి. అసలు సొంత పార్టీ ఓడిపోవాలని అయ్యర్ ఎందుకు కోరుకుంటున్నారు? కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan)పై ఎందుకంత ప్రేమ?
ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందన్నారు. అక్కడి కాంగ్రెస్ నాయకుల మధ్య ఉన్న విభేదాలే పార్టీ కొంపముంచుతాయని అభిప్రాయపడ్డారు.
ప్రత్యర్థులైన కమ్యూనిస్టులను ద్వేషించే కంటే, కాంగ్రెస్ నాయకులు ఒకరినొకరు ఎక్కువగా ద్వేషించుకుంటున్నారని, అందుకే గెలుపు కష్టమని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి పినరయి విజయన్ మళ్లీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని జోస్యం చెప్పారు.
రాజీవ్ గాంధీ కలలు కన్న పంచాయతీ రాజ్ వ్యవస్థను కేరళలో విజయన్ అద్భుతంగా అమలు చేస్తున్నారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల తిరువనంతపురంలో జరిగిన ఓ సెమినార్‌కు వెళ్లొద్దని పార్టీ చెప్పినా అయ్యర్ హాజరవడం, అక్కడ విజయన్‌ను పొగడటం గమనార్హం.
ఈ ఇంటర్వ్యూలో పార్టీ మీడియా విభాగానికి చెందిన పవన్ ఖేరా (Pawan Khera)పై అయ్యర్ నిప్పులు చెరిగారు. ఖేరా అసలు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాదని, కేవలం ఒక తోలుబొమ్మ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత రెండేళ్లుగా తనపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, ఇలాంటి వారిని అధికార ప్రతినిధిగా తప్పించకపోతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న దయనీయ స్థితిలోనే ఉంటుందని హెచ్చరించారు.
అయ్యర్ వ్యాఖ్యలపై స్పందించిన ఖేరా, అవన్నీ అయ్యర్ వ్యక్తిగత అభిప్రాయాలే తప్ప పార్టీకి సంబంధం లేదని సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు. అయ్యర్ వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ (Shashi Tharoor) కూడా అయ్యర్ విమర్శల దాడి నుంచి తప్పించుకోలేకపోయారు. థరూర్ పాకిస్థాన్ వ్యతిరేకి అని, విదేశాంగ మంత్రి పదవి కోసమే పాకులాడుతున్నారని ఆరోపించారు. గతేడాది 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ప్రధాని మోదీని థరూర్ ప్రశంసించడాన్ని, పార్టీ అభ్యంతరాలు చెప్పినా ప్రభుత్వం నియమించిన బృందానికి నాయకత్వం వహించడాన్ని అయ్యర్ గుర్తుచేశారు.
అలాగే కాంగ్రెస్ కమ్యూనికేషన్ విభాగం చీఫ్ జైరామ్ రమేశ్ పనితీరుపైనా సెటైర్లు వేశారు. సీనియర్ నాయకుడై ఉండి ఇలా బహిరంగంగా సొంత పార్టీ నేతలను విమర్శించడం, ప్రత్యర్థి పార్టీ సీఎంను పొగడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
సొంత గూటిలో కుంపటి!
ఎన్నికల వేళ అయ్యర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇవి ప్రత్యర్థులకు ఆయుధంగా మారడం ఖాయం.

