Parthiban: ఉస్తాద్ వేదికపై పార్తిబన్ కుల వివాదం

naveen
By -

ఉస్తాద్ వేదికపై పార్తిబన్ కుల వివాదం

Parthiban: అక్కడ నీతులు.. ఇక్కడ కులం గోల.. 'ఉస్తాద్' వేదికపై పార్తిబన్ ద్వంద్వ వైఖరి!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విలక్షణ నటుడు, దర్శకుడు పార్తిబన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక అద్భుతమైన నటుడిగా ఆయన ప్రతిభను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దక్షిణాది ఎంతగానో గౌరవిస్తుంది. కానీ, హైదరాబాద్ వేదికగా ఆయన ప్రదర్శించిన ద్వంద్వ వైఖరి (Double Standards) మాత్రం ప్రస్తుతం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.


అక్కడ అభ్యుదయ భావాలు.. ఇక్కడ కుల కార్డు


తమిళనాడులో పా. రంజిత్ లాంటి దర్శకుల నేతృత్వంలో జరిగే ప్రగతిశీల వేదికలపై పార్తిబన్ తరచుగా కనిపిస్తుంటారు. అక్కడ కుల రహిత సమాజం గురించి, మానవ సమానత్వం గురించి ఆయన ఎంతో గొప్పగా మాట్లాడుతుంటారు. సమాజంలో అభ్యుదయ భావజాలం ఉన్న వ్యక్తిగా తనని తాను ఆవిష్కరించుకుంటారు. కానీ, అదే వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చి తెలుగు నేల మీద అడుగుపెట్టగానే, తన అసలు సిసలైన గుర్తింపు తన కులం అని బహిరంగంగా ప్రకటించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.


అసలు గుర్తింపు కులమేనా?


హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో పార్తిబన్ మాట్లాడుతూ.. తాను తెలుగువాడినని, నాయుడు కులానికి చెందినవాడినని, అదే తన అసలు గుర్తింపు అని చెప్పుకొచ్చారు. తాను చెన్నైలోనే పుట్టి పెరిగానని, ప్రస్తుతం తెలుగు అంతగా రాకపోయినా తదుపరి సక్సెస్ మీట్ నాటికి నేర్చుకుని అందరినీ అలరిస్తానని అన్నారు. అయితే, కేవలం ఇక్కడి ఆడియన్స్‌ను ప్రసన్నం చేసుకోవడానికే ఆయన ఇలాంటి కుల కార్డును బయటకు తీశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రజనీకాంత్ నుంచి నేటి తరం నటుల వరకు ప్రతిభను చూసి మాత్రమే నెత్తిన పెట్టుకునే గొప్ప సంస్కృతి తమిళ ప్రేక్షకులది. అటువంటి గడ్డపై ఎదిగి, ఇక్కడకొచ్చి కులాన్ని ప్రస్తావించడం ఆ సంస్కృతిని అవమానించడమే అవుతుందన్న విమర్శలు వస్తున్నాయి.


ఒక గొప్ప నటుడికి ఉండాల్సిన అసలు గుర్తింపు ఆయన కళ మాత్రమేనని, కానీ పార్తిబన్ తన కులమే ప్రాథమిక గుర్తింపు అని చెప్పడం ఆయనలోని డబుల్ స్టాండర్డ్స్‌ను బట్టబయలు చేస్తోందని పలువురు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై తమిళ నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తూ.. మిమ్మల్ని ఒక కళాకారుడిగా గౌరవించాము తప్ప మీ కులం చూసి కాదని సోషల్ మీడియా వేదికగా ఆయనకు చురకలు అంటిస్తున్నారు.