మనం రోజూ తినే అన్నం, చపాతీలే మనకు బలాన్ని ఇస్తున్నాయని అనుకుంటే పొరపాటే! భారతీయుల ఆహారపు అలవాట్లపై జరిగిన ఓ తాజా అధ్యయనం షాకింగ్ నిజాలను బయటపెట్టింది.
దేశ ప్రజలు తీసుకుంటున్న ఆహారంలో నాణ్యత లోపించిందని 'కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్ అండ్ వాటర్' (CEEW) నివేదిక హెచ్చరించింది. భారతీయులు తమకు అవసరమైన ప్రోటీన్‌లో దాదాపు సగం బియ్యం, గోధుమ, రవ్వ, మైదా వంటి ధాన్యాల నుంచే పొందుతున్నారు. అయితే, ఇది నాణ్యత లేని ప్రోటీన్ (Low Quality Protein) అని, ఇది సులభంగా జీర్ణం కాదని నిపుణులు స్పష్టం చేశారు.
నిశ్శబ్ద సంక్షోభం.. అసలేం తింటున్నాం?
భారతీయులు సగటున రోజుకు 55.6 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటున్నా, అందులో అసలైన పోషకాలు ఉండటం లేదు.
ఎక్కువగా: వంట నూనెలు, ఉప్పు, చక్కెర వినియోగం విపరీతంగా పెరిగింది.
తక్కువగా: పప్పుధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, మాంసం వంటి నాణ్యమైన ప్రోటీన్ వనరుల వినియోగం చాలా తక్కువగా ఉంది.
దీనిని భారత ఆహార వ్యవస్థలో 'నిశ్శబ్ద సంక్షోభం' (Silent Crisis)గా నివేదిక అభివర్ణించింది. కేవలం కడుపు నింపుకోవడమే తప్ప, శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో మనం విఫలమవుతున్నామని సీఈఈడబ్ల్యూ ఫెలో అపూర్వ ఖండేల్వాల్ పేర్కొన్నారు.
చిరుధాన్యాలు మాయం..
గత పదేళ్లలో జొన్నలు, సజ్జలు, రాగులు వంటి చిరుధాన్యాల (Millets) వినియోగం ఏకంగా 40% పడిపోయిందని ఈ సర్వే తేల్చింది. ప్రభుత్వం ఇచ్చే రేషన్ (PDS), అంగన్‌వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో కేవలం బియ్యం, గోధుమలే కాకుండా.. పాలు, గుడ్లు, పప్పులు, చిరుధాన్యాలను చేర్చాలని అధ్యయనం సిఫార్సు చేసింది.

