AP Stree Shakti Scheme: ఫ్రీ బస్సును ఇలా కూడా వాడొచ్చా? ఇన్‌స్టా ప్రియుడి కోసం వైజాగ్ టు కావలి

naveen
By -

ప్రభుత్వం మహిళల భద్రత, ఆర్థిక సాధికారత కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే.. అదే స్కీమ్‌ను వాడుకుని కొందరు టీనేజర్లు సులువుగా ఇల్లు దాటేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ అజ్ఞాత ప్రియుడి కోసం విశాఖకు చెందిన ఇంటర్ విద్యార్థిని ఏకంగా వందల కిలోమీటర్లు దాటి నెల్లూరు చేరుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చేతిలో పైసా లేకపోయినా బస్సులు మారుతూ వెళ్లిపోయిన ఈ ఘటన.. స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉన్న టీనేజ్ పిల్లల తల్లిదండ్రులకు ఒక అతిపెద్ద హెచ్చరిక. అసలు వైజాగ్ నుంచి కావలి వరకు ఆ బాలిక ప్రయాణం ఎలా సాగింది? పోలీసుల ఎంట్రీతో కథ ఎలా సుఖాంతమైందో చూద్దాం.


AP Stree Shakti Scheme


విశాఖ టు కావలి.. ఇన్‌స్టా లవ్ స్టోరీ


విశాఖపట్నంలోని సీతమ్మధార ప్రాంతానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థినికి ఇన్‌స్టాగ్రామ్‌లో నెల్లూరుకు చెందిన యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఇద్దరూ కలిసి తిరుపతిలో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ గీశారు.


సోమవారం ఇంటర్ పరీక్షలు రాసేందుకు ఇంటి నుంచి వెళ్లిన ఆ బాలిక తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఎగ్జామ్స్ అని చెప్పి.. ఫ్రీ బస్సుల్లో ఎస్కేప్


సీన్ కట్ చేస్తే.. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' (ఉచిత బస్సు) పథకాన్ని వాడుకుని ఆ బాలిక ఎంచక్కా బస్సులు మారుతూ నెల్లూరు జిల్లా కావలికి చేరుకుంది. చేతిలో డబ్బులు లేకపోయినా ఉచిత ప్రయాణం కావడంతో బస్సుల్లో ఎవరికీ పెద్దగా అనుమానం రాలేదు.


అర్ధరాత్రి బస్టాండ్‌లో పోలీసుల ఎంట్రీ


ఆమె కావలి చేరుకునే సరికి అర్ధరాత్రి కావడంతో అక్కడి నుంచి నెల్లూరుకు ఉచిత బస్సులు లేక బస్టాండ్‌లోనే ఉండిపోయింది. రాత్రి పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు బస్టాండ్ లో ఒంటరిగా ఉన్న బాలికను గమనించి, ఒక మహిళా కానిస్టేబుల్ ద్వారా వివరాలు ఆరా తీశారు.


అసలు కథ తెలుసుకుని కంగుతిన్న పోలీసులు.. వెంటనే ఆమెను కావలి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విశాఖలోని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, వాళ్లు రాగానే బాలికను సురక్షితంగా అప్పగించారు. మాయమాటలు చెప్పి పిలిపించిన ఆ యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఉచిత బస్సు పథకం అనేది ఆడబిడ్డల ఆర్థిక ఎదుగుదలకు, సురక్షిత ప్రయాణానికి ఒక వరం. కానీ అదే సమయంలో, చేతిలో డబ్బులు లేకపోయినా ఎక్కడికైనా సులభంగా వెళ్లిపోవచ్చు అనే ధైర్యం టీనేజర్లలో వస్తోంది. ఈ ఘటన పిల్లల చేతికి స్మార్ట్‌ఫోన్ ఇచ్చి వదిలేసే ప్రతి తల్లిదండ్రులకూ ఒక కనువిప్పు. మీ పిల్లలు సోషల్ మీడియాలో ఎవరితో మాట్లాడుతున్నారు? వారి ప్రవర్తనలో మార్పులు ఏమైనా ఉన్నాయా? అని గమనించడం అత్యవసరం. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పే సైబర్ మోసగాళ్ల పట్ల టీనేజ్ పిల్లలకు కౌన్సెలింగ్ ఇప్పించడం అన్నింటికంటే ముఖ్యం.