Trump on Gas Prices: ధరలు పెరిగితే పెరగనివ్వండి.. ఇరాన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్

naveen
By -

ఇరాన్‌పై యుద్ధం కారణంగా గ్లోబల్ ఆయిల్ రేట్లు భగ్గుమంటున్నా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక నిర్లక్ష్యపు కామెంట్ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వణికిస్తోంది. అగ్రరాజ్య అధినేత "ధరలు పెరిగితే పెరగనివ్వండి" అని ఎందుకు అన్నారు? ఈ యుద్ధం వల్ల మన బంకుల్లో పెట్రోల్ రేట్లకు రెక్కలు రావడం ఖాయమేనా? దీని వెనుక ఉన్న గ్లోబల్ పాలిటిక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Trump on Gas Prices

'పెరిగితే పెరగనివ్వండి'.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్


ఇరాన్ తో విస్తరిస్తున్న యుద్ధం వల్ల అమెరికాలో గ్యాస్ (పెట్రోల్) ధరలు పెరుగుతుండటంపై తనకు ఎలాంటి ఆందోళన లేదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయిటర్స్‌ కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. అమెరికా సైనిక ఆపరేషనే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.


"ధరలు పెరిగితే పెరగనివ్వండి (If they rise, they rise). యుద్ధం ముగిశాక అవే వేగంగా పడిపోతాయి. గ్యాస్ ధరల పెరుగుదల కంటే ఇరాన్ పై యుద్ధమే మాకు చాలా ముఖ్యం" అని ట్రంప్ కుండబద్దలు కొట్టారు.


ట్రంప్ చేసిన ఈ కామెంట్.. ఫేమస్ హాలీవుడ్ మూవీ 'రాకీ 4' లో విలన్ చెప్పిన "చస్తే చావనివ్వండి (If he dies, he dies)" అనే డైలాగ్ ను గుర్తుచేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.


తెరవెనుక వైట్ హౌస్ టెన్షన్.. ఎన్నికల భయం!


బయటకు ట్రంప్ ఎంత గంభీరంగా కనిపిస్తున్నా.. వైట్ హౌస్ లోపల మాత్రం పరిస్థితి భయంకరంగా ఉంది. నవంబర్ లో జరగబోయే అమెరికా 'మిడ్-టర్మ్ ఎన్నికల్లో' ఈ ఇంధన ధరల పెరుగుదల రిపబ్లికన్ పార్టీ కొంపముంచుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం దెబ్బకు ఓటర్లు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


ఇదే విషయంపై వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్ (Susie Wiles), ఇంధన శాఖ మంత్రి క్రిస్ రైట్.. ఆయిల్ కంపెనీల సీఈఓలతో రహస్య మంతనాలు జరుపుతున్నారు. ధరలను అదుపు చేయకపోతే ఎన్నికల్లో "విపత్కర (Catastrophic)" పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సూసీ వైల్స్ వైట్ హౌస్ మీటింగ్స్ లో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.


16 శాతం పెరిగిన ఆయిల్ రేట్లు.. ట్రంప్ ప్లాన్ ఏంటి?


ఇరాన్ తో యుద్ధం మొదలైనప్పటి నుంచి గ్లోబల్ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు ఏకంగా 16 శాతం పైకి ఎగబాకాయి. అమెరికాలో గ్యాస్ జాతీయ సగటు ధర గత వారం నుంచి 27 సెంట్లు పెరిగి గ్యాలన్‌కు $3.25 కు చేరుకుంది.


అయినా సరే, ధరలు పెద్దగా పెరగలేదని ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. పైగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎమర్జెన్సీ క్రూడ్ స్టాక్ అయిన 'స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్' (SPR) ను వాడే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని ఆయన తేల్చిచెప్పారు.


ఇరాన్ నావికాదళం ఇప్పటికే "సముద్రం అడుగున" ఉందని, కాబట్టి ఆయిల్ రవాణాకు గుండెకాయ లాంటి 'హోర్ముజ్ జలసంధి'కి ఎలాంటి ముప్పు లేదని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ పై మిలిటరీ ఆపరేషన్ కేవలం 4 నుంచి 5 వారాల్లో ముగుస్తుందని ఆయన అంచనా వేస్తున్నారు.


ట్రంప్ చెబుతున్నట్లు ఈ యుద్ధం 4-5 వారాల్లో ముగుస్తుందని అమెరికా మిలిటరీ నిపుణులే నమ్మట్లేదు. ఇరాన్ యుద్ధం పొడిగితే.. ప్రపంచ ఇంధన సరఫరా దెబ్బతిని గ్లోబల్ ఆయిల్ మార్కెట్ కుప్పకూలుతుంది. ట్రంప్ తన రాజకీయ ఇగో కోసం 'స్ట్రాటజిక్ రిజర్వ్స్' వాడకపోతే.. ఆ క్రూడాయిల్ ద్రవ్యోల్బణం ఎఫెక్ట్ కచ్చితంగా ఇండియాను కూడా తాకుతుంది. ఒక సామాన్యుడిగా, రాబోయే రోజుల్లో పెట్రోల్ రేట్లు భారీగా పెరిగే ముప్పు పొంచి ఉంది.