ఎక్కడో పశ్చిమాసియాలో బాంబులు పడుతుంటే మనం ఆందోళన పడుతున్నాం. కానీ ఈ యుద్ధాన్ని నడిపించడానికి ఇరాన్ వాడుతున్న ఆయుధం ఏంటో తెలిస్తే మీరు షాక్ అవుతారు! అది తుపాకీ కాదు.. 'బిట్‌కాయిన్' (Bitcoin). అమెరికా విధించిన కఠిన ఆర్థిక ఆంక్షలను (Sanctions) తుంగలో తొక్కుతూ.. ఇరాన్ తన సైనిక అవసరాలకు క్రిప్టోకరెన్సీతో పేమెంట్స్ చేస్తోంది. అసలు గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ (డాలర్) కు దొరకకుండా ఇరాన్ ఈ బిట్‌కాయిన్ నెట్‌వర్క్‌ను ఎలా వాడుకుంటోంది? ప్రభుత్వాల కంట్రోల్ లేని ఈ టెక్నాలజీ వల్ల యుద్ధాలు పెరిగి, గ్లోబల్ ఎకానమీ కుప్పకూలితే మన సామాన్యుడి జేబులకు పడే చిల్లు ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం.
ఒక బిట్‌కాయిన్‌పై ఏకంగా $71,700 లాభం!
ఇరాన్ కరెన్సీ విలువ పాతాళానికి పడిపోయింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. అయినా సరే ఇరాన్ విదేశాల నుంచి మిలిటరీ సామాగ్రి, ఇంధనం లాంటివి ఎలా కొంటోందంటే.. బిట్‌కాయిన్లను మైనింగ్ (Mining) చేయడం ద్వారా!
యూఎస్ బేస్డ్ క్రిప్టో వ్యూహకర్త జేక్ పెర్సీ అంచనా ప్రకారం.. ఇరాన్ లో ఒక బిట్‌కాయిన్ మైనింగ్ చేయడానికి కేవలం $1,300 ఖర్చు అవుతుంది. కానీ మార్కెట్లో దాని వాల్యూ దాదాపు $73,000 దగ్గర ట్రేడవుతోంది. అంటే ఒక్క కాయిన్ పై ఇరాన్‌కు $71,700 భారీ మార్జిన్ మిగులుతోంది. ఆ వచ్చిన విలువను గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ తో పనిలేకుండా దేశం బయట వాడుకుంటున్నారు.
స్విఫ్ట్ (SWIFT) లేదు.. అమెరికా నిఘా లేదు!
ఈ విధానం ద్వారా ఇరాన్ ఏకంగా రెండు దశాబ్దాలుగా అమెరికా నిర్మించిన ఆంక్షల కోటకు బీటలు వారుస్తోంది. ఇక్కడ ఇంటర్నేషనల్ SWIFT ట్రాన్స్‌ఫర్లు ఉండవు. కరస్పాండెంట్ బ్యాంకుల ప్రమేయం ఉండదు. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నిఘా అసలే ఉండదు.
నేరుగా ప్రభుత్వ కంట్రోల్ లో ఉండే వాలెట్లకు బిట్‌కాయిన్లు బదిలీ అయిపోతాయి. అక్కడి నుంచి సైనిక ఆయుధాల కొనుగోళ్లకు విదేశీ సప్లయర్స్‌కు డైరెక్ట్‌గా పేమెంట్స్ జరిగిపోతాయి.
$7.78 బిలియన్ల క్రిప్టో ఎకోసిస్టమ్.. రంగంలో సైన్యం!
బ్లాక్‌చెయిన్ అనలిటిక్స్ సంస్థ 'చైన్ అనాలిసిస్' (Chainalysis) డేటా ప్రకారం.. 2025 నాటికి ఇరాన్ క్రిప్టో ఎకోసిస్టమ్ ఏకంగా $7.78 బిలియన్లకు చేరుకుంది. ఆంక్షలున్నా సరే ఇది విపరీతంగా విస్తరించింది.
ఇరాన్ సైనిక విభాగం అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కు సంబంధించిన ఖాతాలే ఈ లావాదేవీల్లో సగానికి పైగా ఉన్నాయి. 2025 చివర్లో వీరు ఏకంగా $3 బిలియన్లను క్రిప్టో ద్వారా మూవ్ చేశారు. "ఇది సామాన్యులు చేసే ట్రేడింగ్ కాదు.. ఇది పూర్తి స్థాయి మిలిటరీ ఫైనాన్షియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్" అని జేక్ పెర్సీ స్పష్టం చేశారు.
దాడుల గుట్టు రట్టుచేసిన 'బ్లాక్ చెయిన్'
అయితే బిట్‌కాయిన్ టెక్నాలజీ ఒక పబ్లిక్ లెడ్జర్. ప్రతి లావాదేవీ అందులో శాశ్వతంగా రికార్డ్ అవుతుంది. ఇదే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఒక కొత్త నిఘా ఆయుధంగా మారింది.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరిగినప్పుడు ఈ బ్లాక్ చెయిన్ ద్వారానే ఆసక్తికరమైన నిజాలు బయటపడ్డాయి. దాడుల స్కేల్ గురించి అధికారిక వార్తలు రాకముందే.. ఇరాన్ అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజ్ 'నోబిటెక్స్' (Nobitex) నుంచి భారీగా నిధులు బయటకు వెళ్లిపోయాయి.
ఫిబ్రవరి 28 నుంచి మార్చి 2 మధ్యలో ఏకంగా $10.3 మిలియన్ల ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అయ్యాయి. గంటకు జరిగే వాల్యూమ్ 2026 సగటు కంటే ఏకంగా 873% పెరిగింది. యుద్ధం జరుగుతున్నప్పుడు రియల్ టైమ్ లో డబ్బు ఎలా మారుతోందో ఈ బ్లాక్ చెయిన్ సిగ్నల్స్ స్పష్టంగా చూపించాయి.
రష్యా, నార్త్ కొరియాలదీ ఇదే దారి
ఒక్క ఇరాన్ మాత్రమే కాదు.. చాలా దేశాలు ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ఈ క్రిప్టో లూప్ హోల్స్ వాడుతున్నాయి. చైన్ అనాలిసిస్ 2026 క్రైమ్ రిపోర్ట్ ప్రకారం:
- 2025లో చట్టవిరుద్ధమైన క్రిప్టో అడ్రస్‌లకు ఏకంగా $154 బిలియన్లు చేరాయి (ఇందులో ఆంక్షలున్న సంస్థలకు చేరిన నిధుల్లో 694% జంప్ కనిపించింది).
- రష్యా ఏకంగా $93 బిలియన్లను డాలర్ సిస్టమ్ బయట పనిచేసే ఒక శాంక్షన్డ్ స్టేబుల్ కాయిన్ ద్వారా ప్రాసెస్ చేసింది.
- ఇక నార్త్ కొరియా హ్యాకర్లు ఒకే దెబ్బకు $1.5 బిలియన్లను క్రిప్టో ఎక్స్ఛేంజ్ నుంచి దొంగిలించి, ఆ డబ్బును డైరెక్ట్ గా అణు ఆయుధాల ప్రోగ్రామ్ కు మళ్లించారు.
అమెరికా డాలర్ ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి ఇరాన్, రష్యా లాంటి దేశాలు క్రిప్టోకరెన్సీని ఒక మిలిటరీ వెపన్ లాగా వాడుకుంటున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో క్రిప్టో మార్కెట్‌పై అమెరికా సహా ప్రపంచ దేశాలు 'జాతీయ భద్రత' (National Security) పేరుతో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించడం ఖాయం. అప్పుడు బిట్‌కాయిన్ మార్కెట్ అమాంతం కుప్పకూలే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక సామాన్య ఇన్వెస్టర్‌గా.. క్రిప్టో ట్రేడింగ్ లాభాలను చూసి గుడ్డిగా భారీ పెట్టుబడులు పెట్టకండి. ఇది హై-రిస్క్, జియోపాలిటిక్స్ తో ముడిపడిన వ్యవహారం కాబట్టి, మీ ఎమర్జెన్సీ ఫండ్స్‌ను సేఫ్ అసెట్స్ (గోల్డ్, బ్యాంక్ ఎఫ్డీ) లలోనే ఉంచుకోవడం ఫైనాన్షియల్ గా ఎంతో సేఫ్!

