Section 301: భారత్‌పై ట్రంప్ బ్రహ్మాస్త్రం.. సుంకాలకు స్కెచ్

naveen
By -
భారత్‌పై ట్రంప్ బ్రహ్మాస్త్రం.. సుంకాలకు స్కెచ్


US Trade Act of 1974: సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చినా తగ్గని ట్రంప్.. భారత్‌పై మరో బ్రహ్మాస్త్రం 'సెక్షన్ 301'!


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో, ఏ దేశంపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారో ఊహించడం కష్టంగా మారింది. గత ఏడాది (2025) జనవరిలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన భారత్, చైనా, మెక్సికో, కెనడా వంటి దేశాలపై రికార్డు స్థాయిలో దిగుమతి సుంకాలు విధించారు. అయితే, ట్రంప్ ఎడాపెడా విధించిన ఈ భారీ సుంకాలు చెల్లవంటూ ఇటీవల అమెరికా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గని ట్రంప్, తన ప్రధాన వాణిజ్య భాగస్వాములపై ఎలాగైనా టారిఫ్స్ వసూలు చేసేందుకు ఇప్పుడు 'సెక్షన్-301' (Section 301) అనే సరికొత్త చట్టపరమైన ఆయుధాన్ని బయటకు తీశారు.


16 దేశాలపై నిఘా.. లిస్టులో భారత్!


ఈ సెక్షన్ 301 కింద భారత్, చైనా సహా మొత్తం 16 వాణిజ్య భాగస్వామ్య దేశాలపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించేందుకు అమెరికా రంగం సిద్ధం చేసింది. దీనిపై యూఎస్ వాణిజ్య శాఖ ప్రతినిధి జేమిసన్ గ్రీర్ కీలక ప్రకటన చేశారు. 1974 యూఎస్ ట్రేడ్ యాక్ట్‌లోని ఈ సెక్షన్ కింద యూరోపియన్ యూనియన్ (EU), సింగపూర్, స్విట్జర్లాండ్, భారత్, చైనా, నార్వే, మలేసియా, ఇండోనేసియా, కాంబోడియా, వియత్నాం, సౌత్ కొరియా, బంగ్లాదేశ్, తైవాన్, థాయ్‌లాండ్, జపాన్, మెక్సికో దేశాలపై దర్యాప్తు జరగనుందని ఆయన స్పష్టం చేశారు. ఆశ్చర్యకరంగా ఈ లిస్టులో కెనడా పేరు మాత్రం లేదు.


అసలేంటీ 'సెక్షన్ 301'?


ఇతర దేశాలు అనుసరిస్తున్న అన్యాయమైన వాణిజ్య విధానాలను సవాల్ చేసేందుకు అమెరికాకు ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధమే ఈ సెక్షన్ 301. ఆయా దేశాలు పాటిస్తున్న ట్రేడ్ పాలసీల వల్ల అమెరికా ప్రయోజనాలకు, వ్యాపారాలకు నష్టం జరుగుతుందా అనే కోణంలో ఈ చట్టం కింద దర్యాప్తు చేసి సాక్ష్యాలు సేకరిస్తారు. ఒకవేళ ఆయా దేశాల విధానాలు అమెరికాకు నష్టం కలిగించేలా ఉన్నాయని తేలితే.. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) అనుమతితో సంబంధం లేకుండానే ఆ దేశాలపై నేరుగా చర్యలు తీసుకునే సర్వాధికారం అమెరికాకు లభిస్తుంది. అప్పుడు చట్టబద్ధంగానే భారీ సుంకాలు, ప్రతీకార చర్యలు చేపట్టవచ్చు.


మిత్ర దేశమైనా.. భారత్‌పై కన్నెర్ర ఎందుకు?


అమెరికాకు చైనా బద్ధ శత్రువు కాబట్టి దర్యాప్తు చేయడం సహజం. కానీ, భారత్ లాంటి మిత్ర దేశంపై కూడా సెక్షన్ 301 కింద దర్యాప్తు చేపట్టడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అమెరికా ఉత్పత్తులపై భారత్ విపరీతంగా సుంకాలు విధిస్తోందని, వాణిజ్యపరంగా అన్యాయ పద్ధతులను అవలంబిస్తోందని ట్రంప్ ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. 


ఒక దశలో భారత్‌పై దిగుమతి సుంకాల్ని 25 శాతానికి పెంచిన ట్రంప్.. ఆ తర్వాత భారత్ రష్యాతో చమురు కొనుగోలు చేస్తోందన్న కోపంతో మరో 25 శాతం పెంచి ఏకంగా 50 శాతానికి చేర్చారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చలతో ఆ ప్రతీకార సుంకాల్ని తొలగించి, మొత్తంగా 18 శాతానికి తగ్గించారు. కానీ ఇప్పుడు మళ్లీ ట్రంప్ ఈ సెక్షన్ 301ను తెరపైకి తీసుకురావడం ఇండో-యూఎస్ వాణిజ్య సంబంధాలపై కొత్త ఆందోళనలను రేకెత్తిస్తోంది.