Hormuz Strait Crisis: ట్రంప్‌కు షాకిచ్చిన మిత్ర దేశాలు.. ఇరాన్‌పై సైనిక చర్యకు మేం రాబోమన్న బ్రిటన్, జపాన్!
అంతర్జాతీయ రాజకీయాల్లో అగ్రరాజ్యం అమెరికాకు, ముఖ్యంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ, ఇరాన్ దిగ్బంధించిన అత్యంత కీలకమైన ‘హార్మూజ్ జలసంధి’ని (Strait of Hormuz) తెరిపించేందుకు ప్రపంచ శక్తులన్నీ ఏకమై యుద్ధ నౌకలను పంపాలని ట్రంప్ బహిరంగ విజ్ఞప్తి చేశారు.
అయితే, ట్రంప్ ఆశలపై అమెరికా కీలక మిత్ర దేశాలన్నీ నీళ్లు చల్లాయి. సైనిక జోక్యానికి తాము సిద్ధంగా లేమంటూ ఆయన విజ్ఞప్తిని ఒక్కొక్కటిగా తిరస్కరించాయి. ఈ పరిణామంతో యూఎస్ అధ్యక్షుడు ఆశించిన "సహకరించే దేశాల కూటమి" (Coalition of the willing) కాస్తా.. ఇప్పుడు "అతి జాగ్రత్త వహించే దేశాల కూటమి" (Coalition of the cautious)గా మారిపోయిందని అంతర్జాతీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
యుద్ధనౌకల పంపిణీకి స్టార్మర్ బ్రేక్
గడిచిన వారాంతంలో ట్రంప్ నేరుగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌కు ఫోన్ చేసి, హార్మూజ్ జలసంధికి రాయల్ నేవీ డిస్ట్రాయర్లను (యుద్ధ నౌకలను) పంపాలని కోరారు. అయితే, ఈ ప్రాంతీయ యుద్ధంలోకి తమ దేశం నేరుగా తలదూర్చడానికి ఏమాత్రం సిద్ధంగా లేదని స్టార్మర్ కుండబద్ధలు కొట్టినట్లు తెలుస్తోంది.
భారీ యుద్ధనౌకలకు బదులుగా కేవలం సముద్రపు మందుపాతరలను వెతికే డ్రోన్లను (Mine-hunting drones) మాత్రమే పంపిస్తామని లండన్ ప్రకటించింది. ఇప్పటికే అమెరికా దళాలు ఇరాన్ తీరప్రాంతంపై బాంబుల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో.. ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేయడం తమకు ఇష్టం లేదని బ్రిటన్ ఇంధన శాఖ కార్యదర్శి ఎడ్ మిలిబాండ్ కూడా స్పష్టం చేశారు.
వెనక్కి తగ్గిన ఆస్ట్రేలియా, జపాన్
కేవలం బ్రిటన్ మాత్రమే కాదు, పసిఫిక్ ప్రాంతంలోని అమెరికా కీలక మిత్ర దేశాలు సైతం ట్రంప్‌కు మొండిచేయి చూపాయి. పశ్చిమాసియాకు యుద్ధనౌకలను పంపే ఉద్దేశం తమకు లేదని ఆస్ట్రేలియా రవాణా శాఖ మంత్రి క్యాథరిన్ కింగ్ తేల్చి చెప్పారు. ఇంధన సరఫరా ఆగిపోవడం వల్ల వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ ఇరాన్ తో సైనిక ఘర్షణకు మాత్రం సమ్మతం కాదని ఆమె స్పష్టం చేశారు.
మరోవైపు, తమ దేశ ఇంధన అవసరాలకు కావాల్సిన చమురులో 70 శాతం ఈ హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నప్పటికీ.. జపాన్ సైతం తమ సైన్యాన్ని పంపడానికి నిరాకరించింది. తమ రాజ్యాంగ పరమైన నిబంధనలు విదేశాల్లో నేరుగా సైనిక జోక్యానికి అంగీకరించవని టోక్యో వర్గాలు వెల్లడించాయి.
చైనాపై ట్రంప్ ఫైర్
తన అత్యంత సన్నిహిత మిత్ర దేశాల నుంచి ఆశించిన స్థాయిలో సైనిక స్పందన రాకపోవడంతో డొనాల్డ్ ట్రంప్ తన వ్యూహాన్ని మార్చారు. హార్మూజ్ జలసంధి ద్వారా అత్యధికంగా లబ్ధి పొందుతున్నది చైనాయేనని, అందుకే దాని రక్షణకయ్యే ఖర్చును కూడా బీజింగ్ భరించాలని ఆయన డిమాండ్ చేస్తూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. "చైనాకు అందే చమురులో దాదాపు 90 శాతం ఈ జలసంధి నుంచే రవాణా అవుతోంది. కాబట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసే బాధ్యత, ఆర్థిక భారం ఆ దేశానిదే" అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
మొత్తానికి, ఇరాన్ తీరంలో అమెరికా చేస్తున్న ఈ ఒంటరి పోరాటంలో మిత్రపక్షాలు సైతం ఆచితూచి అడుగులు వేస్తుండటం ప్రపంచ వాణిజ్య వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

