నిన్నటిదాకా వంట గ్యాస్ సిలిండర్ దొరకట్లేదని టెన్షన్ పడ్డాం.. ఇప్పుడు పోపు డబ్బాకు కూడా ఎసరు రాబోతోంది! పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎఫెక్ట్ తో మన కిరాణా షాపుల్లో వంట నూనె ప్యాకెట్ రేటు కేవలం రెండు వారాల్లోనే 20 రూపాయలు పెరిగిపోయింది. ఒకపక్క సిలిండర్లు లేక హోటళ్లు మూతపడుతుంటే.. ఇంట్లో వండుకుందామంటే నూనె ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సామాన్యుడి జేబును గుల్ల చేస్తున్న ఈ ఆయిల్ మంట వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? రాబోయే రోజుల్లో రేట్లు ఇంకెంత పెరగబోతున్నాయో తెలుసుకుందాం.
సెంచరీ దాటేసిన సన్‌ఫ్లవర్, పామాయిల్!
రెండు వారాల కిందటితో పోలిస్తే మార్కెట్లో వంటనూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. లీటర్ పామాయిల్ ప్యాకెట్ రిటైల్ గా రూ.127 కి చేరింది. మనం రెగ్యులర్ గా వాడే ఫ్రీడమ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ రూ.174, వేరుశనగ నూనె ఏకంగా రూ.180 కి అమ్ముడవుతున్నాయి.
కేవలం 15 రోజుల్లోనే ప్రతి ప్యాకెట్ మీద 15 నుంచి 20 రూపాయల భారం పెరిగింది. ఇక 15 లీటర్ల ఫ్రీడమ్ ఆయిల్ డబ్బా గతంలో రూ.2450 ఉంటే, ఇప్పుడు అది రూ.2600 కు ఎగబాకడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. యుద్ధం ఇలాగే కంటిన్యూ అయితే ఈ రేట్లు సామాన్యుడికి అందనంత దూరానికి వెళ్తాయని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విదేశాల నుంచి ఆగిపోయిన సప్లై చైన్
వంటనూనెల దిగుమతిలో ప్రపంచంలోనే మన దేశం అగ్రగామి. అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి సోయా నూనె సముద్ర మార్గంలో రావాలంటే దాదాపు 6 వారాలు పడుతుంది. రష్యా, ఉక్రెయిన్ నుంచి నల్ల సముద్రం మీదుగా సన్‌ఫ్లవర్ ఆయిల్ రావడానికి 3 నుంచి 4 వారాల సమయం తీసుకుంటుంది.
ఇక ఆసియా దేశాలైన ఇండోనేషియా, థాయ్‌లాండ్, మలేషియాల నుంచి పామాయిల్ దిగుమతి కావడానికి వారం రోజులు పడుతుంది. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ సముద్ర మార్గాలన్నీ యుద్ధం వల్ల డేంజర్ జోన్ లో పడిపోవడంతో ఈ సరుకు రవాణా పూర్తిగా ఆలస్యమవుతోంది.
మూసుకుపోయిన 'హోర్ముజ్'.. దెబ్బతిన్న దిగుమతులు
అమెరికాకు అండగా ఉంటున్న పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు చేస్తుండటంతో గల్ఫ్ ప్రాంతం అగ్నిగుండంగా మారింది. ఇంటర్నేషనల్ ట్రేడ్ కి అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి' మూసుకుపోవడంతో ఆయిల్ రవాణా పూర్తిగా ఆగిపోయింది.
ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు దొరక్క దేశవ్యాప్తంగా నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇప్పుడు ఈ వంటనూనెల (Cooking Oil) దిగుమతులు కూడా తగ్గడంతో భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయం జనాల్లో ఎక్కువవుతోంది.
ఒక పక్క గ్యాస్ కష్టాలు, మరోపక్క భగ్గుమంటున్న ఆయిల్ రేట్లు చూస్తుంటే సామాన్యుడికి పస్తులు తప్పేలా లేవు. గల్ఫ్ యుద్ధం ఏ క్షణాన ఆగుతుందో ఎవరికీ తెలియని పరిస్థితి. వ్యాపారులు ఈ కొరతను సాకుగా చూపి బ్లాక్ మార్కెట్ చేసి రేట్లు మరింత పెంచే ప్రమాదం ఉంది. కాబట్టి పానిక్ బయ్యింగ్ చేసి డబ్బాలకు డబ్బాలు నిల్వ చేయకపోయినా.. కనీసం నెల రోజులకు సరిపడా కిరాణా సరుకులను ముందే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. ఆరోగ్య రీత్యా కూడా వంటల్లో ఆయిల్ వాడకాన్ని కాస్త తగ్గించుకోవడం ఇప్పుడు ఆర్థికంగానూ అత్యంత ప్రాక్టికల్ నిర్ణయం!

