మనం రోజు వాడే బండిలో పెట్రోల్ కొట్టించాలంటే రేటు చూసి భయపడే రోజులు మళ్లీ రాబోతున్నాయా? అవుననే అంటున్నాయి అంతర్జాతీయ మార్కెట్ లెక్కలు. పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పుడు నేరుగా మన పెట్రోల్ బంకుల మీద, గ్యాస్ సిలిండర్ల మీద పడబోతోంది. ప్రపంచానికే చమురు సరఫరా చేసే అత్యంత కీలకమైన 'హర్మూజ్ జలసంధి' మార్గంలో ఏకంగా 700 పైగా చమురు నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోవడంతో పెను సంక్షోభం ముంచుకొస్తోంది. అసలు మన దేశంలో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వలు ఇంకెన్ని రోజులకు సరిపోతాయి? ఈ ముప్పును ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం వేస్తున్న అత్యవసర ప్లాన్ ఏంటో ఒక సామాన్యుడిగా మీరు కచ్చితంగా తెలుసుకోవాలి.
స్తంభించిన హర్మూజ్ జలసంధి.. 86 శాతం పడిపోయిన రవాణా
అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తమ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించడాన్ని ఇరాన్ ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తున్న ఇరాన్, ఏకంగా ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిని దిగ్బంధించింది. ఆ మార్గం గుండా ఎవరైనా దాటేందుకు ప్రయత్నిస్తే ట్యాంకర్లను పేల్చేస్తామని ఇరాన్ తీవ్రంగా హెచ్చరించడంతో, గత రెండు రోజుల్లోనే ఆ సముద్ర మార్గంలో రవాణా ఏకంగా 86 శాతం మేర పడిపోయింది.
విండ్‌వర్డ్, కెప్లర్ లాంటి మారిటైమ్ డేటా సంస్థల లెక్కల ప్రకారం, రోజుకు సగటున 19.8 మిలియన్ బ్యారెళ్ల చమురు వెళ్లాల్సిన ఈ మార్గంలో, మార్చి 1న కేవలం మూడు ట్యాంకర్లు మాత్రమే వెళ్లాయి. ప్రస్తుతం ఇరువైపులా 700కు పైగా ట్యాంకర్లు (ఇందులో క్రూడాయిల్, శుద్ధిచేసిన ఇంధన ట్యాంకర్లు ఉన్నాయి) సముద్రం మధ్యలోనే నిలిచిపోవడంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లలో వణుకు మొదలైంది.
భగ్గుమంటున్న ధరలు.. ఇండియాపై డైరెక్ట్ ఎఫెక్ట్
సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ రాస్ తనూరా, ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ ప్లాంట్లపై ఇరాన్ దాడి చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా కుప్పకూలే ప్రమాదం ఏర్పడింది. దీని ఫలితంగా ఇప్పటికే బ్రెంట్ క్రూడాయిల్ ధర 10 శాతం పెరిగి బ్యారెల్ 80 డాలర్లకు చేరుకోగా, ఐరోపాలో గ్యాస్ ధరలు ఏకంగా 50 శాతం పెరిగాయి.
మన దేశం తన దేశీయ అవసరాల్లో 80 నుంచి 85 శాతం గ్యాస్‌ను, ముడి చమురును గల్ఫ్ దేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ సరఫరా మొత్తం హర్మూజ్ జలసంధి గుండానే రావాలి. అక్కడి నుంచి ట్యాంకర్ల రాక నిలిచిపోతే, మన దగ్గర ఉన్న ప్రస్తుత గ్యాస్ నిల్వలు కేవలం మరో రెండు వారాల వరకు మాత్రమే సరిపోతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేంద్రం అత్యవసర ప్లాన్.. నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయి?
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. మన దేశీయ అవసరాలను కాపాడుకునేందుకు, విదేశాలకు చేసే పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై కేంద్రం త్వరలోనే నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశం ఉత్పత్తి చేస్తున్న పెట్రోల్‌లో మూడో వంతు, డీజిల్‌లో నాలుగో వంతు విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఈ ఎగుమతులను ఆపేసి ఆ నిల్వలను మన కోసమే వాడుకోవాలని సర్కార్ భావిస్తోంది.
దీనిపై కేంద్ర ఇంధన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి స్పందిస్తూ, "దేశంలో ప్రధాన పెట్రోలియం ఉత్పత్తుల లభ్యత, అందుబాటు ధరలను నిర్ధారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతం మన దగ్గర 74 రోజుల వరకు సరిపడే ఇంధన నిల్వలు సురక్షితంగా ఉన్నాయి" అని ట్విట్టర్ ద్వారా ప్రజలకు భరోసా ఇచ్చారు. అలాగే హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ లాంటి సంస్థలు దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచుతున్నాయని వెల్లడించారు.
కేంద్ర మంత్రి చెప్పిన లెక్కల ప్రకారం మన దగ్గర 74 రోజుల వరకు మాత్రమే ఇంధన నిల్వలు ఉన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించినట్లు ఈ యుద్ధం కొద్ది వారాల పాటు ఇలాగే సాగితే.. ఈ నిల్వలు కరిగిపోయి పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలు అమాంతం పెరిగిపోవడం గ్యారెంటీ. కాబట్టి సామాన్యుడిగా మనం రేపటి నుంచే వ్యక్తిగత వాహనాల వాడకాన్ని వీలైనంత తగ్గించి, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాడటం అలవాటు చేసుకోవాలి. ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా మాత్రమే రాబోయే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి మన జేబులను మనం కాపాడుకోగలం.

