క్యాష్ రిచ్ లీగ్ దెబ్బకు కకావికలం.. ఐపీఎల్ ముందు పాకిస్తాన్ సూపర్ లీగ్ పరువు పాయే!
క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు అదృశ్య యుద్ధం నడుస్తోంది. ఒకవైపు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. మరోవైపు దానితో పోటీ పడాలని ఉబలాటపడుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్). కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరిస్థితి చూసి జాలి పడాల్సిందే! ఒకప్పటి పీసీబీ దర్పం ఇప్పుడు పూర్తిగా పతనం అంచున నిలబడింది.
విమర్శల సునామీ.. పాక్ క్రికెట్‌కు గ్రహణం
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుపై ఇప్పుడు నలువైపుల నుంచి విమర్శల వర్షం కురుస్తోంది. మొన్నటి టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో పాక్ జట్టు అత్యంత దారుణంగా సూపర్-8 దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ మెగా ఈవెంట్ మిగిల్చిన గాయం మానకముందే.. బంగ్లాదేశ్ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో ఏకంగా పదకొండేళ్ల తర్వాత వన్డే సిరీస్‌ను కోల్పోయి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది.
ఈ హేయమైన పరిస్థితులపై మాజీ క్రికెటర్లు రషీద్ లతీఫ్, అహ్మద్ షెజాద్ లాంటి వారు పాక్ బోర్డు యాజమాన్యం తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ, గుడ్డి సెలక్టర్ల అనుచిత నిర్ణయాల వల్లే ఘనమైన పాకిస్తాన్ క్రికెట్ సర్వనాశనం అవుతోందని వారు బహిరంగంగానే మండిపడుతున్నారు.
ఐపీఎల్‌తో పోటీపడి.. బొక్కబోర్లా పడ్డ పీసీబీ
నిజానికి ఒకప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ద్వారా పాక్ బోర్డుకు కాస్తో కూస్తో మెరుగైన ఆదాయమే వచ్చేది. కానీ, వాళ్ళ అత్యాశే వాళ్ళ కొంప ముంచింది. గత కొన్ని సీజన్లుగా అత్యంత పవర్‌ఫుల్ లీగ్ అయిన ఐపీఎల్‌కు పోటీగా, కవ్వింపు చర్యలా పీఎస్ఎల్ షెడ్యూల్‌ను ఖరారు చేస్తోంది పీసీబీ. దీని ఫలితం ఏమైంది? ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ విదేశీ ఆటగాళ్లంతా డబ్బులు రాల్చే ఐపీఎల్ వైపే క్యూ కడుతుండగా.. అక్కడ అమ్ముడుపోని, ఫామ్ కోల్పోయిన ప్లేయర్లు మాత్రమే గత్యంతరం లేక పీఎస్ఎల్‌లో ఆడేందుకు వెళ్తున్నారు.
కళ్లుగప్పి జంప్.. ఐపీఎల్ మాయలో విదేశీ ఆటగాళ్లు
ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంది. ఒకవేళ ఐపీఎల్ జట్లలోని ఆటగాళ్లు గాయాలు, ఇతరత్రా కారణాల వల్ల టోర్నీకి దూరమైతే చాలు.. పీఎస్ఎల్‌లో ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు అర్ధాంతరంగా ఆ లీగ్‌ను వదిలేసి, రాత్రికి రాత్రే ఐపీఎల్‌లో చేరడానికి ఏమాత్రం వెనుకాడటం లేదు.
జింబాబ్వే స్టార్ పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ ఏకంగా పీఎస్ఎల్‌ను వదిలేసి ఐపీఎల్‌లో కేకేఆర్ జట్టులో చేరిపోగా.. శ్రీలంక కెప్టెన్ దసున్ షనక సైతం ఇదే బాటలో నడిచాడు. ఇంగ్లీష్ ప్లేయర్ సామ్ కర్రాన్ స్థానంలో షనక దర్జాగా రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరిపోయాడు. మరోవైపు ఆస్ట్రేలియా పేసర్ స్పెన్సర్ జాన్సన్, నాథన్ ఎల్లిస్ స్థానంలో ఏకంగా సీఎస్కేలోకి దూసుకొచ్చాడు.
ఒకవైపు పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల స్టేడియంలో కనీసం ప్రేక్షకులు కూడా లేకుండానే వెలవెలబోతూ మ్యాచ్‌లు నిర్వహిస్తున్న పీసీబీకి.. ఇలా ఆటగాళ్లు అర్ధంతరంగా ప్యాకప్ చెప్పేసి వెళ్లిపోవడం అతిపెద్ద తలనొప్పిగా మారింది.
కామెంటేటర్లు కూడా జంప్.. పీసీబీ లీకులు డమ్మీనే!
పరిస్థితి చెయ్యి దాటిపోతుండటంతో.. ఇలా ఒప్పందాలు బ్రేక్ చేసి వెళ్తున్న ఆటగాళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యామని పీసీబీ ఉద్దేశపూర్వకంగానే కొన్ని లీకులు ఇచ్చింది. అయినా సరే, పీఎస్ఎల్‌ను వీడి ఐపీఎల్‌లో చేరే ఆటగాళ్లు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఇక ఇప్పుడు ఈ జంపింగ్ జపాంగ్ జాబితాలో ఏకంగా కామెంటేటర్లు కూడా చేరిపోవడం పీసీబీకి మింగుడు పడని పరిణామం! ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నిక్ నైట్ తొలుత పీఎస్ఎల్ కామెంట్రీ ప్యానెల్‌లో ఉన్నాడు. కానీ తాజాగా అతడి పేరు ఐపీఎల్ స్టార్ స్పోర్ట్స్ కామెంట్రీ ప్యానెల్‌లో దర్శనమివ్వడం సంచలనంగా మారింది. అంటే, ఇప్పుడు ప్లేయర్లతో పాటు కామెంటేటర్లు కూడా పీఎస్ఎల్ బంధాన్ని తెంచుకుని ఐపీఎల్‌తో జట్టు కడుతున్నారన్న మాట.
స్టార్ స్పోర్ట్స్ ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్‌లో మన భారత దిగ్గజాలు సునిల్ గావస్కర్, రవిశాస్త్రి, వీరేందర్ సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్ లాంటి హేమాహేమీలతో కలిసి ఇప్పుడు నిక్ నైట్ వ్యాఖ్యానం చేయనున్నాడు. కాగా మార్చి 26న పీఎస్ఎల్ ఆరంభం కాగా.. మార్చి 28న ప్రపంచ క్రికెట్ పండుగ ఐపీఎల్-2026 సీజన్‌కు అట్టహాసంగా తెరలేవనుంది.
మొత్తానికి, ఐపీఎల్ సునామీ ముందు పీఎస్ఎల్ పేకమేడలా కూలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది!
Also Read:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌కు బుమ్రా దూరం? ఆకాశ్ ఎంట్రీ!క్యూలో నిలబడలేం.. ఎమ్మెల్యేల పంతం నెగ్గింది: ఐపీఎల్ ఫ్రీ టికెట్స్!
Pat Cummins SRH | సన్‌రైజర్స్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. బెంగళూరుకు ప్యాట్ కమిన్స్!
Axar Patel | ఐపీఎల్ ఇంపాక్ట్ రూల్‌పై కెప్టెన్ అక్షర్ పటేల్ సంచలన వ్యాఖ్యలు!
Sunrisers Abrar Ahmed: పాక్ ప్లేయర్ పై గవాస్కర్ ఫైర్

