ఉప్పల్ స్టేడియంలో ఆరెంజ్ ఆర్మీ అరుపులు ఇంకా మొదలవ్వకముందే.. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఐపీఎల్ 2026 మహా సంగ్రామానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల నరాల్లో కరెంట్ పుట్టించే వార్త ఇది. ఎందుకంటే, గాయంతో దూరమయ్యాడనుకున్న తమ అసలు సిసలైన నాయకుడు, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. ఊహించిన దానికంటే ముందే దండెత్తడానికి వస్తున్నాడు. ఈ వార్త కేవలం క్రీడాభిమానులకే కాదు, ఐపీఎల్ మజాను ఆస్వాదించే ప్రతి ఒక్కరికీ ఒక పండగే. ఎందుకంటే కమ్మిన్స్ మైదానంలో ఉంటే ఆ కిక్కే వేరు, ఆ ఆటే వేరు!
గాయాన్ని లెక్కచేయని పోరాటయోధుడు
తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్న కమ్మిన్స్ మొన్నటి టీ20 వరల్డ్ కప్ కూడా ఆడలేదు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని ఐపీఎల్ ఫస్ట్ హాఫ్‌కు దూరంగా ఉంచాలని చూసింది. కానీ, తనను నమ్ముకున్న ఫ్రాంచైజీ కోసం, తనకోసం ప్రాణమిచ్చే హైదరాబాద్ ఫ్యాన్స్ కోసం అతడు ఆపద్బాంధవుడిలా ముందుగానే వాలిపోతున్నాడు. మార్చి 28న ఆర్సీబీతో పోరు కోసం సన్‌రైజర్స్ జట్టు మంగళవారం బెంగళూరు చేరుకుంటుండగా.. కమ్మిన్స్ కూడా నేడే జట్టుతో కలవబోతుండటం ఆరెంజ్ ఆర్మీకి కొండంత బలాన్నిస్తోంది.
కిషన్ చేతిలో పగ్గాలు.. మైండ్‌గేమ్ షురూ
కమ్మిన్స్ అందుబాటులో ఉండడనే ఉద్దేశంతో ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం తమ పగ్గాలను డాషింగ్ కుర్రాడు ఇషాన్ కిషన్‌కు అప్పగించింది. ఆర్సీబీతో జరిగే తొలి మ్యాచ్‌లో కిషనే కెప్టెన్‌గా బరిలోకి దిగడం దాదాపు ఖాయం. మార్చి 25న ముంబైలో జరిగే ఐపీఎల్ కెప్టెన్ల సమావేశానికి కూడా అతడే హాజరుకానున్నాడు. అయితే, కమ్మిన్స్ డగౌట్‌లో ఉన్నాడన్న విషయమే ప్రత్యర్థి జట్లకు చెమటలు పట్టిస్తుంది. అతడి వ్యూహాలు, మైదానంలో ఆటగాళ్లకు ఇచ్చే ధైర్యం సన్‌రైజర్స్‌కు అదనపు బలం.
మలింగ ఎంట్రీ.. బౌలింగ్ దళం మరింత డేంజర్
మరోవైపు శ్రీలంక స్పీడ్‌స్టార్ ఎషాన్ మలింగ కూడా సన్‌రైజర్స్ శిబిరంలోకి దూసుకురానున్నాడు. శ్రీలంక బోర్డు నుంచి అతనికి ఎన్‌వోసీ లభించడంతో లైనప్ మరింత పటిష్టంగా మారింది. ఒకవైపు కమ్మిన్స్ వ్యూహాలు, మరోవైపు మలింగ యార్కర్లు.. ఈసారి ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ చూస్తే ప్రత్యర్థులకు వణుకు పుట్టడం ఖాయం.
ట్రోఫీ వేటలో ఎవరిది పైచేయి?
ప్యాట్ కమిన్స్ రాక కేవలం ఒక ఆటగాడి చేరిక కాదు.. అది సన్‌రైజర్స్ శిబిరంలో ఒక విస్ఫోటనం. కిషన్ లాంటి కుర్రాడికి కెప్టెన్సీ భారం ఉన్నా, వెనుక నుంచి కమిన్స్ నడిపించే తీరు ఈ సీజన్‌ను ఖచ్చితంగా శాసించబోతోంది. తొలి కొన్ని మ్యాచ్‌లలో కమిన్స్ కేవలం మెంటార్‌గానో, వ్యూహకర్తగానో వ్యవహరించి, పూర్తి ఫిట్‌నెస్ సాధించాక నేరుగా మైదానంలోకి సింహంలా దూకడం పక్కా. ఐపీఎల్‌లో ప్రతి బంతి రసవత్తరంగా మారబోతున్న ఈ తరుణంలో.. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేయడానికి సిద్ధంగా ఉండండి. ఈసారి ఆట మామూలుగా ఉండదు!
Also Read:
Axar Patel | ఐపీఎల్ ఇంపాక్ట్ రూల్‌పై కెప్టెన్ అక్షర్ పటేల్ సంచలన వ్యాఖ్యలు!Sunrisers Abrar Ahmed: పాక్ ప్లేయర్ పై గవాస్కర్ ఫైర్
IPL Umpire Salary 2026: ఐపీఎల్ అంపైర్లకు ఒక్కో మ్యాచ్‌కు ఎన్ని లక్షలు ఇస్తారో తెలుసా?
T20 World Cup 2026: సూర్యకుమార్ యాదవ్ వరల్డ్ రికార్డ్
R Ashwin Comments: పీఆర్ నెట్వర్క్ లపై అశ్విన్ ఫైర్

