Iran Mosaic Defense: అమెరికాకు చెమటలు పట్టిస్తున్న ఇరాన్

naveen
By -
Iran Mosaic Defense


Operation Epic Fury: ఖమేనీ మరణించినా ఇరాన్ ఎందుకు లొంగట్లేదు? ట్రంప్‌కు చెమటలు పట్టిస్తున్న 'మొజాయిక్ డిఫెన్స్' వ్యూహం ఇదే!


పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ప్రారంభించిన 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'తో ఇరాన్ పని అయిపోయిందని ప్రపంచమంతా భావించింది. సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణంతో ఆ దేశం కుప్పకూలుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అంచనా వేశారు. కానీ యుద్ధం మొదలై రెండు వారాలు గడుస్తున్నా, ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా డ్రోన్లు, క్షిపణులతో భీకరంగా విరుచుకుపడుతోంది. నాయకత్వం లేకపోయినా ఇరాన్ ఇంత దీటుగా ఎలా పోరాడుతోంది? అగ్రరాజ్యాలకు ముచ్చెమటలు పట్టిస్తున్న ఆ 'మొజాయిక్ డిఫెన్స్' (Mosaic Defense) వ్యూహం ఏంటి? దాని వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరో ఇప్పుడు డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం.


మొజాయిక్ డిఫెన్స్.. జఫారీ మాస్టర్ బ్రెయిన్


అమెరికాకు ప్రస్తుతం ఏమాత్రం మింగుడుపడని ఈ 'మెజాయిక్ డిఫెన్స్' వ్యూహానికి ఆద్యుడు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మాజీ కమాండర్-ఇన్-చీఫ్, మేజర్ జనరల్ మహ్మద్ అలీ జఫారీ. 2007 నుంచి 2019 వరకు ఆ అత్యున్నత పదవిలో ఉన్న ఆయన, ఇరాన్ సైనిక సిద్ధాంతాన్ని సమూలంగా మార్చేశారు.


2003లో అమెరికా దెబ్బకు సద్దాం హుస్సేన్ ప్రభుత్వం పేకమేడలా కూలిపోవడాన్ని ఆయన చాలా దగ్గరి నుంచి గమనించారు. సైనిక అధికారం మొత్తం ఒకే కేంద్రం (రాజధాని లేదా సుప్రీం లీడర్) చేతిలో ఉంటే, ఆ కేంద్రంపై దాడి జరిగిన వెంటనే మొత్తం సైన్యం చేతులెత్తేస్తుందని ఆయన గ్రహించారు. ఆ బలహీనతను అధిగమించడానికే ఈ వికేంద్రీకృత (Decentralized) రక్షణ వ్యవస్థకు ప్రాణం పోశారు.


లీడర్ లేకపోయినా ఆగని యుద్ధం.. ఇదీ ప్లాన్!


సాధారణంగా ఏదైనా దేశంపై దాడి జరిగినప్పుడు ఆ దేశ ప్రధాన నాయకత్వాన్ని మట్టుబెడితే సైన్యం చెల్లాచెదురై లొంగిపోతుంది. కానీ ఈ మొజాయిక్ డిఫెన్స్ వ్యూహంలో అది అసాధ్యం.


  • ఇరాన్ తన సైన్యాన్ని మొత్తంగా 31 ప్రావిన్షియల్ కమాండ్‌లుగా విభజించింది.
  • ప్రతి విభాగం ఒక స్వతంత్ర సైన్యంలా పని చేస్తుంది.
  • ఒకవేళ రాజధానితో కమ్యూనికేషన్ తెగిపోయినా, పైన కమాండ్ ఇచ్చే అగ్రనేతలు మరణించినా యుద్ధం ఆగదు.
  • ఆయా ప్రాంతాల్లోని స్థానిక కమాండర్లే తమ వద్ద ఉన్న ఆయుధాలు, సొంత నిఘా వ్యవస్థతో స్వతంత్రంగా దాడులు కొనసాగిస్తారు.


కేవలం దేశం లోపలే కాకుండా, సరిహద్దుల వెలుపల ఉన్న హిజ్బుల్లా వంటి మిలీషియా స్లీపర్ సెల్స్ కూడా ఈ వ్యూహంలో భాగమే. నాయకుడు లేకపోయినా సిస్టమ్ ఆటోమెటిక్‌గా పనిచేసుకుంటూ పోవడమే ఈ వ్యూహం స్పెషాలిటీ.


శత్రువును అలసిపోయేలా చేయడమే టార్గెట్


తమ రాజధానిపై బాంబులు వేసినా, అగ్రనేతలను చంపినా తమ యుద్ధ సామర్థ్యం ఏమాత్రం తగ్గదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. "యుద్ధం ఎప్పుడు, ఎలా ముగియాలో మేమే నిర్ణయిస్తాం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జఫారీ రూపొందించిన ఈ వ్యవస్థను ఛేదించి ఇరాన్‌ను లొంగదీసుకోవాలంటే, అమెరికా కేవలం రాజధానిని పట్టుకుంటే సరిపోదు, ఇరాన్ లోని ప్రతి అంగుళంపై పోరాడాల్సి ఉంటుంది. ఇది సుదీర్ఘకాలం పాటు సాగే గెరిల్లా తరహా యుద్ధం కాబట్టి, శత్రువును ఆర్థికంగా, సైనికంగా పూర్తిగా అలసిపోయేలా (War of Attrition) చేయడమే ఈ మొజాయిక్ డిఫెన్స్ ప్రధాన ఉద్దేశం.


అగ్రరాజ్యాల సాంకేతికత ఎంత గొప్పదైనా, కేంద్రీకృత వ్యవస్థలకే అది ముప్పు. ఇరాన్ దశాబ్దాల క్రితమే ఈ విషయాన్ని పసిగట్టి సైన్యాన్ని వికేంద్రీకరించడం వల్లే నేడు అమెరికా, ఇజ్రాయెల్ దాడులను తట్టుకుని నిలబడుతోంది. ఈ మొజాయిక్ డిఫెన్స్ ప్లాన్ చూస్తుంటే పశ్చిమాసియాలో ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు.