LPG Black Market: మండిపోతున్న వంట గ్యాస్.. బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్ ధర ఏకంగా రూ.6,500!
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ఎక్కడో ఉన్నా, దాని సెగలు మాత్రం వరంగల్ సహా దేశవ్యాప్తంగా ఉన్న సామాన్యుల వంటగదులకు గట్టిగానే తగులుతున్నాయి. ఇరాన్-అమెరికా ఘర్షణలతో ఇంధన సరఫరా ఆగిపోతుందన్న భయం, ఇప్పుడు అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎన్నడూ లేని విధంగా దేశవ్యాప్తంగా ఎల్‌పీజీ సిలిండర్లకు భారీ కొరత ఏర్పడటంతో, బ్లాక్ మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు ఈ కృత్రిమ కొరత వెనుక ఉన్న నిజమేంటి? ఈ దోపిడీపై ప్రభుత్వం ఏమంటోందో ఇప్పుడు వివరంగా చూద్దాం.
గుట్టుచప్పుడు కాకుండా దందా.. కళ్లు చెదిరే రేట్లు!
ఒకప్పుడు రూ. 900 నుంచి రూ. 1,000 మధ్య ఉన్న గ్యాస్ సిలిండర్ ధర, ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో వింటే గుండె ఆగిపోయే రేంజ్ కి చేరింది. వంటగ్యాస్ అక్రమ దందాను బట్టబయలు చేసేందుకు ఇటీవల ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
- కొత్త సిలిండర్: బ్లాక్ మార్కెట్‌లో ఒక్క ఎల్‌పీజీ సిలిండర్ ధర ఏకంగా రూ. 6,500 పలుకుతోంది.
- రీఫిల్లింగ్: కేవలం ఖాళీ సిలిండర్ ఇచ్చి రీఫిల్ చేయించుకోవడానికే రూ. 3,500 నుంచి రూ. 4,000 వరకు వసూలు చేస్తున్నారు.
ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లో స్మార్ట్ ఫోన్ రిపేర్ షాపులు, కిరాణా స్టోర్ల ముసుగులో ఈ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. "మేము చేయాల్సిన పనులల్లా చేస్తాం.. కానీ ఎవరికీ దొరకం" అంటూ ఓ అక్రమ వ్యాపారి కెమెరా ముందే ధీమా వ్యక్తం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
కోటాలో విద్యార్థుల ఆకలి కష్టాలు
రాజస్థాన్‌లోని కోచింగ్ హబ్ 'కోటా'లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. సుమారు 600 నుంచి 700 సిలిండర్ల అవసరం ఉన్న హాస్టళ్లు, మెస్ నిర్వాహకులు గ్యాస్ దొరక్క విద్యార్థులకు భోజనం పెట్టలేక చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేక కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చినా అది ఇంకా అమలు కాకపోవడంతో, చేసేదేమీ లేక బ్లాక్ మార్కెట్‌లో సిలిండర్‌కు రూ. 3,500 పెట్టి కొనుగోలు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు.
గ్యాస్ కొరత లేదు.. ఇదంతా పానిక్ బుకింగ్స్ ఎఫెక్ట్!
బ్లాక్ మార్కెట్ విజృంభణపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పందించారు. దేశంలో తగినంత చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ఎవరూ అనవసరంగా ఆందోళన చెందవద్దని ఆమె కోరారు.
కొరత ఎందుకు వచ్చిందంటే:
సాధారణ రోజుల్లో దేశవ్యాప్తంగా రోజుకు 55 లక్షల బుకింగ్‌లు జరిగేవి. కానీ యుద్ధం వార్తలు చూసి జనాలు భయపడి ముందే ఎగబడి బుక్ చేసుకోవడంతో, ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 88 లక్షలకు చేరింది. ప్రజల ఈ 'పానిక్ బయ్యింగ్' వల్లే మార్కెట్లో ఈ కృత్రిమ కొరత ఏర్పడిందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే 29 రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ పంపిణీ ప్రారంభమైందని, అక్రమంగా సిలిండర్లు నిల్వ చేసే వారిపై దాడులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు.
హార్మూజ్ జలసంధి మూసివేతే అసలు కారణం
భారత్ తన ఎల్‌పీజీ అవసరాలలో 60 శాతాన్ని విదేశీ దిగుమతుల ద్వారానే పొందుతుంది. అందులో 90 శాతం కేవలం గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్ ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిని మూసివేయడంతోనే ఈ ఇంధన సంక్షోభం తలెత్తింది.
యుద్ధం ఎఫెక్ట్ కంటే, దొరకదేమో అన్న భయంతో అవసరం లేకపోయినా సిలిండర్లు బుక్ చేసుకుంటూ పోవడం వల్లే ఈ బ్లాక్ మార్కెట్ దందా పుట్టుకొచ్చింది. ప్రభుత్వం దగ్గర తగినంత నిల్వలు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో, వినియోగదారులు అధికారిక ఛానెళ్ల ద్వారానే బుకింగ్ చేసుకుంటూ, ఆందోళన చెందకుండా ఉండటమే ఈ కృత్రిమ కొరతకు ఏకైక పరిష్కారం.

