నిన్నటిదాకా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ క్షిపణి దాడిలో కాళ్లు, చేతులు కోల్పోయి బంకర్‌లో చావుబతుకుల మధ్య ఉన్నాడన్న వార్తలు ప్రపంచాన్ని కుదిపేశాయి. అయితే, ఈ వార్తలకు బ్రేక్ వేస్తూ, గురువారం రాత్రి ఇరాన్ అధికారిక టీవీలో మొజ్తబా పేరుతో ఒక సంచలన ప్రకటన విడుదలైంది. "మా ప్రతీకారం ఇప్పుడే మొదలైంది.. హోర్ముజ్ జలసంధి మూసివేత కంటిన్యూ అవుతుంది" అంటూ నేరుగా అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. కానీ, ఈ వార్నింగ్ ఇచ్చింది మొజ్తబా స్వయంగా కాదు, ఒక టీవీ యాంకర్ ఆ ప్రకటనను చదివి వినిపించాడు! మొజ్తబా ఎందుకు బయటకు రాలేదు? అసలు ఈ హెచ్చరిక వెనుక ఉన్న ఇరాన్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఈ దెబ్బతో గ్లోబల్ మార్కెట్లు ఎందుకు కుప్పకూలుతున్నాయో, మన దేశంలో చమురు ధరల మంట ఎందుకు ఆగట్లేదో ఇప్పుడు చూద్దాం.
కనపడని లీడర్.. వినిపించిన వార్నింగ్!
ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో తండ్రి అలీ ఖమేనీతో పాటే మొజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డాడన్న వార్తలున్నాయి. ఈ అనుమానాలకు బలం చేకూర్చేలా, సుప్రీం లీడర్ అయ్యాక తొలిసారి ఇచ్చిన ఈ కీలక ప్రకటనను మొజ్తబా వీడియో రూపంలో కాకుండా, కేవలం ఒక స్టేట్‌మెంట్‌గా టీవీ యాంకర్ ద్వారా చదివించాడు.
అమెరికా సైనిక స్థావరాలను వెంటనే మూసివేయాలని, లేకపోతే దాడులు తప్పవని ఆ ప్రకటనలో హెచ్చరించాడు. అమెరికా భద్రత కల్పిస్తుందనేది పెద్ద అబద్ధమని తేల్చిచెప్పాడు.
హోర్ముజ్ బ్లాక్.. ఆస్తులు లాక్కుంటాం!
యుద్ధంలో జరిగిన ప్రతి మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని మొజ్తబా శపథం చేశాడు. శత్రువు (అమెరికా/ఇజ్రాయెల్) నుంచి కచ్చితంగా నష్టపరిహారం వసూలు చేస్తామని, అందుకు నిరాకరిస్తే వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని లేదా నాశనం చేస్తామని కుండబద్దలు కొట్టాడు.
మా ప్రతీకారం ఇంకా పూర్తి కాలేదని, హోర్ముజ్ జలసంధి మూసివేత అలాగే కొనసాగుతుందని, ఇరాన్ ఎప్పటికీ వెనక్కి తగ్గదని తేల్చిచెప్పాడు.
నా తండ్రి పిడికిలి చూశా.. ప్రతీకారం ఖాయం
తన తండ్రి అలీ ఖమేనీ మరణం గురించి మొజ్తబా ఎమోషనల్ గా స్పందించాడు. "ఆయన పార్థివదేహాన్ని చూసే గౌరవం నాకు దక్కింది. అప్పుడు కూడా ఆయన బిగించి ఉన్న పిడికిలి చెక్కుచెదరలేదు" అని పేర్కొంటూ.. అమరుల రక్తానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశాడు.
లెబనాన్, ఇరాక్, యెమెన్‌లోని తమ మిత్ర సాయుధ (ప్రాక్సీ) సమూహాలకు కృతజ్ఞతలు తెలిపాడు. మొజ్తబా ప్రకటనకు కొన్ని గంటల ముందే, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ కూడా యుద్ధం ఆపాలంటే 3 షరతులు పెట్టిన విషయం తెలిసిందే.
మొజ్తబా ఖమేనీ స్వయంగా టీవీ ముందుకు రాకపోవడం చూస్తుంటే ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. ఇరాన్ కేవలం తమ శత్రువులను భయపెట్టడానికే ఈ 'యాంకర్ స్టేట్‌మెంట్' స్ట్రాటజీని వాడి ఉండొచ్చు. అయితే, ఇరాన్ హెచ్చరికలతో ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్లు మరింత పానిక్ అవుతున్నాయి. "హోర్ముజ్ మూసివేత కంటిన్యూ అవుతుంది" అన్న ఒక్క మాటతో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటున్నాయి. జైశంకర్ దౌత్యంతో మన నౌకలు సేఫ్ గా వస్తున్నా, ఓవరాల్ గ్లోబల్ మార్కెట్ క్రాష్ అవుతుండటంతో రవాణా ఛార్జీలు పెరిగే ముప్పుంది.

