మన హైదరాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో వీకెండ్ వస్తే చాలు.. ఫ్యామిలీతో కలిసి సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లి బిర్యానీ తినాలో, మంచి భోజనం చేయాలో అని చాలామంది ప్లాన్ చేసుకుంటారు. కడుపునిండా తిన్న తర్వాత వెయిటర్ తెచ్చే బిల్లును మనం పెద్దగా గమనించకుండానే యూపీఐ స్కాన్ చేసి డబ్బులు కట్టేస్తుంటాం. కానీ, ఆ బిల్లులో మీ ప్రమేయం లేకుండానే వందల రూపాయల 'సర్వీస్ ఛార్జ్' లాగేస్తున్నారని మీకు తెలుసా? అసలు మనం అడగకుండానే బిల్లులో ఈ అదనపు ఛార్జీలు వేయడం చట్టబద్ధమేనా? ఈ దోపిడీని ప్రశ్నించే హక్కు సామాన్యుడికి ఉందా? మీ కష్టార్జితాన్ని హోటళ్ల వాళ్లు అడ్డగోలుగా లాగేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సర్వీస్ ఛార్జ్ మీ ఇష్టం.. బలవంతం లేదు!
రెస్టారెంట్లు లేదా హోటల్స్ కస్టమర్ల నుంచి సర్వీస్ ఛార్జ్ వసూలు చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. సర్వీస్ ఛార్జ్ అనేది కచ్చితంగా చెల్లించాల్సిన ఫీజు ఏమాత్రం కాదని, అది కేవలం కస్టమర్ ఇష్టానికే వదిలేయాలని స్పష్టం చేసింది. హోటల్ సిబ్బంది అందించిన సేవలు మీకు నచ్చితే, మీ అంతట మీరు సంతోషంగా ఇచ్చే టిప్ లాంటిదే ఈ సర్వీస్ ఛార్జ్. దీనిని యజమానులు నేరుగా కస్టమర్ల అనుమతి లేకుండా బిల్లులో యాడ్ చేయడం చట్టవిరుద్ధమని కేంద్రం తేల్చి చెప్పింది.
కంప్లైంట్ కోసం హెల్ప్‌లైన్ నంబర్లు
ఒకవేళ మీరు వెళ్లిన రెస్టారెంట్‌లో సర్వీస్ ఛార్జ్ చెల్లించాలని సిబ్బంది బలవంతం చేస్తే, మీరు ఎవరితోనూ గొడవ పడాల్సిన అవసరం లేదు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేరుగా దీనికోసం టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్ 1915 ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే, స్మార్ట్ ఫోన్ వాడేవారు 8800001915 అనే వాట్సాప్ నంబర్‌కు కూడా తమ బిల్లు ఫొటోతో సహా ఫిర్యాదు చేయవచ్చు. సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) ఈ ఫిర్యాదులను పరిశీలించి, నిబంధనలు పాటించని రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇటీవల ముంబై, పట్నాల్లో ఇలాగే బలవంతంగా 10 శాతం ఛార్జ్ వసూలు చేసిన రెస్టారెంట్లకు కోర్టులు భారీ పెనాల్టీలు విధించడంతో పాటు, కస్టమర్లకు ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని ఆదేశించాయి.
పేర్లు మార్చి దోచేస్తున్న హోటల్లు
కొన్ని తెలివైన రెస్టారెంట్ యాజమాన్యాలు కస్టమర్లను బురిడీ కొట్టించేందుకు సర్వీస్ ఛార్జ్ అనే పేరుకు బదులుగా స్టాఫ్ ఫండ్, ఫెసిలిటీ ఛార్జ్ లేదా అదర్ ఛార్జెస్ పేరిట బిల్లులో అదనపు మొత్తాన్ని వసూలు చేస్తున్నాయని లీగల్ నిపుణులు అపూర్వ అగర్వాల్ హెచ్చరిస్తున్నారు. సీసీపీఏ మార్గదర్శకాల ప్రకారం, కేవలం మెనూలో ఉన్న ధర దానికి సంబంధించిన జీఎస్టీ (GST) మాత్రమే కస్టమర్ చెల్లించాలి. ఈ పేర్లు మార్చిన ఛార్జీలు కూడా పూర్తిగా చట్టవిరుద్ధమే.
రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు బిల్లు రాగానే ముందుగా అందులో సర్వీస్ ఛార్జ్ యాడ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ యాడ్ చేసి ఉంటే, దాన్ని తొలగించి కొత్త బిల్లు ఇవ్వమని మేనేజర్‌ను సున్నితంగా అడగండి. చట్టం ప్రకారం వారు దాన్ని తీసేయాల్సిందే. అయినా వారు వినకుండా మీతో వాదనకు దిగితే, ఆ క్షణంలో గొడవ పడకుండా బిల్లు మొత్తం చెల్లించేయండి. కానీ, ఆ బిల్లును జాగ్రత్తగా ఫొటో తీసుకుని, ఆధారాలతో సహా 1915 నంబర్‌కు లేదా వాట్సాప్‌లో కంప్లైంట్ చేయండి. ప్రశ్నించే హక్కును మనం వినియోగించుకున్నప్పుడే, ఇలాంటి పగటి దోపిడీలకు శాశ్వత చెక్ పడుతుంది.

