ఏఐ మ్యాజిక్: బ్రోకర్ల ప్రమేయం లేకుండా ఇల్లు అమ్మి లక్ష డాలర్లు లాభం!

naveen
By -

బ్రోకర్లకు షాక్.. చాట్ జీపీటీతో ఇల్లు అమ్మి రూ.83 లక్షలు ఎక్స్‌ట్రా లాభం!


మనం కష్టపడి కట్టుకున్న ఇల్లు అమ్ముకోవాలంటే.. ముందుగా గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ ఏజెంట్లే! వాళ్లు చెప్పిందే రేటు.. వాళ్లు గీసిందే గీత. కానీ, ఆ బ్రోకర్ల మాయాజాలానికి చెక్ పెడుతూ, ఒక సామాన్యుడు ఏకంగా కృత్రిమ మేధస్సు (AI) సాయంతో తన ఇంటికి కళ్లు చెదిరే రేటు రాబట్టాడు! బ్రోకర్లు చెప్పిన దానికంటే ఏకంగా లక్ష డాలర్లు (రూ.83 లక్షలు) అదనంగా లాభం పొందిన ఆ అద్భుతమైన రియల్ ఎస్టేట్ మ్యాజిక్ స్టోరీ మీకోసం!


బ్రోకర్ల వలలో సామాన్యుడు.. 


ఇల్లు అమ్మాలన్నా, కొనాలన్నా మనలో చాలా మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లను ఆశ్రయించడం సర్వసాధారణం. మనం ఒక ధర చెబితే.. వాళ్లు తమ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఇంటిని అమ్మిపెడతారు. దానికి బదులుగా భారీ కమీషన్ జేబులో వేసుకుంటారు. కానీ కొందరు ఏజెంట్లు మాత్రం కమీషన్ కోసం కక్కుర్తి పడి.. ఇంటి ధరను అమాంతం పెంచి చెప్పి వచ్చిన కొనుగోలుదారులను వెనక్కి పంపేస్తుంటారు. లేదంటే, మార్కెట్ రేట్ కంటే తక్కువ రేటుకు ఒప్పించి మన కష్టార్జితానికి దారుణంగా గండి కొడుతుంటారు. సరిగ్గా ఇలాంటి మోసాలకే చెక్ పెట్టాడు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి. బ్రోకర్లను కాదని, కేవలం 'చాట్ జీపీటీ' (ChatGPT) సాయంతో తన ఇంటిని రికార్డు ధరకు అమ్ముకున్నాడు.


చాట్ జీపీటీ ఎంట్రీ.. సీన్ రివర్స్! 


అమెరికాలోని మియామి నగరానికి చెందిన రాబర్ట్ లెవిన్ అనే వ్యక్తి తన ఇంటిని ఎలాగైనా అమ్ముకోవాలని నిర్ణయించుకున్నాడు. ముందుగా కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లను సంప్రదించగా.. వాళ్లు ఒక సాధారణ రేటును ఫిక్స్ చేసి చెప్పారు. ఆ రేటు లెవిన్‌కు ఏమాత్రం రుచించలేదు. అప్పుడే అతడి బుర్రలో ఒక ఆలోచన మెరిసింది. 


ఏజెంట్లను నమ్ముకునే బదులు ఏఐ టూల్ 'చాట్ జీపీటీ' సాయం తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచన వచ్చింది. వెంటనే తన ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలను చాట్ జీపీటికి అందించాడు. అంతే.. సీన్ మొత్తం మారిపోయింది! ఇంటికి సరైన ధర నిర్ణయించడం నుంచి, అదిరిపోయే లిస్టింగ్ ప్రిపేర్ చేయడం, ఆకర్షణీయమైన మార్కెటింగ్ కంటెంట్ రూపొందించడం వరకు.. ప్రతి ఒక్క పనినీ చాట్ జీపీటీ చాలా స్మార్ట్‌గా, ఈజీగా చేసి పెట్టింది.


ఏఐ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్.. మూడు రోజుల్లో ఐదు ఆఫర్లు! 


చాట్ జీపీటీ కేవలం కంటెంట్ రాసి ఊరుకోలేదు.. లెవిన్‌కు ఒక మాస్టర్ స్ట్రోక్ లాంటి సలహా కూడా ఇచ్చింది. "నీ ఇల్లు అమ్మకానికి ఉందనే యాడ్‌ను ఫలానా పర్టిక్యులర్ టైంలోనే ఆన్‌లైన్‌లో పోస్టు చేయి.. అప్పుడే కొనుగోలుదారుల నుంచి నీకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది" అంటూ పక్కా టైమింగ్ చెప్పింది. ఆ ఏఐ టూల్ చెప్పినట్లే తూచా తప్పకుండా చేసిన లెవిన్‌కు.. యాడ్ ఇచ్చిన కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా ఐదు బంపర్ ఆఫర్లు క్యూ కట్టాయి! వారం తిరగక ముందే డీల్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయిపోయింది.


పెయింటింగ్ ట్రిక్.. కళ్లు చెదిరిన కొనుగోలుదారులు 


ఇల్లు అమ్మే ముందు చాట్ జీపీటీ ఇచ్చిన మరో సలహా లెవిన్ తలరాతను మార్చేసింది. "ఇల్లు అమ్మేద్దామని అనుకుంటున్నావు కదా.. అయితే ఇంట్లో అక్కడక్కడా పెయింటింగ్ అస్సలు బాగోలేదు. ఆ ఫలానా ప్రదేశాల్లో కొత్తగా పెయింటింగ్ వేస్తే బాగుంటుంది. ఇంటికి రంగులేయడానికి నువ్వు పెట్టే ప్రతి పైసా ఖర్చుకు వంద రెట్ల ప్రతిఫలం వస్తుంది" అని ఏఐ కచ్చితమైన సలహా ఇచ్చింది. 


దీంతో చాట్ జీపీటీ మాటను గుడ్డిగా నమ్మిన లెవిన్.. వెంటనే ఇంట్లో కొన్ని గదులకు ఆకర్షణీయమైన రంగులు వేయించాడు. ఆ కలర్‌ఫుల్ రంగులతో, ఎంతో అందంగా ముస్తాబైన ఇంటిని చూసి కొనుగోలుదారులు ఎగబడ్డారు. దీంతో లెవిన్ అనుకున్న దానికంటే చాలా ఎక్కువ రేటుకు ఆ ఇంటిని సొంతం చేసుకున్నారు.


బ్రోకర్లకు షాక్.. జేబులో లక్ష డాలర్ల ఎక్స్‌ట్రా లాభం! 


"సార్.. మీరు ఈ ఇంటిని 8.5 లక్షల డాలర్లకు (సుమారు రూ. 7 కోట్లు) విక్రయిస్తే చాలా మంచి రేటు వచ్చినట్టే" అని రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లెవిన్‌‌కు మొదటి రోజే నూరిపోశారు. కానీ, చాట్ జీపీటీ ఇచ్చిన తెలివైన సలహాలతో.. అతడు తన ఇంటిని ఏకంగా 9.54 లక్షల డాలర్లకు అంటే దాదాపు ఒక మిలియన్ డాలర్లకు అమ్ముకుని రికార్డు సృష్టించాడు! దీంతో బ్రోకర్లకు ఇవ్వాల్సిన భారీ కమీషన్ మిగలడంతో పాటు.. వాళ్లు చెప్పిన రేటు కంటే ఏకంగా లక్ష డాలర్లు (సుమారు రూ. 83 లక్షలు) అతడికి అదనంగా లాభం రావడం విశేషం.


అయితే, ఇల్లు అమ్మకం పూర్తయ్యాక, లీగల్ పేపర్ వర్క్ పూర్తి చేసే విషయంలో మాత్రం లెవిన్ ఒక లాయర్ సాయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్స్‌ను ఏఐ పూర్తిగా రీప్లేస్ చేయలేకపోయినప్పటికీ.. ఏఐ ఇచ్చిన అద్భుతమైన సలహాల వల్ల తన జేబులో అక్షరాలా లక్ష డాలర్లు మిగిలాయని లెవిన్ ఎంతో గర్వంగా చెబుతున్నాడు. దీన్నిబట్టి చూస్తుంటే.. భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో పనే లేకుండా, కేవలం ఏఐ సాయంతో మన ఆస్తులను మనమే కళ్లు చెదిరే రేటుకు అమ్ముకునే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని స్పష్టమవుతోంది!