ప్రపంచ ఇంధన సరఫరా ఆగిపోయింది! పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని చీకట్లోకి నెడుతున్నాయి.
ఎక్కడో సముద్రాల ఆవల జరుగుతున్న యుద్ధం కదా మనకేంటి అనుకుంటే పొరపాటే. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బకు ఇప్పుడు గ్లోబల్ ఎనర్జీ సప్లై (ప్రపంచ ఇంధన సరఫరా) కుప్పకూలింది. పర్షియన్ గల్ఫ్, గల్ఫ్ ఆఫ్ ఒమన్, అరేబియా సముద్రాలను కలిపే అత్యంత కీలకమైన సముద్ర మార్గం.. 'హార్మూజ్ జలసంధి'.
రోజుకు ఏకంగా 20 మిలియన్ బ్యారెళ్ల చమురు రవాణాకు ప్రాణాధారమైన ఈ ఇరుకైన జలసంధి ఇప్పుడు యుద్ధం దెబ్బకు మూతపడింది. ఈ భయంకర పరిణామంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇంధన ధరలు పెంచడం, పన్నుల పునర్వ్యవస్థీకరణ లాంటి కఠిన చర్యలు తీసుకోక తప్పని ప్రాణ సంకటంలో పడిపోయాయి.
భారత్‌లో ఊరట.. కానీ ఖజానాకు గండి!
ఈ కష్టకాలంలో భారత ప్రభుత్వం సామాన్యుడిపై భారం పడకుండా భారీ నిర్ణయం తీసుకుంది. వినియోగదారుల భారాన్ని తగ్గించేందుకు ఆర్థికపరమైన చర్యలకు ఉపక్రమించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని లీటరుకు రూ. 10 చొప్పున భారీగా తగ్గించింది. దీనివల్ల ప్రజా ఆదాయానికి గండిపడుతున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.
అలాగే, దేశీయ అవసరాలను కాపాడేందుకు డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్ (విమాన ఇంధనం) పై ఎగుమతి సుంకాలను సైతం కొత్తగా ప్రవేశపెట్టింది. అయితే, దేశంలో ఇంధనం లేదా ఎల్‌పీజీ (LPG) కొరత ఉందన్న వార్తలను అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇదంతా కేవలం పకడ్బందీగా చేస్తున్న తప్పుడు ప్రచారం అని వారు స్పష్టం చేశారు.
పాకిస్తాన్ విలవిల.. విమాన ప్రయాణాలు ఆకాశానికే!
దాయాది దేశం పాకిస్తాన్ పెరుగుతున్న అంతర్జాతీయ ధరలకు, దేశీయ స్థిరత్వానికి మధ్య సమతుల్యత సాధించేందుకు నానా తంటాలు పడుతోంది. కిరోసిన్ ధరలను భారీగా పెంచినా.. సామాన్యులను కాపాడేందుకు పెట్రోల్, డీజిల్ ధరలను మాత్రం పెంచకుండా ఆ ఖర్చును ప్రభుత్వమే మోస్తోంది. కానీ, విమాన ఇంధన ధరలు అమాంతం పెరగడంతో ఎయిర్‌లైన్స్ రంగం కుదేలైంది. ప్రధాన రూట్లలో దేశీయ విమాన ఛార్జీలు ఏకంగా 150 శాతం మేర పెరగడం అక్కడి పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
వెనిజులాలో వింత పరిస్థితి.. వారం పాటు సెలవులు!
వెనిజులా భిన్నమైన, కానీ దీనికి ముడిపడి ఉన్న మరో తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. సుదీర్ఘకాలంగా కురుస్తున్న ఎండలు దేశ విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చాయి. దీంతో విద్యుత్‌ను ఆదా చేసేందుకు పబ్లిక్ సెక్టార్, పాఠశాలలను వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ ప్రకటించారు. దేశం 45 రోజుల పాటు తీవ్రమైన ఉష్ణోగ్రతలను ఎదుర్కొందని, ఈ పవిత్ర వారంలో (Holy Week), విద్యా రంగానికి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం సెలవులు ప్రకటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
ఈజిప్ట్‌లో కఠిన ఆంక్షలు.. రాత్రి 9 గంటలకే అన్నీ బంద్!
ఈజిప్ట్ ప్రభుత్వం అత్యంత కఠినమైన విద్యుత్, ఇంధన ఆదా చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా దుకాణాలు, కేఫ్‌లు, రెస్టారెంట్లు రాత్రి 9 గంటలకల్లా తప్పనిసరిగా మూసివేయాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. అలాగే వీధి దీపాల వినియోగాన్ని సైతం భారీగా తగ్గించింది. తమ ఇంధన ఖర్చు రెట్టింపుకంటే ఎక్కువగా పెరిగిపోయిందని, డిమాండ్‌ను కంట్రోల్ చేసేందుకు ఈ అసాధారణ చర్యలు తీసుకోక తప్పడం లేదని ప్రధాన మంత్రి ముస్తఫా మద్బౌలీ ఆవేదన వ్యక్తం చేశారు.
వియత్నాం సంచలనం.. పన్నుల రద్దుతో భారీ ఉపశమనం!
ఇంధన మంటలను ఆర్పేందుకు వియత్నాం ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ ఫ్యూయల్‌పై ఉండే పర్యావరణ పరిరక్షణ పన్నులను ఏప్రిల్ మధ్య నాటికి పూర్తిగా నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్మూజ్ జలసంధిలో పెరుగుతున్న సంఘర్షణ చరిత్రలోనే అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని సృష్టిస్తోందని, ఈ విపత్కర పరిస్థితుల్లో ఇంధన మార్కెట్‌ను స్థిరీకరించి, జాతీయ ఇంధన భద్రతను కాపాడేందుకు తీసుకున్న అత్యవసర, సమర్థవంతమైన పరిష్కారం ఇదేనని అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ దెబ్బతో అంతకుముందు పెరిగిన పెట్రోల్ ధరలు ఏకంగా 26 శాతం, డీజిల్ ధరలు 15 శాతానికి పైగా పడిపోయి ప్రజలకు ఊరటనిచ్చాయి.
శ్రీలంకలో మళ్లీ క్యూలైన్లు.. పని దినాల్లో కోత!
శ్రీలంకలో మళ్లీ పాత రోజులు రిపీట్ అవుతున్నాయి. ఇంధన వినియోగాన్ని కట్టడి చేసేందుకు క్యూఆర్ (QR) ఆధారిత ఇంధన రేషనింగ్ విధానాన్ని ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. దీనిద్వారా వాహనాలకు వారపు వినియోగాన్ని పరిమితం చేసింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అక్కడ ఇంధన ధరలు మూడొంతులు పెరిగాయి. ఇంధన వాడకాన్ని తగ్గించేందుకు బుధవారాలను 'పని దినాలు కావు' (no-work days) గా అధికారులు ప్రకటించారు. అదే సమయంలో, ఎరువుల కొరత దేశాన్ని వణికిస్తోంది. దీనివల్ల ఆహార పదార్థాల ధరలు సైతం 15 శాతం మేర పెరిగే ప్రమాదం ఉందని తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
హార్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఏ క్షణాన ఏం జరుగుతుందో తెలియని అంధకారంలో ఉన్నాయి. పెరుగుతున్న ఇంధన ఖర్చులు, సరఫరా సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు తమ విధానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ప్రాణ సంకటంలో పోరాడుతున్నాయి. ఏది ఏమైనా.. సముద్రాల ఆవల రగులుతున్న ఈ చిచ్చు.. ప్రతి సామాన్యుడి జేబునూ దహించివేస్తోందన్నది అక్షర సత్యం!
Also Read:
ఇరాన్‌పై దాడులకు అమెరికా స్కెచ్.. రంగంలోకి యూఎస్ఎస్ ట్రిపోలీ!నో కింగ్స్: అమెరికా చరిత్రలోనే అతిపెద్ద అహింసాత్మక నిరసన
అమెరికా సంచలన రిపోర్ట్: ఉగ్రవాదులకు పాకిస్థానే స్వర్గధామం!
అమెరికాకు ఇరాన్ వార్నింగ్.. పశ్చిమాసియాలో మహా సంగ్రామం!
గల్ఫ్‌కు ఇరాన్ అల్టిమేటం.. క్షిపణులపై 'థాంక్యూ ఇండియా'!

