ప్రపంచంలో ఏ మూల రక్తపాతం జరిగినా.. దాని మూలాలు ఎక్కడో ఒక్కచోట ఆ ఒక్క దేశంతో ముడిపడి ఉంటాయి! సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నది ఎంత నిజమో.. ఆ దేశం ఉగ్రవాదానికి ఊయల అనడం అంతే పచ్చి నిజం. కానీ, ఒకప్పుడు ఇతరుల కోసం తవ్విన గొయ్యిలో ఇప్పుడు దాయాది దేశం పాకిస్థాన్ దారుణంగా పడిపోతోంది. తాను పెంచి పోషించిన ఉగ్రవాదమే ఇప్పుడు పాకిస్థాన్ పాలిట ప్రాణసంకటంగా మారుతోంది. ఈ పచ్చి నిజాన్ని అక్షరాల రూపంలో ప్రపంచం ముందు పెట్టింది అగ్రరాజ్యం అమెరికా!
ఉగ్రవాదులకు కేరాఫ్ అడ్రస్.. భారత్‌పై విషపు పడగ!
పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాదులు ఎలా రాజ్యమేలుతున్నారో అమెరికా ‘కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS)’ నివేదిక బట్టబయలు చేసింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడే ఉగ్ర మూకలకు పాకిస్థాన్ ఇప్పటికీ బహిరంగంగానే ఆశ్రయం కల్పిస్తోందని ఆ రిపోర్ట్ కుండబద్దలు కొట్టింది.
దశాబ్దాలుగా పాక్ ఆర్మీ ఎన్ని సైనిక ఆపరేషన్లు చేస్తున్నా, ఎన్ని విధానపరమైన చర్యలు చేపట్టినా.. అవన్నీ కంటితుడుపు చర్యలేనని, ఉగ్రవాద గ్రూపులు ఇప్పటికీ పాక్ భూభాగంలో దర్జాగా తమ రక్తపాత కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ముఖ్యంగా మన ఇండియాను లక్ష్యంగా చేసుకున్న పలు అత్యంత ప్రమాదకరమైన తీవ్రవాద గ్రూప్‌లు పాక్‌లో యథేచ్ఛగా యాక్టివ్‌గా ఉన్నాయని అమెరికా నివేదిక వెల్లడించింది.
రక్తం పారించిన ముఠాలు.. అక్కడే సేఫ్!
2001లో మన దేశ పార్లమెంట్‌పై దాడి చేసి నెత్తుటేరులు పారించిన ‘జైషే మహమ్మద్’.. ముంబయి వీధుల్లో 26/11 మారణహోమానికి పాల్పడిన ‘లష్కరే తొయిబా’ వంటి దారుణమైన ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ పాక్ భూభాగం నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ ఉగ్రమూకలు పాకిస్థాన్‌ను తమ సురక్షిత స్థావరాలుగా, విదేశాల్లో దాడులకు కుట్రలు పన్నే వేదికగా రెండూ విధాలా వాడుకుంటున్నాయని అమెరికా నివేదిక సంచలన విషయాలు బయటపెట్టింది.
తమ గొయ్యిలో తామే పడ్డ దాయాది!
ఇతరుల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన పాకిస్థాన్.. ఇప్పుడు అదే రాక్షసుడి చేతిలో విలవిల్లాడుతోంది. ఇటీవలి కాలంలో పాక్ గడ్డపై తీవ్రవాదం ఊహించని స్థాయిలో పెరిగిపోతోంది. ఒక లెక్క ప్రకారం, వరుసగా ఐదు సంవత్సరాలు తగ్గుముఖం పట్టి 2019లో 365కు పడిపోయిన ఉగ్రవాదుల మరణాల సంఖ్య.. ఆ తర్వాత మళ్లీ జడలు విప్పి ఏటా పెరుగూతూ 2025 నాటికి ఏకంగా 4,001కి చేరుకుంది. గత 11 ఏళ్ల పాక్ చరిత్రలో ఇదే అత్యధిక మరణాల రేటు అని నివేదిక కుండబద్దలు కొట్టింది. దీని ప్రకారం చూస్తే, ప్రపంచంలో తీవ్రవాదానికి అత్యధికంగా ప్రభావితమైన, బలైపోతున్న దేశం పాకిస్థానే కావడం ఒక వైపరీత్యం!
తాలిబన్ల ఎంట్రీతో.. రెచ్చిపోతున్న ఉగ్రమూకలు!
సరిహద్దు దేశం అఫ్గనిస్థాన్‌లో 2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి రావడం పాకిస్థాన్ కొంపముంచింది. అప్పటి నుంచి పాక్ గడ్డపై ఉగ్రవాదం పునరుజ్జీవనం పోసుకుంటోందని నివేదిక పేర్కొంది. చాలా వరకు ఉగ్రవాద సమూహాలు ఇస్లామిక్ తీవ్రవాద భావజాలంతోనే ప్రేరేపితమై రక్తపాతానికి తెగబడుతున్నాయని కాంగ్రెస్ రీసెర్చ్ సర్వీస్ గుర్తించింది.
ఈ భయంకరమైన ఉగ్ర సమూహాలను ప్రధానంగా ఐదు విస్తృత వర్గాలుగా విభజించింది. ప్రపంచవ్యాప్తంగా దాడులు చేసేవి, అఫ్గనిస్థాన్‌ను లక్ష్యంగా చేసుకున్నవి, భారత్ మరియు కశ్మీర్‌పై దాడులు చేసేవి, పాక్ స్వదేశంలో దాడులు చేసేవి, అలాగే మతతత్వ సంస్థలను టార్గెట్ చేసే వర్గాలుగా నివేదిక వర్గీకరించింది.
అల్ ఖైదా నుంచి ఇస్లామిక్ స్టేట్ దాకా..
అలాంటి ప్రమాదకరమైన ఉగ్ర సమూహాలలో ‘అల్ ఖైదా’ ఒకటి. ఒకప్పుడు దాని ప్రధాన బలం తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ.. ఆ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఇంకా తన కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. ఇతర తీవ్రవాద సంస్థలతో పొత్తులను కొనసాగిస్తూ మళ్లీ బలపడుతోంది. మరోవైపు ఇస్లామిక్ స్టేట్ ప్రాంతీయ అనుబంధ సంస్థ అయిన ‘ఇస్లామిక్ స్టేట్-ఖొరాసన్ ప్రావిన్స్ (IS-K)’లో ఏకంగా 4,000 నుంచి 6,000 మంది కరుడుగట్టిన ఫైటర్లు ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఇది ఇతర తీవ్రవాద సమూహాల మాజీ సభ్యులను తమలో చేర్చుకుని అఫ్గన్, పాకిస్థాన్‌లలో రక్తపాత కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
పాక్ ప్రభుత్వానికే ఎసరు పెడుతున్న సొంత ముఠా!
ఇక దేశీయంగా పాకిస్థాన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అత్యంత ప్రమాదకరమైన ఉగ్రవాద సమూహం ‘తెహ్రిక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)’. నివేదిక అంచనా ప్రకారం ఇందులో సుమారు 2,500 నుంచి 5,000 మంది ఉగ్రవాదులు ఉన్నారు. విచిత్రం ఏమిటంటే.. ప్రస్తుత పాకిస్థాన్ ప్రభుత్వాన్ని కూల్చివేసి, దేశంలో కఠినమైన షరియా చట్టాన్ని అమలు చేయడమే తమ ఏకైక లక్ష్యమని ఈ ముఠా బహిరంగంగానే ప్రకటించింది.
ఏమిటీ కాంగ్రేషనల్ రీసెర్చ్ సర్వీస్ (CRS)?
ఇంతటి సంచలన విషయాలు బయటపెట్టిన 'CRS' అనేది అమెరికా కాంగ్రెస్‌కు చెందిన ఒక స్వతంత్ర పరిశోధనా విభాగం. అమెరికా కాంగ్రెస్ సభ్యులు భవిష్యత్తులో సరైన, సమాచారంతో కూడిన కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడటానికి.. ఇది వివిధ అంతర్జాతీయ సమస్యలపై ఎప్పటికప్పుడు కాలానుగుణ నివేదికలను సిద్ధం చేస్తుంది. అయితే, సాంకేతికంగా దీని నివేదికలను అమెరికా కాంగ్రెస్ అధికారిక వైఖరిగా మాత్రం పరిగణించరు.
ఉగ్రవాదాన్ని ఒక ఆయుధంగా వాడుకున్న పాకిస్థాన్.. ఇప్పుడు అదే ఆయుధం తన గుండెల్లో దిగుతుంటే నెత్తురోడుతోంది. పాముకు పాలుపోసి పెంచితే అది కాటేయక మానదు అన్న సామెతకు నేటి పాకిస్థాన్ దుస్థితే అతిపెద్ద ఉదాహరణ!

