ఇరాన్‌పై దాడులకు అమెరికా స్కెచ్.. రంగంలోకి యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ!

naveen
By -

ఇరాన్‌పై దాడులకు అమెరికా స్కెచ్.. రంగంలోకి యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ!


పశ్చిమాసియాలో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. ఎఫ్‌-35 జెట్స్‌తో రంగంలోకి అమెరికా మృత్యునౌక!


పశ్చిమాసియాలో రణరంగం నెత్తురు మరుగుతోంది. ఇరాన్‌తో నెలకొన్న వివాదం ఏ క్షణంలోనైనా మహా సంగ్రామానికి దారితీసేలా ముదురుతోంది. సరిగ్గా ఈ ఉద్రిక్తతల నడుమ అమెరికా తన సైనిక కండబలాన్ని ప్రదర్శిస్తూ వినాశనానికి అడుగులు వేస్తోంది. ఏకంగా 3,500 మంది మెరైన్లు, నావికులతో కూడిన అతిపెద్ద ఉభయచర దాడి నౌక 'యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ (LHA-7)'ని నేరుగా పశ్చిమాసియా జలాల్లోకి దించి ఇరాన్ గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.


సముద్రంపై అమెరికా మృత్యుఘోష 


అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అధికారిక ప్రకటన ప్రకారం.. మార్చి 27న ఈ భారీ నౌక తమ నిర్దేశిత ఆపరేషనల్ జోన్‌కు చేరుకుంది. జపాన్‌లోని తన హోమ్ బేస్ నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసిన ఈ నౌక.. ఇప్పుడు నేరుగా యుద్ధ వాతావరణం ఉన్న ప్రాంతంలో మోహరించింది. యాక్టివ్ కంబాట్ థియేటర్‌లోకి (యుద్ధ రంగంలోకి) అమెరికాకు చెందిన అతిపెద్ద ఉభయచర దాడి (amphibious assault) నౌక ప్రవేశించడం ఈ పోరు తీవ్రతను స్పష్టం చేస్తోంది.


ఎఫ్‌-35 జెట్స్‌తో.. అత్యాధునిక శత్రుసంహారిణి 


మీడియా నివేదికల ప్రకారం, యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ అమెరికా నౌకాదళంలోనే అత్యంత అత్యాధునికమైనది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఎఫ్‌-35 లైట్నింగ్ II (F-35 Lightning II) ఫైటర్ జెట్‌లతో పాటు అనేక ఇతర ప్రమాదకరమైన యుద్ధ విమానాలను ఇది సునాయాసంగా ఆపరేట్ చేయగలదు. ఈ ఉద్రిక్తతల మధ్య కేవలం దళాలను, యుద్ధనౌకను మాత్రమే కాకుండా.. ఆ ప్రాంతంలో తమ పట్టును మరింత బిగించేందుకు అమెరికా అదనపు రవాణా, దాడి చేసే విమానాలను కూడా భారీగా రంగంలోకి దించింది.


సెంట్రల్ కమాండ్ తాజాగా విడుదల చేసిన ఫోటోలు యుద్ద వాతావరణాన్ని కళ్లకు కడుతున్నాయి. అందులో అమెరికా సైనికులు యుద్ధ దుస్తులు, హెల్మెట్లు, గాగుల్స్ ధరించి పూర్తి పోరాట సన్నద్ధతతో కనిపిస్తున్నారు. ఇప్పటికే పశ్చిమాసియా వ్యాప్తంగా మోహరించిన సుమారు 50,000 మంది అమెరికా దళాలకు.. కొత్తగా దిగిన ఈ మెరైన్లు మరింత బలాన్ని చేకూర్చనున్నారు.


అణు సామర్థ్య నౌకలకు తోడుగా.. 


ఈ భారీ మోహరింపుపై సెంట్రల్ కమాండ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా సంచలన ప్రకటన చేసింది. యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ (LHA 7) లో ఉన్న అమెరికా నావికులు, మెరైన్లు మార్చి 27న సెంట్రల్ కమాండ్ ఆపరేషన్ ప్రాంతానికి చేరుకున్నారని స్పష్టం చేసింది. ఈ అమెరికా-క్లాస్ ఉభయచర దాడి నౌక 'ట్రిపోలీ ఆంఫిబియస్ రెడీ గ్రూప్ / 31వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్'కు ఫ్లాగ్‌షిప్‌గా వ్యవహరిస్తోంది. ఇందులో దాదాపు 3,500 మంది నావికులు, మెరైన్లతో పాటు రవాణా, స్ట్రైక్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, టాక్టికల్ ఆస్తులు ఉన్నాయని కమాండ్ వెల్లడించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో మోహరించి ఉన్న అణు సామర్థ్య నౌకలైన నిమిట్జ్ (Nimitz), ఫోర్డ్-క్లాస్ (Ford-class) ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్‌లతో ఇప్పుడు యూఎస్‌ఎస్‌ ట్రిపోలీ కూడా జతకలవడం యుద్ధ తీవ్రతను పెంచుతోంది.


ఇరాన్‌పై భూతల దాడికి పక్కా స్కెచ్? 


అమెరికా చేస్తున్న ఈ భయంకరమైన సైనిక మోహరింపులు.. ఇరాన్ గడ్డపై నేరుగా భూతల దాడులకు (Ground Operation) వాషింగ్టన్ సిద్ధమవుతోందన్న ఊహాగానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులతో మొదలైన ఈ వివాదం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఈ సంక్షోభ సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైనికంగా మరిన్ని విస్తృత ప్రత్యామ్నాయాలు (military options) అందించడానికే ఈ అదనపు దళాలను పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ మోహరించిన వేలాది మంది పారాట్రూపర్లు, మెరైన్‌లకు ఈ కొత్త బలగాలు తోడవనున్నాయి.


ట్రంప్ మాటల మర్మం.. ఖర్గ్ దీవిపై కన్ను 


దళాల మోహరింపు ఇంత భారీగా జరుగుతున్నా.. ఇరాన్‌పై నేరుగా భూతల పోరాటానికి దిగే ఉద్దేశం తమకు లేదని డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఈ అదనపు అమెరికా దళాలను కచ్చితంగా ఎక్కడ మోహరిస్తారనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. అయితే, ఈ బలగాలను ఇరాన్ తీరానికి చేరువలో, ముఖ్యంగా వారి ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన ముడిచమురు ఎగుమతి కేంద్రం 'ఖర్గ్ దీవి' (Kharg Island)కి స్ట్రైకింగ్ దూరంలోనే (దాడి చేసే పరిధిలో) మోహరించే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ.. రక్తం పారుతున్న పశ్చిమాసియా 


సెంట్రల్ కమాండ్ లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 28న 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' (Operation Epic Fury) ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు ఏకంగా 11,000కు పైగా లక్ష్యాలపై అమెరికా భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 150కి పైగా ఇరాన్ నౌకలు ధ్వంసమవ్వడం లేదా తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. అమెరికా లక్ష్యంగా చేసుకున్న వాటిలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) సౌకర్యాలు, వాయు రక్షణ వ్యవస్థలు, క్షిపణి కేంద్రాలు, నావికా ఆస్తులు, ఆయుధాల తయారీ మౌలిక సదుపాయాలు ప్రధానంగా ఉన్నాయి.


ఒకవైపు వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య దౌత్యపరమైన చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెబుతున్నప్పటికీ.. మైదానంలో మాత్రం ఇలాంటి భారీ సైనిక మోహరింపులు చోటుచేసుకోవడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. శాంతి మంత్రం పఠిస్తూనే పశ్చిమాసియాలో అమెరికా మోహరిస్తున్న ఈ మారణాయుధాలు.. ఏ క్షణంలోనైనా ప్రపంచాన్ని పెను వినాశనం వైపు నడిపించే ప్రమాదం పొంచి ఉంది!