రణరంగంలో ఏపీసీసీ చీఫ్: స్టీరింగ్ పట్టిన షర్మిల.. వైసీపీకి 'అఫెన్సివ్' వార్నింగ్!
రాజకీయం అంటే కేవలం ఏసీ గదుల్లో కూర్చుని విమర్శలు చేయడం కాదు.. జనం కష్టాల్లోకి నేరుగా దూకడం. సరిగ్గా ఇదే సిద్ధాంతంతో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తన రూటు మార్చారు. నిన్న ఉపాధి హామీ కూలీగా మారిన ఆమె.. ఇవాళ ఏకంగా ట్రక్కు స్టీరింగ్ పట్టి పొలిటికల్ హీట్ పెంచారు. కష్టాల్లో ఉన్న అరటి రైతుల కన్నీళ్లు తుడిచేందుకు డ్రైవర్ అవతారమెత్తి రణరంగంలోకి దూకారు.
ట్రక్కు డ్రైవర్‌గా షర్మిల.. కలెక్టరేట్ దద్దరిల్లేలా నిరసన
కడప జిల్లా కలెక్టరేట్ కాంగ్రెస్ శ్రేణుల నినాదాలతో హోరెత్తింది. అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ షర్మిల స్వయంగా బరిలోకి దిగారు. అరటి గెలలతో నిండిన ఒక ట్రక్కును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లి కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌ను కలిసి అరటి గెలలతో పాటు రైతుల ఆవేదనను వినతి పత్రం రూపంలో సమర్పించారు.
నన్ను గెలికితే.. 'అఫెన్సివ్ గేమ్' ఆడుతా: వైసీపీకి వార్నింగ్
ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై షర్మిల నిప్పులు చెరిగారు. వైసీపీ జోలికి వెళ్లాల్సిన అవసరం తనకు ఏమాత్రం లేదని, కానీ అనవసరంగా తన జోలికి వస్తే మాత్రం 'అఫెన్సివ్ గేమ్' ఎలా ఉంటుందో రుచి చూపిస్తానంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. తాను కేవలం రైతుల పక్షాన నిలబడి కోల్డ్ స్టోరేజీల వైఫల్యంపై ప్రభుత్వాన్ని నిలదీశానని, కానీ వైసీపీ నేతలు తన మాటలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల స్టంట్.. అదంతా ఒక ఫేక్ ప్లాంట్!
పులివెందులలో కోల్డ్ స్టోరేజీని ప్రారంభించామని జగన్ చెప్పిన మాటలు పచ్చి అబద్ధాలని షర్మిల కుండబద్దలు కొట్టారు. మార్చి 11, 2024న హడావిడిగా బనానా ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ ప్రారంభించారని, అదంతా కేవలం ఎన్నికల కోసం చేసిన చీప్ స్టంట్ అని ఆమె ఎండగట్టారు. పాత బిల్డింగ్‌కు పెయింట్లు వేశారు, కొన్ని అరటి గెలలు తెచ్చిపెట్టారు, మీడియా కోసం రిబ్బన్ కట్ చేసి ఫోజులిచ్చారు తప్పితే.. అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని ఆమె తీవ్ర విమర్శలు చేశారు.
తన టార్గెట్ జగన్ కాదని, ఆ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని మాత్రమే తాను ప్రశ్నిస్తున్నానని స్పష్టం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి గురకపెట్టి నిద్రపోయి, ఎన్నికలకు సరిగ్గా నెల ముందు నిద్రలేచారా? అని ప్రశ్నించారు. రైతుల కోసం తాము చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాల్సింది పోయి, వైసీపీ నేతలు కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కుక్కలు అనలేదు.. భుజాలు తడుముకుంటే నేనేం చేయాలి?
ఇక విజయమ్మ లేఖపై వైసీపీ నేతలు చేస్తున్న రాద్ధాంతంపై షర్మిల తనదైన శైలిలో సెటైర్లు వేశారు. విజయమ్మ రాసిన లేఖ సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని ఆమె తేల్చిచెప్పారు. తాను ఏ వైసీపీ నేతలను కుక్కలు అని అనలేదని, విజయమ్మ వద్దు అని చెప్పినా వినకుండా మాట్లాడుతున్నారంటే.. అది మొరిగే కుక్కల నైజం లాంటిది అని మాత్రమే అన్నానని క్లారిటీ ఇచ్చారు. కానీ ఆ మాటలకే భుజాలు తడుముకుని, మేమే కుక్కలం అని వారు ఫీల్ అయితే దానికి తానేం చేయలేనని గట్టి కౌంటర్ ఇచ్చారు.
అరటి రైతుల కన్నీళ్లు తుడవండి.. ప్రభుత్వానికి డిమాండ్
దేశంలోనే అత్యుత్తమ క్వాలిటీ ఉన్న అరటి కేవలం రాయలసీమ జిల్లాల్లోనే పండుతుందని, ఇక్కడి పంట గల్ఫ్ దేశాలకు సైతం ఎగుమతి అవుతోందని షర్మిల గుర్తుచేశారు. కానీ కడప జిల్లాలో కనీస కోల్డ్ స్టోరేజీ వ్యవస్థ లేకపోవడంతో రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ రోజు ప్రాసెసింగ్ ప్లాంట్ నిజంగానే అందుబాటులోకి వచ్చి ఉంటే ఈ దయనీయ పరిస్థితి వచ్చేది కాదన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి, మద్దతు ధర లేక విలవిలలాడుతున్న రైతుల నుంచి అరటి పంటను కొనుగోలు చేయాలని, ఆ అరటి పండ్లను పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేయాలని షర్మిల ప్రభుత్వాన్ని బలంగా కోరారు.
ఒకవైపు అధికార పక్షంపై డిమాండ్లు, మరోవైపు ప్రతిపక్షంపై పదునైన విమర్శలతో ఏపీ రాజకీయాల్లో షర్మిల ఆడుతున్న ఈ 'అఫెన్సివ్ గేమ్' రాబోయే రోజుల్లో ఇంకెన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి!
Also Read:
వైసీపీని వెంటాడుతున్న 11 అంకె: పార్లమెంట్లో గది మార్పించుకున్న ఎంపీలు!విశాఖ సాక్షిగా వైసీపీ గర్జన: షర్మిల, సునీతలపై వరుదు కళ్యాణి ఫైర్
ArcelorMittal Steel Plant AP | ఒక్క జూమ్ కాల్.. ఒక తల్లి కన్నీరు.. అనకాపల్లిలో ఉక్కు సంకల్పానికి పునాది వేసిన నారా లోకేశ్!
Chicken Prices Today: కిలో 400 రూపాయలు.. సామాన్యుడి కంచంలో మాయమవుతున్న కోడి కూర
Moinabad Drugs Case: ముగిసిన డెడ్‌లైన్.. రాత్రికి రాత్రే టీడీపీ అధిష్టానం టేబుల్‌పైకి ఎంపీ పుట్టా మహేష్ రహస్య లేఖ!

.webp)
