Abhishek Banerjee | మమత నీడ నుంచి కింగ్‌మేకర్‌గా.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రస్థానం!

naveen
By -
Abhishek Banerjee


రక్తం అంటిన గాయాలతో బెడ్ మీద ఉన్న మేనత్త... ఆమె ఒడిలో కూర్చున్న రెండేళ్ల చిన్నారి... ఇది ఒకప్పటి దృశ్యం! కానీ ఆ చిన్నారే నేడు ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. దశాబ్దాల పాటు ఒక యోధురాలిలా పోరాడిన తన అత్త నీడలో రాజకీయ ఓనమాలు నేర్చుకుని, నేడు తనకంటూ ఒక బలమైన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. అతడే పశ్చిమ బెంగాల్ దళపతి 'అభిషేక్ బందోపాధ్యాయ్' (బెనర్జీ). 2026 ఎన్నికల మహా సంగ్రామంలో తృణమూల్ కాంగ్రెస్ భవితవ్యాన్ని డిసైడ్ చేయబోతున్న ఈ యువ నేత ప్రస్థానం ప్రతి ఒక్కరినీ విస్మయానికి గురిచేస్తుంది.


నెత్తుటి గాయాల నుంచి రగిలిన స్పృహ!


అభిషేక్ అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది 2011లోనే అయినా.. ఆయనలోని రాజకీయ లక్షణాలను 1990లోనే ఆయన మేనత్త, మూడుసార్లు బెంగాల్ ముఖ్యమంత్రి అయిన మమతా బెనర్జీ పసిగట్టారు. 1990... తలకు పట్టీలతో ఆస్పత్రి బెడ్ మీద ఉన్న మమతా బెనర్జీ. ఆమెకు ఎదురుగా ఆమె తల్లి. మమత ఒడిలో రెండేళ్ల పసివాడు అభిషేక్. సీపీఎం కార్యకర్తల దాడిలో తనకు ఎలా గాయమైందో ఆమె ఆ చిన్నారికి వివరిస్తోంది.



చరిత్రలో నిలిచిపోయిన ఈ ఐకానిక్ ఫోటోను దశాబ్దాల తర్వాత 2023లో జరిగిన ఒక బహిరంగ సభలో మమత తన మేనల్లుడికి బహుమతిగా ఇచ్చారు. ఆనాటి దాడి తర్వాత ఆ పసివాడు ఇంట్లో సీపీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. తన అత్తపై దాడికి 'సమాధానం' చెప్పాలని డిమాండ్ చేసేవాడట! "ఆ రోజు నుంచే వాడికి రాజకీయ స్పృహ మొదలైంది" అని ఆ సభలో మమత గర్వంగా ప్రకటించారు.


యువ నేతగా ఎంట్రీ.. మారిన ముఖచిత్రం


2011లో బెంగాల్ రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయింది. 34 ఏళ్ల లెఫ్ట్ (వామపక్ష) కంచుకోట బద్దలై, తృణమూల్ కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కింది. మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయ్యారు. సరిగ్గా అదే ఏడాది అభిషేక్ రాజకీయ బరిలోకి అడుగుపెట్టారు. అప్పుడు ఆయన వయసు కేవలం 23 ఏళ్లు. అదే వయసులో ఆయన 'ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్' జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. సీనియర్లలాగా కేవలం భావోద్వేగాలతో వీధి పోరాటాలు చేయడం కాకుండా, క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ప్రొఫెషనలైజ్ చేస్తూ పార్టీలో ఆయన తనదైన ముద్ర వేసుకున్నారు.


రికార్డుల రారాజు.. డైమండ్ హార్బర్ దళపతి!


2014లో లోక్‌సభ బరిలోకి దిగి అభిషేక్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించి, కేవలం 26 ఏళ్ల వయసులో 16వ లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా అడుగుపెట్టారు. ఏళ్లు గడుస్తున్న కొద్దీ ప్రజల్లో ఆయన పలుకుబడి అనూహ్యంగా పెరిగింది. ఆయన మెజారిటీయే ఆయన సత్తాకు కొలమానంగా మారింది.


2014లో కేవలం 71,000 ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన.. 2019లో బెంగాల్‌లో భారీ స్థాయిలో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తున్నా సరే ఏమాత్రం బెదరక తన మెజారిటీని 3.2 లక్షలకు పెంచుకున్నారు. ఇక 2024 లోక్‌సభ ఎన్నికలైతే ఒక చారిత్రక ఘట్టం. ఏకంగా ఏడు లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థుల కళ్లు తేలేసేలా పాత రికార్డులన్నీ బద్దలుకొట్టారు.


'భాయ్ పో' విమర్శలకు చెక్.. అత్త నీడ నుంచి బయటకు!


కుటుంబ రాజకీయాలు చేస్తున్నారంటూ, 'భాయ్ పో' (మేనల్లుడు) అంటూ ప్రత్యర్థులు ఎన్ని విమర్శలు చేసినా అభిషేక్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అది తన స్థానమని సగర్వంగా ప్రకటించారు. తన మేనత్త స్థాపించిన పార్టీలో తనకంటూ ఒక స్పష్టమైన స్థానాన్ని దక్కించుకున్నారు. 


ప్రస్తుతానికి తృణమూల్ మమత తర్వాత వారసుడిని వెతుక్కోవాల్సిన అవసరం లేకపోయినా, తన రాకను మాత్రం అభిషేక్ బలంగా చాటారు. అలుపెరగని పోరాటయోధురాలైన మేనత్త దగ్గర రాజకీయ క్రీడను వంటబట్టించుకుని, ఇప్పుడు నలభై పడికి చేరుకుంటున్న తరుణంలో బెంగాల్ అగ్రశ్రేణి నాయకుడిగా ఎదిగారు. అత్త నీడ నుంచి ఇప్పుడు ఆయన పూర్తిగా బయటకు వచ్చారు.


పార్టీ రథసారథి.. అవినీతి ఆరోపణల కత్తిసాము!


2021 నాటికి పార్టీలో ఆయన ప్రభావం ఒక వ్యవస్థీకృత శక్తిగా మారిపోయింది. తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పబ్లిక్‌గా ప్రకటించకపోయినా, జాతీయ స్థాయిలో పార్టీ ముఖచిత్రంగా, బీజేపీ దూకుడును అడ్డుకునే అతిపెద్ద ఆయుధంగా ఆయనే ఎంపికయ్యారని అందరికీ అర్థమైంది. అయితే, దశాబ్ద కాలం పాటు సాగిన ఈ ప్రయాణంలో ఆయన ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. కోట్ల రూపాయల 'క్యాష్ ఫర్ జాబ్స్' కుంభకోణం, బొగ్గు దొంగతనం (కోల్ పిల్ఫరేజ్) స్కామ్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన్ను విచారించాయి.


2026 మహా సంగ్రామం.. మనుగడ కోసం మహా వ్యూహం!


అభిషేక్ బెనర్జీకి 2026 అసెంబ్లీ ఎన్నికలు కేవలం మరో ఎన్నికల పోరు కాదు, అది ఆయన రాజకీయ మనుగడ. పార్టీలోని సీనియర్లకు, అభిషేక్ యువ సైన్యానికి మధ్య తలెత్తిన విభేదాల తర్వాత బెంగాల్ రాజకీయాల్లో తాను ఎంత కీలకమో మేనత్తకు నిరూపించుకోవాల్సిన అసలైన అగ్నిపరీక్ష ఇది.


అయితే ఆ విభేదాలన్నీ ఇప్పుడు గతం. ఇప్పుడు తృణమూల్ ఒక పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేస్తోంది. మమతా బెనర్జీ కోల్‌కతా కేంద్రంగా ఉంటూ పరిపాలన, రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తుంటే.. అభిషేక్ మారుమూల గ్రామాల్లో మేనత్త గొంతుకగా మారుతున్నారు. మమత ఉత్తర బెంగాల్‌పై ఫోకస్ పెడితే, అభిషేక్ దక్షిణ బెంగాల్‌లో ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఢిల్లీలోని పార్లమెంట్‌లో వివాదాస్పద అంశాలపై బీజేపీని, కేంద్రాన్ని కార్నర్ చేసే ప్రధాన గొంతుకగా కూడా ఆయనే వ్యవహరిస్తున్నారు.


డిజిటల్ ఆర్మీతో బీజేపీకి చెక్!


ఈ రాబోయే ఎన్నికల్లో డేటాతో కూడిన, యువతను ఆకర్షించే సరికొత్త వ్యూహాన్ని అభిషేక్ బరిలోకి దించారు. ఎఫెక్టివ్ బూత్ స్థాయి మేనేజ్‌మెంట్, సంక్షేమ పథకాలను ప్రజలకు పకడ్బందీగా చేరవేయడం ద్వారా టఫ్ ఫైట్‌లోనూ తృణమూల్‌ను విజయం వైపు నడిపిస్తున్నారు. 2026 ఎన్నికల నాటికి, తృణమూల్‌ను కేవలం ఒక ప్రాంతీయ పార్టీగా కాకుండా.. బీజేపీ అపారమైన సంస్థాగత బలాన్ని ఢీకొట్టగల ఆధునిక, డిజిటల్ శక్తిగా ఆయన నిలబెడుతున్నారు.


పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన ఎదుర్కొంటున్న తొలి రాష్ట్ర ఎన్నికలు ఇవి. తన శక్తివంతమైన మేనత్త నీడ నుంచి బయటకు వచ్చి, రాష్ట్ర రాజకీయాలకు తానే అసలైన ఫేస్ అని ప్రపంచానికి చాటిచెప్పే అత్యంత అరుదైన అవకాశం ఇప్పుడు ఆయన ముందుంది!


Tags: