బడి గంట మోగకముందే పేద తల్లుల ఇళ్లలో కాసుల గలగలలు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం పేద విద్యార్థుల పాలిట సంజీవనిలా మారుతోంది. చదువుల తల్లికి కూటమి సర్కార్ ఇస్తున్న ఈ కానుకపై తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక భారీ శుభవార్తను ప్రకటించారు.
నెల్లూరు గడ్డపై ముఖ్యమంత్రి సంచలన ప్రకటన
నెల్లూరు జిల్లా వింజమూరులో జరిగిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ, ‘పేదల సేవలో’ కార్యక్రమాల సాక్షిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కీలక ప్రకటన చేశారు. 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి.. వేసవి సెలవులు ముగిసి జూన్ నెలలో బడులు, జూనియర్ కాలేజీలు తిరిగి తెరుచుకోగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా 'తల్లికి వందనం' నిధులను తల్లుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తామని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే.. వారందరికీ ఈ డబ్బులు అందుతాయని స్పష్టం చేశారు.
కూటమి సర్కార్ సంక్షేమ జాతర.. ఇంటింటికీ గ్యాస్
ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా పేదల సేవకే అంకితమయ్యారని చంద్రబాబు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ప్రతి నెలా కేవలం పింఛన్ల కోసమే ఏకంగా రూ.2,750 కోట్లు ఖర్చు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అన్నారు. ఆడబిడ్డల కళ్లలో ఆనందం చూసేందుకు 'దీపం 2.0' పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి నేరుగా గ్యాస్ సరఫరా చేస్తామని, వీరికి ఏడాదికి రూ.2,400 సబ్సిడీగా అందిస్తామని ఆయన ఒక అద్భుతమైన భరోసా ఇచ్చారు.
చేనేతలకు ఉచిత విద్యుత్.. మహిళలకు ఫ్రీ బస్సు
సంక్షేమంలో మరో ముందడుగు వేస్తూ.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి చేనేత కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. వీరికి ఏకంగా 500 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా అందిస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు, మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'స్త్రీశక్తి' పథకం రాష్ట్రంలో సూపర్ హిట్ అయ్యిందని, ఆడబిడ్డలంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా, సంతోషంగా ప్రయాణిస్తున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
15 వేల సాయం.. లెక్క పక్కాగా ఇలా!
రాష్ట్రంలో చదువుకుంటున్న అర్హులైన ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకం కింద ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం అందుతోంది. అయితే, బడులు, కాలేజీల నిర్వహణ ఖర్చుల నిమిత్తం ఇందులోంచి రూ. 2,000 మినహాయించి, మిగిలిన రూ. 13,000 మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఒకవేళ ఏ కారణం చేతనైనా విద్యార్థికి తల్లి లేకపోతే.. ఆ డబ్బును తండ్రి లేదా సంరక్షకుడి (గార్డియన్) ఖాతాలో వేసి ఆదుకుంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థీ ఈ పథకానికి అర్హులే!
ఈ నిబంధనలు మర్చిపోకండి.. ఇప్పుడే చెక్ చేసుకోండి
ఈ పథకం కింద డబ్బులు పడాలంటే విద్యార్థులకు కచ్చితంగా 75 శాతం హాజరు ఉండి తీరాలి. అలాగే, విద్యార్థి తల్లి పేరుతో యాక్టివ్‌గా ఉన్న ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా.. తల్లి బ్యాంకు అకౌంట్‌ను ఆధార్‌తో అనుసంధానించడం (NPCI లింకింగ్) తప్పనిసరి అనే విషయాన్ని అస్సలు మర్చిపోకూడదు. దీన్ని నేరుగా బ్యాంకుకు వెళ్లి కానీ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ వెంటనే పూర్తి చేసుకోవచ్చు. మీ ఖాతాకు ఆధార్ లింక్ అయ్యిందో లేదో ఇప్పుడే ఎన్‌పీసీఐ (NPCI) అధికారిక వెబ్‌సైట్ ద్వారా క్షణాల్లో చెక్ చేసుకోండి.
పేదరికం ఏ చిన్నారి చదువుకూ అడ్డంకి కాకూడదన్న ఉక్కు సంకల్పంతో.. బడి గడప తొక్కే ప్రతి అడుగుకూ ప్రభుత్వం వేస్తున్న ఈ బాట, రేపటి నవ్యాంధ్రకు అత్యంత బలమైన పునాది!
Also Read:
అమరావతికి చట్టబద్ధత: లోక్‌సభ ఆమోదం, రాజ్యసభకు బిల్లు!సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతి.. 2028లో మోదీ చేతుల మీదుగా ప్రారంభం
గరికపాటి కోడిగుడ్డు వివాదం: సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ భార్య!
అరటి రైతుల కోసం రంగంలోకి షర్మిల.. స్టీరింగ్ పట్టిన ఏపీసీసీ చీఫ్!
వైసీపీని వెంటాడుతున్న 11 అంకె: పార్లమెంట్లో గది మార్పించుకున్న ఎంపీలు!

