భారతీయ రైల్వే ప్రతిష్ఠాత్మకంగా, గర్వకారణంగా చెప్పుకునే 'వందే భారత్ ఎక్స్‌ప్రెస్' మరోసారి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది! ప్రీమియం రైలు అని, విలాసవంతమైన ప్రయాణం అని ప్రచారం చేసుకుంటున్న ఈ ప్రతిష్టాత్మక రైల్లో.. భోజనం చేసి ఓ మహిళ ప్రాణాపాయ స్థితికి చేరుకోవడం, ఆమె రెండేళ్ల పసివాడు అల్లాడిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
ప్రాణం తీయబోయిన భోజనం.. అల్లాడిపోయిన తల్లీకొడుకులు!
భారీ ఛార్జీలు వసూలు చేస్తూ, అధునాతన సదుపాయాలు ఇస్తున్నామంటున్న వందే భారత్ రైల్లో.. ఆహార భద్రత ఏ స్థాయిలో అట్టడుగున ఉందో చెప్పడానికి మార్చి 27న జరిగిన ఈ ఘటనే సజీవ సాక్ష్యం.
ఆయుషి సింగ్ అనే మహిళ వారణాసి నుంచి దేవ్‌ఘర్ వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (ట్రైన్ నం. 22500) లోని E1 కోచ్‌లో ప్రయాణించారు. ఆ ప్రయాణంలో ఐఆర్‌సీటీసీ (IRCTC) ఘనంగా వడ్డించిన మధ్యాహ్న భోజనం తిన్న కొద్దిసేపటికే ఆమెకు ఊహించని నరకం మొదలైంది.
ఆమె ముఖం, పెదవులు గుర్తుపట్టలేనంత దారుణంగా ఉబ్బిపోయాయి. ఊపిరాడని పరిస్థితిలో, తీవ్ర అస్వస్థతతో ఆమె వెంటనే వైద్యుడిని ఆశ్రయించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్.. ఆ భోజనం వల్ల అత్యంత తీవ్రమైన, ప్రాణాంతకమైన అలర్జీ వచ్చిందని కుండబద్దలు కొట్టారు.
ఆసుపత్రికి వెళ్లడం కాస్త ఆలస్యమైతే ఆమె ప్రాణాలే గాలిలో కలిసేవని వైద్యులు హెచ్చరించడంతో, ఆ తల్లి గుండె జారిపోయింది.
పసివాడికీ తప్పని నరకం.. సోషల్ మీడియాలో పోరాటం!
ఈ దారుణం కేవలం ఆమెకే పరిమితం కాలేదు. అదే భోజనం తిన్న ఆమె రెండేళ్ల పసివాడికి తీవ్రమైన డయేరియా (విరోచనాలు) సోకడంతో ఆ చిన్నారి అల్లాడిపోయాడు.
తన కొడుకు పడుతున్న బాధను చూసి తట్టుకోలేకపోయిన ఆయుషి సింగ్.. నేరుగా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ బాగోతాన్ని ప్రపంచం ముందుపెట్టారు. "మేము తెల్లవారుజామునే ఇంటి నుంచి బయలుదేరాం, బయట ఏమీ తినలేదు.
కేవలం రైలులో పెట్టిన భోజనం తప్ప మరేమీ తీసుకోలేదు. నా ముఖం ఎంత దారుణంగా వాచిపోయిందో చూడండి" అంటూ తన వాచిన ముఖం ఫోటోలను, డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ను ఆధారాలతో సహా పోస్ట్ చేసి రైల్వే మంత్రిత్వ శాఖను, ఐఆర్‌సీటీసీని నిలదీశారు.
@RailwaySeva @drmljn Kindly look into the matter urgently. I was travelling in Vande Bharat 22500 E1 coach on 27.3.26 and after consuming lunch, I developed a severe allergy which could have been life threatening. My Son (2 yrs) too developed diarrhoea. (Photo attached for ref) pic.twitter.com/KBdyppDq4m
— The_Mediocre_Fille (@AyushiS54377868) March 30, 2026
అంతా బాగానే ఉందట.. ఐఆర్‌సీటీసీ వింత సమర్థన!
ఈ దారుణమైన ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ఐఆర్‌సీటీసీ స్పందించక తప్పలేదు. కానీ, తమ తప్పును అంగీకరించాల్సింది పోయి, ఐఆర్‌సీటీసీ ఇచ్చిన 'క్లీన్ చిట్' వివరణ ఇప్పుడు అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
"మార్చి 27న E1 కోచ్‌లో వడ్డించిన భోజనాన్ని మేం తనిఖీ చేశాం. అది చాలా సంతృప్తికరంగా ఉంది. ఆ రోజు ప్రయాణించిన మిగతా ప్రయాణికులెవరూ ఆహారం నాణ్యత బాగోలేదని, పరిశుభ్రంగా లేదని ఎటువంటి ఫిర్యాదులూ చేయలేదు" అంటూ తమ బుకాయింపును సమర్థించుకుంది.
మేం బాధితులం కాదా? ఉప్పెనలా మండిపడుతున్న జనం!
ఐఆర్‌సీటీసీ ఇచ్చిన ఈ నిర్లక్ష్యపు సమాధానంపై ఆయుషి సింగ్ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. "వేరే ఎవరికీ అస్వస్థత కలగనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను.
కానీ నేను, నా పసి కొడుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాం కదా? మేమిద్దరమే బాధితులం కాబట్టి మీకు ఇదొక సమస్యలాగే అనిపించడం లేదా?" అంటూ ఆమె సంధించిన ప్రశ్నకు అధికారుల వద్ద సమాధానం కరువైంది.
దీనిపై నెటిజన్లు కూడా రైల్వే శాఖపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సామాన్యుడి జేబులు గుల్ల చేస్తూ ప్రీమియం ఛార్జీలు వసూలు చేస్తున్నప్పుడు, కనీసం ప్రాణాలు తీయని భోజనం పెట్టలేరా అని నిలదీస్తున్నారు.
ఇటీవలే పాట్నా-టాటానగర్ వందే భారత్ రైలులో అత్యంత నాసిరకమైన భోజనం పెట్టినందుకు, సాక్షాత్తూ రైల్వే బోర్డు ఐఆర్‌సీటీసీపై రూ. 10 లక్షల భారీ జరిమానా విధించిన సంచలన విషయాన్ని ఈ సందర్భంగా నెటిజన్లు అధికారులకు గుర్తుచేస్తున్నారు.
'వేగం' ముఖ్యం కాదు, ప్రయాణికుడి 'ప్రాణం' ముఖ్యం! వందే భారత్ లాంటి ప్రతిష్టాత్మక రైళ్లలో ఫైవ్ స్టార్ రేట్లు వసూలు చేస్తూ, రోడ్డు పక్కన దొరికే కల్తీ భోజనం పెడితే.. ఇది కేవలం రైల్వే శాఖ ప్రతిష్ఠకే కాదు, సామాన్యుడి ప్రాణానికే అతిపెద్ద ముప్పు!
Also Read:
బెంగాల్ దంగల్ 2026: 294 స్థానాల్లో గెలుపెవరిది?15 ఏళ్ల మమతా బెనర్జీ సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడానికి బీజేపీ వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి?
నితీష్ కుమార్ ఢిల్లీ ఎంట్రీ.. బీహార్‌లో జరగబోయే 5 పెను మార్పులు ఇవే!
భక్తితో తిన్న ప్రసాదం విషమైంది: 400 మందికి అస్వస్థత!
ఎంకే స్టాలిన్ సంచలన మేనిఫెస్టో: డీఎంకే వరాల జల్లు!

