దేశ సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు ఎక్కడో మంచుకొండల్లో జరుగుతున్న వ్యవహారమని సామాన్యుడు లైట్ తీసుకుంటే అది చారిత్రక పొరపాటే అవుతుంది! రేపు మన దేశ భద్రత, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు ప్రశాంతత అంతా ఈ సరిహద్దుల రేఖలపైనే ఆధారపడి ఉందన్న నగ్న సత్యం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఇప్పటికే సరిహద్దుల విషయంలో భారత్‌తో కయ్యానికి కాలుదువ్వుతున్న డ్రాగన్ కంట్రీ చైనా.. ఇప్పుడు ఏకంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే), అఫ్ఘానిస్థాన్ సరిహద్దులకు అత్యంత చేరువలో ఉన్న జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో 'సెన్లింగ్' అనే ఒక కొత్త జిల్లానే (కౌంటీ) అధికారికంగా ఏర్పాటు చేసింది. ఈ ఎత్తుగడతో మన పొరుగున ఒక బలీయమైన ముప్పును చైనా స్థిరపరుస్తోంది. ఈ చారిత్రక కదలిక వెనుక ఉన్న అసలు కుట్ర ఏమిటో, దీనివల్ల మన దేశానికి ఉన్న ముప్పు ఏమిటో తెలిపే మైండ్ బ్లాంక్ అయ్యే రిపోర్ట్ ఇది!
కారకోరం ముంగిట.. డ్రాగన్ నయా స్కెచ్!
సరిహద్దుల్లో తన ఆధిపత్యాన్ని శాశ్వతం చేసుకోవడానికి చైనా పకడ్బందీగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఈ కొత్త కౌంటీకి 'సెన్లింగ్' అని పేరు పెడుతున్నట్లు జిన్‌జియాంగ్ ఉయ్‌ఘుర్ అటానమస్ రీజియన్ ప్రభుత్వం మార్చి 26న అధికారికంగా ప్రకటించింది.
కాష్గర్ ప్రిఫెక్చర్ కేంద్రంగా ఈ కొత్త జిల్లాను నేరుగా పరిపాలించనున్నారు. అత్యంత వ్యూహాత్మకమైన కారకోరం పర్వత శ్రేణులకు ఈ కొత్త జిల్లా చాలా దగ్గరగా ఉండటంతో పాటు.. పీవోకే, అఫ్ఘాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండటంతో భౌగోళికంగా దీనికి ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది.
వివాదాల కేంద్రం.. వరుసగా మూడో కౌంటీ!
జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో చైనా కుట్రలు ఈనాటివి కావు. 2024 డిసెంబర్ నుంచి చూసుకుంటే, ఈ ప్రాంతంలో చైనా ఏర్పాటు చేసిన మూడో కౌంటీ ఇది కావడం గమనార్హం.
గతంలో హియాన్, హెకాంగ్ అనే రెండు కౌంటీలను బీజింగ్ సర్కార్ ఏర్పాటు చేసినప్పుడు.. భారత్ అత్యంత తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఆ కౌంటీల పరిధిలో చైనా చూపెడుతున్న కొన్ని ప్రాంతాలు అక్షరాలా మన 'లడఖ్' పరిధిలోకి వస్తాయని భారత్ అప్పట్లోనే కుండబద్దలు కొట్టింది.
ముఖ్యంగా ఆక్సాయ్ చిన్ పీఠభూమిలోని చాలా భాగాన్ని చైనా తన హియాన్ కౌంటీలో భాగంగా మ్యాపుల్లో చూపెట్టింది. వాస్తవానికి భారత్ దీన్ని లడఖ్‌లో అంతర్భాగంగానే పరిగణిస్తుంది. కానీ, 1962 భీకర యుద్ధం తర్వాతి నుంచి ఈ ప్రాంతం చైనా దుర్మార్గపు నియంత్రణలో ఉండిపోయింది. నేటికీ ఈ భూభాగం రెండు దేశాల మధ్య రగులుతున్న అతిపెద్ద వివాదాస్పద అంశంగా కొనసాగుతోంది.
సిల్క్ రోడ్ టు సీపెక్.. భారత్‌కు అసలు ముప్పు!
కొత్తగా ఏర్పడిన ఈ 'సెన్లింగ్' కౌంటీకి కేంద్రంగా ఉన్న కాష్గర్ ప్రాంతం, చారిత్రక సిల్క్ రోడ్‌పై కొలువై ఉంది. ఇది చైనాను దక్షిణ, మధ్య ఆసియాతో కలిపే ఒక వ్యూహాత్మక ద్వారం లాంటిది.
అంతేకాదు, మన దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేస్తూ చైనా నిర్మిస్తున్న 'చైనా-పాకిస్థాన్ ఎకానమిక్ కారిడార్' (CPEC) సైతం సరిగ్గా ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ వివాదాస్పద కారిడార్ నేరుగా పీవోకే మీదుగా వెళ్లడం పట్ల భారత్ మొదటి నుంచీ తీవ్ర అభ్యంతరం చెబుతూనే ఉంది.
ఉగ్రవాద భయం.. వాఖాన్ కారిడార్‌పై నిఘా
భద్రతాపరమైన తీవ్ర ఆందోళనలతోనే చైనా ఈ ఆదరాబాదరా కొత్త జిల్లాను ఏర్పాటు చేసిందని రక్షణ విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. భౌగోళికంగా ఈ కొత్త జిల్లా అఫ్ఘానిస్థాన్‌లోని 'వాఖాన్ కారిడార్'తో నేరుగా అనుసంధానమై ఉంటుంది.
షిన్‌జియాంగ్ సరిహద్దులో కేవలం 74 కిలోమీటర్ల పొడవున్న ఈ సన్నని భూభాగమే.. ఇటు తజికిస్థాన్‌ను, అటు పీవోకేను వేరు చేస్తుంది. తూర్పు తుర్కిస్థాన్ ఇస్లామిక్ మూమెంట్‌కు చెందిన ఉయ్‌ఘర్ మిలిటెంట్లు (ఉగ్రవాదులు) అఫ్ఘానిస్థాన్ నుంచి జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోకి చొరబడటానికి ఇదే వాఖాన్ కారిడార్‌ను వాడుకుంటున్నారని చైనా గతంలోనే ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఉగ్రవాదుల చొరబాట్లకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకే సరిహద్దుల్లో ఈ కొత్త కౌంటీని చైనా ఏర్పాటు చేసిందని నిపుణులు భావిస్తున్నారు.
మైనార్టీలపై ఉక్కుపాదం.. డ్రాగన్ దారుణాలు
జిన్‌జియాంగ్ వాయువ్య ప్రాంతంలో ముస్లిం ఉయ్‌ఘర్లు, తజిక్‌లు, కిర్గిజ్, కజక్‌లు సహా అనేక మైనార్టీ జాతుల తెగలు నివసిస్తున్నాయి. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలోని ఉయ్‌ఘర్‌లతో పాటు ఇతర ముస్లిం సమూహాలపై చైనా కనీవినీ ఎరుగని దారుణాలకు, నేరాలకు పాల్పడుతోందనే ఆరోపణలు అంతర్జాతీయ స్థాయిలో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ కొత్త జిల్లా ఏర్పాటంటే.. వారిపై డ్రాగన్ నిఘా మరింత కఠినం అవ్వడమే!
చికెన్ నెక్ కేంద్ర పాలిత ప్రాంతం.. అసలు నిజం!
వాస్తవానికి, మన దేశానికి అత్యంత సున్నితమైన 'చికెన్ నెక్'ను భారత్ కూడా ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా (యూటీగా) మారుస్తుందని గత నెలలో దేశవ్యాప్తంగా పెద్ద ప్రచారమే జరిగింది. ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో అనుసంధానించే అత్యంత కీలకమైన 'సిలిగురి కారిడార్'ను యూటీగా మార్చి, కేంద్రం నేరుగా తన అధీనంలోకి తీసుకుంటుందని పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రాంతానికి ఒకవైపు బంగ్లాదేశ్ ఉంటే.. మరోవైపు నేపాల్, భూటాన్, చైనా దేశాలు ఆనుకుని ఉంటాయి. కాబట్టి ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైనది.
బిహార్ రాష్ట్రంలోని అరారియా, పూర్ణియా, కిషన్‌గంజ్, కటిహార్ జిల్లాలతో పాటు.. పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ దినాజ్‌పూర్, మాల్దా జిల్లాలను కలిపి ఈ కొత్త యూటీని ఏర్పాటు చేస్తారని సోషల్ మీడియా హోరెత్తిపోయింది. కానీ, ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఘాటుగా ఖండించింది. వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతాన్ని నేరుగా తన పాలనలోకి తీసుకోవడం లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఒకవైపు భారత్ 'చికెన్ నెక్' మార్పు వార్తలను ఖండిస్తూ సంయమనం పాటిస్తుంటే.. మరోవైపు చైనా మాత్రం గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దుల వెంబడి కొత్త జిల్లాలను స్థాపిస్తూ అత్యంత దూకుడుగా తన సైనిక, వ్యూహాత్మక స్థావరాలను విస్తరిస్తోంది. డ్రాగన్ దేశం కేవలం మ్యాపులు గీయడం లేదు, భవిష్యత్తు యుద్ధానికి భౌగోళిక పునాదులు వేస్తోంది. ఇప్పటికైనా మన దేశం మరింత కఠినమైన ప్రతివ్యూహాలతో సరిహద్దుల్లో ఉక్కుగోడ కట్టకపోతే, చైనా చాపకింద నీరులా లడఖ్‌ను మింగేయడం ఖాయం!
Also Read:
బ్రేకింగ్: హార్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం.. ఇరాన్, చైనాకు షాక్!ఉగాండా ఆర్మీ చీఫ్ వింత కోరిక: వన్ బిలియన్ డాలర్లు, టర్కీలో అందమైన యువతి కావాలట!
సౌదీ అరేబియాలో పాక్ సైన్యం ల్యాండింగ్.. నాటో తరహా డీల్ వెనుక అసలు కుట్ర!
శాంతి చర్చలు విఫలం.. మూడో ప్రపంచ యుద్ధానికి రెడీ అవుతున్న ఇరాన్!
21 గంటల పాటు సాగిన చర్చలు.. అమెరికా-ఇరాన్ మధ్య అసలేం జరిగింది?

