బ్రేకింగ్: హార్ముజ్ జలసంధిలో అమెరికా దిగ్బంధనం.. ఇరాన్, చైనాకు షాక్!

naveen
By -
A cinematic view of US Navy warships blocking the Strait of Hormuz, stopping an Iranian oil tanker during the blockade


సముద్రపు అలలపై ఇప్పుడు నెత్తుటి ఛాయలు కమ్ముకున్నాయి! ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతి చర్చలు విఫలం కావడంతో, పశ్చిమాసియాలో మహా సంగ్రామానికి అగ్రరాజ్యం అమెరికా అధికారికంగా తెరతీసింది. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తున్నట్లు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ ఒక్క నిర్ణయంతో ఇరాన్ గొంతు నులమడమే కాకుండా, తెర వెనుక డ్రాగన్ కంట్రీ చైనాకు ఊహించని మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. రాబోయే గంటల్లో సముద్ర గర్భంలో ఏం జరగబోతోందో ఊహిస్తేనే ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుడుతోంది!


హార్ముజ్ జలసంధి దిగ్బంధనం.. రంగంలోకి సెంట్‌కామ్!


అమెరికా సైన్యం సముద్రంపై ఉక్కుపాదం మోపింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి హార్ముజ్ జలసంధిలో అమెరికా కఠినమైన దిగ్బంధనం ప్రారంభమైంది.


కానీ ఇక్కడే ట్రంప్ ఒక పక్కా వ్యూహం వేశారు. ఈ ఆంక్షలు కేవలం ఇరాన్‌కు వెళ్లే లేదా ఇరాన్ పోర్టుల నుంచి వచ్చే నౌకలకు మాత్రమే వర్తిస్తాయని అమెరికా మిలిటరీ స్పష్టం చేసింది.


అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్ వంటి గల్ఫ్ దేశాలకు వాణిజ్యం, సరకు రవాణా కోసం వెళ్లే నౌకలను తాము ఏమాత్రం అడ్డుకోబోమని తేల్చి చెప్పింది. ఇరాన్ మినహా మిగతా దేశాల నౌకలు యథేచ్ఛగా, స్వేచ్ఛగా ఆ జలసంధి మీదుగా ప్రయాణించవచ్చని భరోసా ఇచ్చింది.


ఇరాన్‌ నుంచి రాకపోకలు సాగించే ఏ నౌకనైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని, కచ్చితంగా అడ్డుకుంటామని అమెరికా మిలిటరీ విభాగం 'సెంట్‌కామ్' (CENTCOM) తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.


ఆఫ్రికా కొమ్ము నుంచి మధ్య ఆసియా, ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్థాన్‌తో పాటు అరేబియన్ ద్వీపకల్పం మొత్తాన్ని ఈ సెంట్‌కామ్ పర్యవేక్షిస్తుంది. దీని ప్రధాన కార్యాలయం ఫ్లోరిడాలోని టంపా నగరంలో ఉంది.


చట్టాలకు డోంట్ కేర్.. అదొక యుద్ధ ప్రకటన!


అంతర్జాతీయ న్యాయ నిపుణులు చెబుతున్న మాట వింటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థమవుతుంది. సముద్రయాన చట్టాల ప్రకారం 'దిగ్బంధనం' (Blockade) అంటే అది నేరుగా 'యుద్ధ చర్య' కిందే లెక్క!


గతంలో క్యూబా సంక్షోభం తలెత్తినప్పుడు.. 'బ్లాకేడ్' అనే పదం వాడితే సోవియట్ యూనియన్‌పై నేరుగా యుద్ధం ప్రకటించినట్లే అవుతుందని భయపడిన అమెరికా.. అత్యంత వ్యూహాత్మకంగా 'క్వారంటైన్' అనే పదాన్ని వాడింది.


కానీ, ట్రంప్ నాయకత్వంలోని ప్రస్తుత అమెరికా ఇవేవీ పట్టించుకోవడం లేదు. దేనికీ భయపడకుండా, పర్యావసనాలను ఆలోచించకుండా నేరుగా 'దిగ్బంధనం' అనే పదాన్ని వాడి ఇరాన్‌తో పాటు పరోక్షంగా చైనాను సైతం టార్గెట్ చేసింది.


ఇరాన్‌పై గురి.. డ్రాగన్‌కు గునపం!


ట్రంప్ అసలు టార్గెట్ ఇరాన్ ఒక్కటే కాదు, డ్రాగన్ కంట్రీ చైనా కూడా! ఇరాన్ ఎగుమతి చేసే చమురులో ఏకంగా 90 శాతం చైనానే కొనుగోలు చేస్తోందన్నది పచ్చి నిజం.


అమెరికా కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ నుంచి చైనా ప్రతిరోజూ 1.5 నుంచి 1.6 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. చైనా మొత్తం ముడి చమురు దిగుమతుల్లో ఇది 15-16 శాతం కావడం గమనార్హం.


చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆ భారీ ఆదాయంతోనే ఇరాన్ ఈ యుద్ధాన్ని నెట్టుకొస్తోందని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు. అందుకే ఇరాన్‌ను ఆర్థికంగా ఊపిరితియ్యకుండా చేయడానికే ఈ హార్ముజ్ జలసంధి దిగ్బంధనానికి తెరతీశారు.


షాడో ఫ్లీట్ సీక్రెట్స్.. చైనా మాస్టర్ మైండ్!


అమెరికా కళ్లుగప్పి చైనా ఆడుతున్న ఈ చమురు దొంగనాటకం వెనుక 'షాడో ఫ్లీట్' (రహస్య నౌకలు) అనే ఒక అండర్ గ్రౌండ్ మాఫియా నెట్‌వర్క్ ఉంది.


ఇవి తమకు అనుకూలమైన దేశాల జెండాలతో ప్రయాణిస్తూ, యూఏఈ, మలేసియా సమీపంలోని సముద్ర జలాల్లో అత్యంత రహస్యంగా ఒక నౌక నుంచి మరో నౌకలోకి చమురును మార్చేస్తాయి.


ఆ తర్వాత కార్గోల లేబుళ్లను పూర్తిగా మార్చేసి చైనాలోని రిఫైనరీలకు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నాయి. అమెరికా నిఘా సంస్థలకు చిక్కకుండా ఉండేందుకు ఈ లావాదేవీలన్నీ చైనా కరెన్సీ 'యువాన్'లోనే జరుపుతుండటం విశేషం.


కుప్పకూలనున్న ఇరాన్.. చైనాకు ఇంధన షాక్!


అమెరికా ఆంక్షలకు భయపడి పశ్చిమ దేశాలన్నీ ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేయడం మానేశాయి. ఒకవేళ ఇప్పుడు చైనాకు వెళ్లే ఈ సప్లై చైన్‌ను అమెరికా గనక అడ్డుకుంటే, ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కుప్పకూలి, ఆ దేశ సైనిక వ్యవస్థ నామరూపాల్లేకుండా పోయే ప్రమాదం ఉంది.


అలాగే, చైనాకు కూడా ఇది అతిపెద్ద షాక్. ఇరాన్ నుంచి వచ్చే చవకైన చమురు ఆగిపోతే.. చైనా తన ఇంధన అవసరాల కోసం సౌదీ అరేబియా, రష్యా నుంచి అత్యధిక ధరలకు ముడి చమురును కొనుక్కోవాల్సిన దుస్థితి వస్తుంది.


ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్‌కు టోల్ కడుతున్నట్లు అనుమానం ఉన్న నౌకలను అమెరికా దిగ్బంధనం చేస్తే చైనా ఎనర్జీ సప్లయ్ చైన్ తీవ్రంగా దెబ్బతింటుంది. అందుకే బీజింగ్ ఇప్పటికే ట్రంప్ ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రపంచ ఇంధన మార్గాలను సైనికీకరణ చేయొద్దని అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది.


భారత్‌పై నో ఎఫెక్ట్.. రగిలిపోతున్న ఇరాన్!


ఈ భయంకరమైన హార్ముజ్ దిగ్బంధనం వల్ల మన భారతదేశంపై పెద్దగా ప్రతికూల ప్రభావం పడబోదని నిపుణులు భరోసా ఇస్తున్నారు. దానికి కారణం, మనం ఇరాన్ నుంచి చాలా తక్కువగా చమురు కొనుగోలు చేయడమే.


2019కు ముందు భారత్ 15-20 శాతం చమురును ఇరాన్ నుంచే దిగుమతి చేసుకునేది. కానీ అమెరికా ఆంక్షల వల్ల దాన్ని పూర్తిగా నిలిపేశాం. ఇటీవలే అమెరికా ఇచ్చిన తాత్కాలిక వెసులుబాటుతో, ఏడేళ్ల తర్వాత 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్' కోసం కేవలం ఒక్క కార్గో నౌక ద్వారా మాత్రమే ఇరాన్ చమురును భారత్ కొనుగోలు చేసింది.


కానీ, ఈ దిగ్బంధనంపై ఇరాన్ ఉగ్రరూపం దాల్చింది. అమెరికా తీవ్ర పర్యావసనాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సముద్రంలో అమర్చిన మైన్లు, డ్రోన్ల ద్వారా నౌకల రవాణాను అడ్డుకుంటామని ఇరాన్ ప్రకటించింది.


చమురు దందాతో బతికేస్తున్న ఇరాన్ ఆర్థిక నరాలను డొనాల్డ్ ట్రంప్ నిలువునా కోసేస్తున్నారు! ఒకవేళ ఇరాన్ అన్నంత పని చేసి, సముద్రంలో మైన్లు వేసి విధ్వంసం సృష్టిస్తే మాత్రం.. హార్ముజ్ జలసంధి మీదుగా సాగే చమురు ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడి, అది ఒక బ్రహ్మాండమైన అగ్నిగుండంగా మారడం ఖాయం!