స్టాక్ మార్కెట్... ఒకప్పుడు యువతకు అదొక ఆటస్థలం. చేతిలో స్మార్ట్‌ఫోన్, బ్రోకరేజ్ యాప్ ఉంటే చాలు.. ప్రతి కుర్రాడూ వాల్ స్ట్రీట్ ట్రేడర్‌లా ఫీల్ అయిపోయాడు. కోవిడ్ మహమ్మారి తర్వాత బ్రోకరేజ్ యాప్‌ల పుణ్యమా అని, ఉద్యోగం చేసేవాళ్లు, చేయనివాళ్లు అనే తేడా లేకుండా 'జెన్-జీ' (Gen Z) యువత తమ దగ్గర ఉన్న ప్రతి పైసాను స్టాక్ మార్కెట్‌లోకి గుమ్మరించారు. కోవిడ్ తర్వాత దేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల సునామీ సృష్టించిన ఈ కుర్రకారు తీరు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయింది. ఒకప్పుడు ఎగబడి షేర్లు కొన్న చేతులే, ఇప్పుడు మార్కెట్ పేరు చెబితే వణికిపోతున్నాయి.
ఫోమో (FOMO) పోయింది.. ఫెవ్ట్ (FOWT) వచ్చింది!
Gen Z Investors Shifting From FOMO To FOWT In The Indian Stock Market Amid Global Volatility : 2022 నుంచి 2024 ఆరంభం వరకు యువతలో ఒకటే భయం.. అదే 'ఫోమో' (FOMO - ఎక్కడ మిస్ అవుతామో అన్న భయం). ప్రతి ఒక్కరూ ఈక్విటీలు, ఐపీఓ (IPO) ల వైపు పరుగులు తీశారు. "నా స్నేహితుల్లాగే నేను కూడా సరైన సమయంలో షేర్లలో పెట్టుబడి పెట్టడంపై ఒకప్పుడు విపరీతమైన ఆసక్తి చూపించాను. ఐపీఓల ట్రాక్ రికార్డ్‌ను ఎప్పటికప్పుడు గమనించేదాన్ని" అని బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ వత్సల నిగమ్ అప్పటి ట్రెండ్‌ను గుర్తుచేసుకుంది. ఆ సమయంలో కాలేజీ క్యాంపస్‌లు, ఆఫీసులు, ఫ్రెండ్స్ పార్టీలు ఎక్కడ చూసినా స్టాక్ మార్కెట్ ముచ్చట్లే వినిపించేవి.
కానీ, ఇప్పుడు ఆ 'ఫోమో' కాస్తా 'ఫెవ్ట్' (FOWT - తప్పు సమయంలో అడుగుపెడుతున్నామేమో అన్న భయం) గా మారిపోయింది. గడిచిన ఏడాదిన్నరగా భారత ఈక్విటీ మార్కెట్లు ఆశించిన స్థాయిలో రాబడులు ఇవ్వడం లేదు. దీనికి తోడు ఫిబ్రవరి 28న మొదలైన ఇరాన్ యుద్ధం కారణంగా మార్కెట్లపై ఊహించని ఒత్తిడి పడింది.
"జీవితంలో రాంగ్ టైమింగ్ ఎవరైనా కోరుకుంటారా! ఆ స్టాక్ మార్కెట్ 'హైప్' ఇప్పుడు పూర్తిగా పోయింది. మార్కెట్లు దారుణంగా పడిపోతున్న తరుణంలో నేను, నా స్నేహితులు పెట్టుబడులు ఆపేశాం. స్టాక్ మార్కెట్లో డబ్బులు పోగొట్టుకునే బదులు, కేఫ్‌లకు వెళ్లి డబ్బులు ఖర్చుపెట్టుకోవడం నాకు ఎంతో ఇష్టం" అని వత్సల కుండబద్దలు కొట్టింది. వత్సల మాటలతో చాలామంది జెన్-జీ ఇన్వెస్టర్లు ఏకీభవిస్తున్నారు. షార్ట్ టర్మ్ లాభాలు ఆశించేవారికి ఇది సరైన సమయం కాదని వారు బలంగా నమ్ముతున్నారు. అప్పట్లో యువత దీర్ఘకాలిక ఆలోచనతో రాలేదు, రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించి, ఆ లాభాలను మరో స్టాక్‌లోకి మార్చాలన్నదే వాళ్ల గేమ్. కానీ ఇప్పుడు మార్కెట్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి.
ఇది భయం కాదు.. పరిణతి అంటున్న నిపుణులు!
స్టాక్ మార్కెట్ దిగ్గజాలు మాత్రం యువతలో వచ్చిన ఈ మార్పును భయంగా చూడటం లేదు.. ఇదొక అద్భుతమైన పరిణతిగా అభివర్ణిస్తున్నారు. ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్‌లో అప్లైడ్ ఫైనాన్స్ అండ్ వెల్త్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్, ప్రొఫెసర్ డాక్టర్ అరిందమ్ బెనర్జీ ఈ విషయంపై స్పష్టతనిచ్చారు.
చరిత్రలో తొలిసారిగా జెన్-జీ యువత మార్కెట్లను ప్రొఫెషనల్స్ లాగా అప్రోచ్ అవుతున్నారని ఆయన స్పష్టం చేశారు. మూలధనాన్ని పెంచడం ఎంత ముఖ్యమో, దాన్ని రక్షించుకోవడం కూడా అంతే ముఖ్యమన్న ఓపిక, నిర్మాణాత్మక ఆలోచన ఇప్పుడు వారిలో కనిపిస్తోందని అన్నారు.
అయితే, సరైన ప్రణాళిక లేకుండా కేవలం జాగ్రత్త పడటం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు. ప్రపంచ అనిశ్చితిని బూచిగా చూపి సిప్ (SIP) లను ఆపేయడం వల్ల, 'రూపీ కాస్ట్ యావరేజింగ్' అసలు ఉద్దేశమే దెబ్బతింటుందని ఆయన వివరించారు.
దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఒడిదుడుకులు శత్రువులు కావు, అవే అసలైన ఇంజిన్లు అని ఆయన కుండబద్దలు కొట్టారు. యువతకు ఇప్పుడు కావాల్సింది రిస్క్ ప్రొఫైల్, అసెట్ అలోకేషన్, పోర్ట్‌ఫోలియో నిర్మాణం, స్వల్పకాలిక గందరగోళానికి దీర్ఘకాలిక లాభాలకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకునే కచ్చితమైన ఆర్థిక విద్య అని ఆయన సూచించారు. ఇవి నేర్చుకోవాల్సిన నైపుణ్యాలు తప్ప, పుట్టుకతో వచ్చేవి కావన్నారు.
ఆత్రుత కాదు.. ఆలోచన పెరిగింది!
ఆటమ్ ప్రైవ్ వెల్త్ ఫౌండర్, గ్రూప్ సీఈఓ హర్షవర్ధన్ వీఎం ఈ మైండ్‌సెట్ మార్పును డేటాతో సహా వివరించారు. భారతదేశంలో తొలిసారి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్న వారిలో 54 శాతం మంది యువతే ఉన్నారు. కానీ గతం కంటే ఇప్పుడు తమ తొలి పెట్టుబడి నిర్ణయం తీసుకోవడానికి వారు 30 నుంచి 40 శాతం ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఇది వారిలో తగ్గిన ఆత్రుతకు, పెరిగిన ఆలోచనకు నిదర్శనం.
అందులో చాలామంది ఇప్పుడు తమ తొలి జీతం అందుకుంటున్న 20 ఏళ్ల వయసులోని వారు. వారి జీతాల సైకిల్‌కు సిప్ సరిగ్గా సరిపోతుంది. ప్రతి నెలా జీతం రావడం, అందులో కొంత పెట్టుబడికి వెళ్లడం ఒక పవర్‌ఫుల్ అలవాటుగా మారుతోందని హర్షవర్ధన్ తెలిపారు. ఎత్తుపల్లాలు చూస్తూ పెరిగిన జెన్-జీ, ఓపికే అసలైన వ్యూహమని చాలా త్వరగా నేర్చుకున్నారని ఆయన ప్రశంసించారు.
స్మాల్-క్యాప్ ట్రాప్.. సోషల్ మీడియా గోల!
2020 నుంచి 2024 ఆరంభం వరకు జరిగిన పరిణామాలే నేటి యువ ఇన్వెస్టర్లు చిక్కుకుపోవడానికి కారణమని మిరా మనీ హెడ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ మోహిత్ బగ్డీ విశ్లేషించారు. ఆ దశ ఒక 'చీట్ కోడ్' లా అనిపించిందని, అప్పట్లో ఏది కొన్నా పైకే వెళ్లిందని, ముఖ్యంగా స్మాల్-క్యాప్ స్టాక్స్ అదరగొట్టాయని ఆయన గుర్తుచేశారు.
'అగ్రెసివ్‌గా ఉండటం' అంటే తమ దగ్గరున్న డబ్బులన్నీ తీసుకెళ్లి స్మాల్-క్యాప్‌లో పెట్టడమే అని యువత పొరబడింది. ఇప్పుడు మార్కెట్ పడిపోవడంతో.. కొందరు భయంతో నష్టాలకు అమ్ముకుంటున్నారు, మరికొందరు ఎప్పటికైనా రికవర్ అవుతాయన్న ఆశతో ఆ నష్టాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.
దీనివల్ల ఏం చేయాలో పాలుపోని ఒక 'నిర్ణయ పక్షవాతం' ఏర్పడింది. దీనికి తోడు సోషల్ మీడియాలో 'ఫిన్‌ఫ్లూయెన్సర్లు' ఇచ్చే సలహాలు మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఒకరు 'డిప్ వచ్చినప్పుడు కొను' అంటే, మరొకరు 'మార్కెట్ క్రాష్' అంటారు. ఇంకొకరు 'మల్టీబ్యాగర్' అంటే, ఇంకొకరు 'వెంటనే బయటకు వచ్చెయ్' అని భయపెడుతున్నారు.
దిశా నిర్దేశం లేని ఈ విపరీతమైన నాయిస్ యువతను పిచ్చెక్కిస్తోంది. కొన్నిసార్లు మార్కెట్లు పెట్టుబడిదారులకు విరక్తి పుట్టిస్తాయని, అది వాటి సహజ లక్షణమని మోహిత్ స్పష్టం చేశారు. బుల్ రన్స్‌లో కాదు, ఇలాంటి విరక్తి సమయాల్లోనే అసలైన సంపదకు బీజం పడుతుందని ఆయన తేల్చి చెప్పారు.
కానీ యువకులు ఇప్పుడు భయపడి సిప్‌లు ఆపేస్తే, కెరీర్ ఆరంభంలో దక్కే అద్భుతమైన 'కాంపౌండింగ్' ప్రయోజనాన్ని శాశ్వతంగా కోల్పోతారు. "పెట్టుబడులు కొనసాగించడంలో అగ్రెసివ్‌గా ఉండండి, కానీ లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్‌లతో పాటు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్‌లో మీ పోర్ట్‌ఫోలియోను విస్తరించండి. వీటన్నింటికంటే ముఖ్యంగా సోషల్ మీడియా గోలను పక్కనపెట్టి నిపుణుల సలహాలు తీసుకోండి" అని ఆయన సూచించారు.
పర్ఫెక్ట్ టైమింగ్ కోసం ఎదురుచూస్తే మునిగిపోతారు!
నేటి జెన్-జీ యువత 'హైపర్-అవేర్‌నెస్' (అతి తెలివి) తో ఉన్నారని అవిసా వెల్త్ క్రియేటర్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఆదిత్య అగర్వాల్ పేర్కొన్నారు. వారు సమాచారాన్ని మితిమీరి తీసుకుంటున్నారని, మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఒక 'పర్ఫెక్ట్ పాయింట్' కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. తప్పు సమయంలో అడుగుపెట్టకూడదన్న భయంతో, చివరికి అసలు పెట్టుబడి పెట్టకుండానే మిగిలిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
యువతలో ఏర్పడిన ఒక 'ట్రస్ట్ గ్యాప్' (నమ్మకం లేకపోవడం) ని కూడా ఆయన ఎత్తిచూపారు. ఎఫ్‌డీలు, ఆర్‌డీలు, సిప్‌ల వంటి సంప్రదాయ పెట్టుబడి మార్గాలు వారికి చాలా నెమ్మదిగా, పాతవిగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈక్విటీలు రిస్క్‌తో కూడుకున్నవిగా కనిపిస్తున్నాయి. దీనివల్ల వారి దృష్టి సైడ్ హజిల్స్ (సెకండ్ ఇన్‌కమ్), లైఫ్‌స్టైల్ ఖర్చుల వైపు ఆకర్షితులవుతోంది. తప్పు సమయంలో పెట్టుబడి పెట్టడం కంటే, ఈ 'ఓవర్ థింకింగ్' (మితిమీరిన ఆలోచన) వారి భవిష్యత్తుకు సైలెంట్‌గా ఎంతో నష్టం చేస్తుందని ఆదిత్య హెచ్చరించారు.
స్టాక్ మార్కెట్ అంటే 2022 నాటి క్యాంపస్ గోల కాదు.. ఇప్పుడు జనాలు సైలెంట్‌గా గమనిస్తున్న ఒక సీరియస్ సబ్జెక్ట్. మళ్లీ మార్కెట్లోకి అడుగుపెట్టే ముందు జెన్-జీ యువత దానిని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. అసౌకర్యంగా, నెమ్మదిగా సాగుతున్న ఈ గందరగోళ దశే భవిష్యత్తులో నిజమైన పెట్టుబడిదారులను తయారుచేస్తుందని నిపుణులు బలంగా నమ్ముతున్నారు. ఎందుకంటే, "ఫోమో" (FOMO) వాళ్లను మార్కెట్లోకి తీసుకురాగలిగింది.. కానీ "ఫెవ్ట్" (FOWT) మాత్రమే వాళ్లను అందులో ఎలా నిలబడాలో నేర్పిస్తోంది!

