ఉదయం నవ్వుతూ ఆఫీసుకు వెళ్లిన వ్యక్తి సాయంత్రానికి సురక్షితంగా ఇంటికి వస్తాడన్న గ్యారెంటీ లేని రోజులవి. ఒక బస్సు డ్రైవర్ చేసే చిన్న నిర్లక్ష్యం.. ఒక నిండు జీవితాన్ని శాశ్వత వికలాంగుడిగా మార్చేస్తుంది. రోడ్డెక్కే ప్రతి సామాన్యుడిని భయపెడుతున్న అతిపెద్ద ప్రాణ సంకటం ఇది! అయితే, ఇలాంటి రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయి, అండ లేక న్యాయం కోసం ఎదురుచూస్తున్న బాధితులకు తాజాగా న్యాయస్థానం ఇచ్చిన ఒక చారిత్రక తీర్పు కొండంత భరోసాను ఇస్తోంది. ఆర్టీసీ బస్సు ఢీకొట్టి కాలు కోల్పోయిన ఓ బ్యాంకు ఉద్యోగికి ఏకంగా రూ.89 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్న తీర్పు.. ఇప్పుడు వ్యవస్థల కళ్లు తెరిపిస్తోంది.
నిర్లక్ష్యానికి బలైపోయిన బ్యాంకు ఉద్యోగి జీవితం
హైదరాబాద్‌లోని కొత్తపేట ప్రాంతానికి చెందిన సీహెచ్ మహేశ్వరరావు.. తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కానీ 2018 అక్టోబర్ 31వ తేదీన ఆయన జీవితంలో ఊహించని ఘోరం జరిగిపోయింది.
ఆ రోజు మహేశ్వరరావు తన స్నేహితుడితో కలిసి బైక్‌పై చెన్నూరు నుంచి నీల్వాయికి ప్రయాణిస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు (AP 28 Z 1049) వారి బైక్‌ను వెనుక నుంచి దారుణంగా ఢీకొట్టింది.
ఈ భయంకరమైన ప్రమాదంలో మహేశ్వరరావుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పినా.. ఆయన ఎడమ కాలు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో, ప్రాణాలు నిలపాలంటే ఆ కాలును తీసేయాలని డాక్టర్లు తేల్చిచెప్పారు. చేసేదేమీ లేక ఆపరేషన్ చేసి మహేశ్వరరావు ఎడమ కాలును తొలగించారు.
టీజీఎస్ఆర్టీసీకి షాక్.. రూ.89 లక్షల పరిహారం!
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఒక కాలు కోల్పోయి శాశ్వత వైకల్యానికి గురికావడమే కాకుండా, తన బ్యాంకు ఉద్యోగాన్ని సైతం మహేశ్వరరావు కోల్పోయాడు. ఇప్పుడు తనకు ఎలాంటి ఆదాయం గానీ, బతికే ఆధారం గానీ లేవని న్యాయం కోసం ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించాడు.
మహేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ట్రైబ్యునల్.. ఆయన అనుభవించిన నరకాన్ని అర్థం చేసుకుంది. మెడికల్ ఖర్చులు, ఆదాయ నష్టం, శారీరక వైకల్యం సహా పలు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుని సంచలన తీర్పునిచ్చింది.
బాధితుడికి ఏకంగా రూ.88,94,658 నష్టపరిహారంగా చెల్లించాలని టీజీఎస్ఆర్టీసీకి (TGSRTC) న్యాయస్థానం కఠిన ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు, కేసు నమోదు చేసిన తేదీ నుంచి ఈ తీర్పు అమలు చేసే వరకు ఉన్న కాలానికి.. 9 శాతం వడ్డీని కూడా కలిపి బాధితుడికి చెల్లించాలని కోర్టు తీర్పులో అత్యంత స్పష్టంగా పేర్కొంది.
ఆరేళ్ల పసిపాపకూ అండగా నిలిచిన ధర్మపీఠం
సరిగ్గా గత నెలలో ఇలాంటి ఘోరమైన బస్సు ప్రమాదంలోనే కాలు కోల్పోయిన ఓ ఆరేళ్ల పసిపాపకు సైతం న్యాయస్థానం అండగా నిలిచింది. రూ.24.86 లక్షల పరిహారం ఇవ్వాలని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ చారిత్రక తీర్పునిచ్చింది.
సైదాబాద్ ప్రాంతానికి చెందిన ఆరేళ్ల హర్షిత.. 2020 ఆగస్ట్ 4వ తేదీన తన తల్లిదండ్రులతో కలిసి బోగారం నుంచి నేలపట్ల వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. రామన్నపేట వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వారిని అత్యంత దారుణంగా ఢీకొట్టింది.
ఈ హృదయవిదారక ఘటనలో బస్సు ముందు టైరు ఆ చిన్నారి కుడికాలు మీది నుంచి వెళ్లడంతో, మోకాలి కింది వరకు కాలును డాక్టర్లు తొలగించాల్సి వచ్చింది. ఈ ఘటనపై రామన్నపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా, బస్సు డ్రైవర్ తన నేరాన్ని అంగీకరించాడు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పేర్కొంటూ కోర్టు బాధితురాలికి భారీ పరిహారం ప్రకటించింది.
రోడ్డు ప్రమాదాలు కేవలం ప్రాణాలను మాత్రమే తీయవు.. బతికున్న వాళ్లను జీవచ్ఛవాలుగా మారుస్తాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే ప్రతి ఆర్టీసీ డ్రైవర్‌కు, వ్యవస్థలకు ఈ కోర్టు తీర్పులు ఒక చెంపపెట్టు లాంటివి. వ్యవస్థల నిర్లక్ష్యానికి బలైపోయిన సామాన్యుడు, న్యాయస్థానం మెట్లెక్కితే కచ్చితంగా న్యాయం జరుగుతుందనడానికి ఈ తీర్పులే సజీవ సాక్ష్యాలు. మీకు లేదా మీ బంధువులకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అధైర్యపడకుండా, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించండి. న్యాయం కాస్త ఆలస్యం కావొచ్చేమో కానీ, అంతిమ విజయం మాత్రం కచ్చితంగా బాధితుడిదే!
Also Read:
Telangana New Districts: జిల్లాల రద్దుపై సీఎం క్లారిటీ95 చలాన్లు, 36 వేల ఫైన్: ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయిన కిలాడీ!
ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడి.. అడ్మిషన్ల కోసం నల్గొండలో క్యూ లైన్లు!
Kavitha Tihar Jail Experience: తీహార్ జైలు సీక్రెట్స్!
Hyderabad Kidnap Case: రియల్ హీరోకు సలాం.. సీపీ సజ్జనార్ సత్కారం!

