వంటగదికే పరిమితమైన ఆడబిడ్డల చేతుల్లో అక్షరాలా ఆర్థిక సామ్రాజ్యాన్ని పెడితే ఎలా ఉంటుంది? ఉరుముల్లాంటి వాహనాలకు ఇంధనం పోసే పెట్రోల్ బంకులను ఒక మహిళా సైన్యమే నడిపిస్తే ఆ దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుంది? ఒకప్పుడు ఇవి కేవలం ఆశలు.. కానీ ఇప్పుడు తెలంగాణ గడ్డపై ఆవిష్కృతమవుతున్న సజీవ సాక్ష్యాలు. రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహా సంకల్పం ఇప్పుడు రోడ్డెక్కింది. మాటలకే పరిమితం కాకుండా, మహిళా సంఘాలకు నేరుగా పెట్రోల్ బంకులను అప్పగిస్తూ రేవంత్ సర్కార్ సృష్టిస్తున్న ఈ సరికొత్త ఉపాధి విప్లవం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే!
ఇందిరా మహిళా శక్తి.. క్యాష్ కౌంటర్ నుంచి ఓనర్ దాకా!
మహిళలకు కేవలం ఉద్యోగాలే కాదు, వ్యాపారాల్లోనూ వారి సత్తా చాటేలా రాష్ట్ర ప్రభుత్వం 'ఇందిరా మహిళా శక్తి' పథకం కింద అద్భుతమైన ఉపాధి మార్గాలు చూపిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే తెలంగాణలో ప్రయోగాత్మకంగా రెండు పెట్రోల్ బంకులను ఏర్పాటు చేశారు.
ఈ బంకుల ప్రత్యేకత ఏమిటంటే.. ఇక్కడ సిబ్బంది, మేనేజర్లు, ఆపరేటర్లు, చివరికి ఆ బంకు ఓనర్లు కూడా నూటికి నూరు శాతం మహిళలే కావడం విశేషం. ఇప్పటికే సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ పెట్రోల్ బంకులు ఊహించిన దానికంటే అద్భుతమైన లాభాలతో కళకళలాడుతున్నాయి. ఈ సక్సెస్ ఫార్ములాను చూసి ఇతర జిల్లాల్లోనూ మహిళా శక్తిని చాటాలని ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుంది.
దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు.. 40 కొత్త బంకులకు శ్రీకారం!
సంగారెడ్డి, నారాయణపేట ప్రయోగాలు సూపర్ హిట్ కావడంతో.. రాష్ట్రవ్యాప్తంగా అదనంగా మరో 40 చోట్ల మహిళా పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు వేగవంతం చేసింది.
ఈ బంకుల ఏర్పాటుకు అవసరమైన స్థలాల ఎంపిక ప్రక్రియను అధికారులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. వీటికి ఇంధన సరఫరా కోసం దేశంలోని దిగ్గజ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), భారత్ పెట్రోలియం (BPCL), హిందూస్థాన్ పెట్రోలియం (HPCL) సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది.
జూన్ 2 టార్గెట్.. పనులు మొదలైన ప్రాంతాలివే!
ఈ బృహత్తర ప్రాజెక్టులో దాదాపు సగం, అంటే 20 పెట్రోల్ బంకులను వచ్చే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి.. అంటే జూన్ 2వ తేదీకల్లా పూర్తి చేసి అట్టహాసంగా ప్రారంభించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) పక్కా ప్రణాళికలు రచిస్తోంది.
ఇప్పటికే పలుచోట్ల నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఆదిలాబాద్‌లోని కైలాష్‌నగర్, నల్గొండ జిల్లా గండవారిగూడెం, కుమురం భీమ్ జిల్లా ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లా భూపతిపురం, వికారాబాద్ జిల్లా హకీంపేట్ దుడ్యాల్ ప్రాంతాల్లో కొత్త పెట్రోల్ బంకుల ఏర్పాటు కోసం పనులు మొదలయ్యాయి. వీటికి అదనంగా కరీంనగర్, మెదక్, ములుగు, సిరిసిల్ల జిల్లా కేంద్రాల్లోనూ ఈ మహిళా బంకులు కొలువుదీరనున్నాయి.
స్థలాల అప్పగింత పూర్తి.. ఊరూరా నారీమణుల రాజ్యం!
చాలా జిల్లాల్లో ఇప్పటికే కొత్త పెట్రోల్ పంపుల కోసం ప్రభుత్వం భూములను సేకరించి మహిళా సంఘాలకు అధికారికంగా అప్పగించేసింది. మన వరంగల్ జిల్లాలోని రాయపర్తి, హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతాల్లో స్థలాలు సిద్ధమయ్యాయి.
అలాగే ఖమ్మం జిల్లా వెంకటాపురం, సాదిరెడ్డిపల్లి, ఖానాపురం హవేలి.. కామారెడ్డి జిల్లా మల్తుమ్మెద.. కొత్తగూడెం జిల్లా రామవరం, కొత్తగూడెం.. జనగామ జిల్లా రఘునాథపల్లి.. జగిత్యాల జిల్లా కోరుట్ల.. భూపాలపల్లి జిల్లా మైలారం.. మహబూబ్‌నగర్ జిల్లా పాలకొండ ప్రాంతాల్లో భూముల అప్పగింత పూర్తయింది.
వీటితో పాటు మేడ్చల్ జిల్లా అలియాబాద్, మంచిర్యాల జిల్లా మందమర్రి, నిర్మల్ జిల్లా సోఫానగర్, నాగర్‌కర్నూల్ జిల్లా మన్ననూరు, పెద్దాపూర్, రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్, వట్టినాగులపల్లి, వనపర్తి జిల్లా మిరాస్‌పల్లి, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, భువనగిరి జిల్లా మల్కాపురం, సంగారెడ్డి జిల్లా కవేలి, కోడూరులలో కూడా భూములను సేకరించి మహిళా సంఘాల చేతుల్లో పెట్టారు.
తుది దశలో ఎంపిక.. త్వరలోనే వారికి కూడా!
మరోవైపు మిగిలిన ప్రాంతాల్లోనూ స్థలాల గుర్తింపు పూర్తయింది. సిద్దిపేట, నిజామాబాద్, భువనగిరి, జోగులాంబ గద్వాల్ జిల్లా నారాయణపురం, భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం, సూర్యాపేట జిల్లా రేపాల, మహబూబాబాద్ జిల్లా తానంచెర్లలో అనువైన భూములను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో లాంఛనాలు పూర్తి చేసి మహిళా సంఘాలకు వాటిని త్వరలోనే అప్పగించాల్సి ఉంది.
"మహిళలు వ్యాపారం చేయలేరు" అన్న పాతకాలపు మైండ్‌సెట్‌ను బద్దలు కొడుతూ.. నేరుగా పెట్రోల్ బంకులనే నడిపించే స్థాయికి తెలంగాణ ఆడబిడ్డలు ఎదగడం ఒక చారిత్రక ఘట్టం. నిజానికి ఈ మహిళా పెట్రోల్ బంకుల వల్ల కేవలం వారి ఉపాధి మాత్రమే పెరగదు.. బంకుల్లో కల్తీలు, మోసాలు తగ్గి వినియోగదారులకు నాణ్యమైన సేవలు దొరుకుతాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ 40 బంకులు గనక సక్సెస్ అయితే.. భవిష్యత్తులో తెలంగాణ నలుమూలలా వ్యాపార సామ్రాజ్యాలను ఆడబిడ్డలే శాసిస్తారు!
Also Read:
టీజీఎస్ఆర్టీసీకి కోర్టు షాక్.. ప్రమాద బాధితుడికి రూ.89 లక్షల పరిహారం!Telangana New Districts: జిల్లాల రద్దుపై సీఎం క్లారిటీ
95 చలాన్లు, 36 వేల ఫైన్: ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయిన కిలాడీ!
ప్రైవేట్‌కు దీటుగా సర్కారు బడి.. అడ్మిషన్ల కోసం నల్గొండలో క్యూ లైన్లు!
Kavitha Tihar Jail Experience: తీహార్ జైలు సీక్రెట్స్!

