మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపిన 'తెలుగింటి అల్లుడు' జేడీ వాన్స్ మంత్రాంగం!

naveen
By -
US Vice President JD Vance and President Donald Trump


పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక టైంబాంబ్.. సరిగ్గా ఆఖరి సెకనులో వైర్ కట్ చేసినట్లుగా పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం ఒక్కసారిగా ఆగిపోయింది. ఫిబ్రవరి 28న మొదలై గత 40 రోజులుగా నెత్తురోడుతున్న ఈ మహా సంగ్రామానికి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి. అమెరికా, ఇరాన్ దేశాలు రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించడం వెనుక హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపించే ఒక భారీ పొలిటికల్ స్కెచ్ ఉంది! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిసి ఆడిన 'గుడ్ కాప్, బ్యాడ్ కాప్' (Good Cop, Bad Cop) మైండ్ గేమ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు తెరవెనుక నడిచిన ఆ ఉత్కంఠభరిత దౌత్య మంత్రాంగం ఏంటో చూద్దాం.


ట్రంప్ బూతులు.. వాన్స్ శాంతి వచనాలు!


ట్రంప్ ఒకవైపు "ఇరానియన్లు పిచ్చి వెధవలు.. ఇరాన్ నాగరికతను ఈ రాత్రికే అంతం చేస్తాం" అంటూ భీకరమైన హెచ్చరికలతో రెచ్చిపోతూ బ్యాడ్ కాప్ పాత్ర పోషించారు. మరోవైపు తెలుగింటి అల్లుడు, అమెరికా వైస్-ప్రెసిడెంట్ జేడీ వాన్స్ గుడ్ కాప్ అవతారం ఎత్తారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా పలువురు అగ్ర నేతలతో తెర వెనుక అత్యంత చాకచక్యంగా దౌత్యపరమైన చర్చలు కొనసాగించారు.


ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ మెట్టు దిగి, వెనక్కి తగ్గేలా పాక్ ప్రధానితో వాన్స్ అత్యంత కీలక చర్చలు జరిపినట్టు ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ సంచలన నివేదిక బయటపెట్టింది.


కుష్నర్ వద్దు.. జేడీ వాన్సే ముద్దు!


ఈ కాల్పుల విరమణ చర్చల్లో వాన్స్ పాల్గొనడం ఆకస్మాత్తుగా జరిగిందేమీ కాదు. ఇరాన్‌తో సంఘర్షణను ముగించేందుకు రంగంలోకి దిగిన అమెరికా ఉన్నత నాయకత్వ బృందంలో జేడీ వాన్స్ ముందునుంచీ ఒక ముఖ్య భాగంగా ఉన్నారు. గత వారం పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్‌తో స్వయంగా ఆయన నేరుగా మాట్లాడినట్టు రాయిటర్స్ పేర్కొంది.


ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. స్టీవ్ విట్కాఫ్ లేదా ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ వంటి ఇతర రాయబారులతో మాట్లాడేందుకు ఇరాన్ నిరాకరించింది. వాన్స్ అయితేనే బెటర్ అని ఇరాన్ కోరుకోవడం వల్లే ఆయన ఈ డీల్‌లో ఇంతటి కీలక పాత్ర పోషించి ఉండవచ్చని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.


శాంతిదూతగా తెలుగింటి అల్లుడు!

కాల్పుల విరమణకు ఏమాత్రం అవకాశం లేదని ప్రపంచం మొత్తం ఫిక్స్ అయిపోయిన డెడ్ ఎండ్ సమయంలో.. వాన్స్ తన మాస్టర్ బ్రెయిన్ ఉపయోగించారు. యూఏఈ, సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాధినేతలతో పాటు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహుతో సైతం వాన్స్ ఏకధాటిగా వరుస సంభాషణలు ప్రారంభించారని అమెరికా పత్రిక 'ఆక్సియోస్' పేర్కొంది.


ది న్యూయార్క్ టైమ్స్, పొలిటికో, ది హిల్ వంటి మరో మూడు అగ్ర పత్రికలు కూడా ఇరాన్‌తో యుద్ధాన్ని వాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు నివేదించాయి. గతంలో ఇరాక్‌లో సైనికుడిగా పనిచేసిన అపార అనుభవం ఉన్న మాజీ మెరైన్ అయిన వాన్స్.. ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ‘పాలన మార్పు’ విధానంతో ఏకీభవించలేదు. పశ్చిమాసియాలో సుదీర్ఘ సైనిక చర్య అమెరికాకు మోయలేని ఆర్థిక భారంగా మారుతుందని వాన్స్ బలంగా భావించారు.


మండుతున్న అగ్ని.. సైలెంట్ ఆపరేషన్!


తన అభిప్రాయాలను నేరుగా అధ్యక్షుడికి వివరించినప్పటికీ, ట్రంప్ మాత్రం యుద్ధం నుంచి వెనక్కి తగ్గలేదు. అయితే, ట్రంప్ తన అంతర్గత బృందం నుంచి వాన్స్‌ను ఏనాడూ పక్కనపెట్టలేదు. సోమవారం ట్రంప్ మీడియాతో మాట్లాడుతూ.. "కాల్పుల విరమణ చర్చలకు విదేశాంగ మంత్రి మార్కో రూబియో, జేడీ వాన్స్ సహా మా వద్ద చాలా మంది సమర్థులు ఉన్నారు" అని వ్యాఖ్యానించడం ద్వారా వాన్స్ ప్రాధాన్యతను నొక్కిచెప్పారు.


సరిగ్గా గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు ట్రంప్ ఇరాన్‌ను మరింతగా రెచ్చగొట్టారు. దానికి ఇరాన్ కూడా అంతే దీటుగా, తీవ్రంగా స్పందించింది. ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న ఆ సమయంలోనే.. వాన్స్ అత్యంత నిశ్శబ్దంగా తన ప్రయత్నాలు కొనసాగించారు. పాక్ ప్రధాని షరీఫ్, సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, ఇరాన్ అధికారులతో కలిసి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి తెరవెనుక నిర్విరామంగా కృషి చేశారు.


ఇరాన్ నమ్మిన ఏకైక బ్రహ్మాస్త్రం!


సోమవారం నాటి ట్రంప్ మద్దతు ఈ మొత్తం ఎపిసోడ్‌లో టర్నింగ్ పాయింట్‌గా మారింది. గతేడాది జూన్‌లో జరిగిన 12 రోజుల యుద్ధం, ముఖ్యంగా ఫిబ్రవరి 26న జెనీవాలో విఫలమైన చర్చలతో అమెరికా అధ్యక్షుడి వైఖరిపై ఇరాన్‌కు నమ్మకం పోయింది. అందుకే విట్‌కాఫ్ లేదా కుష్నర్‌తో చర్చలకు ఇరాన్ నిరాకరించింది. కానీ, యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న వాన్స్‌ సిద్ధాంతాలు, అదే సమయంలో ట్రంప్‌తో ఆయనకు ఉన్న అత్యంత సాన్నిహిత్యం ఇరాన్‌కు కొండంత నమ్మకాన్ని కలిగించాయి.


"వాన్స్‌తో గనక ఇరాన్ ఒప్పందం చేసుకోలేకపోతే, వారికి ఇక ప్రపంచంలో ఏ ఒప్పందమూ కుదరదు" అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాడులను మరింత తీవ్రతరం చేస్తారని వాన్స్ ఇచ్చిన సున్నితమైన హెచ్చరికతో ఇరాన్ ఫైనల్‌గా దిగొచ్చింది.


ఈ ఉత్కంఠభరితమైన దౌత్య విజయంతో ట్రంప్ ప్రభుత్వంలో వాన్స్ ప్రతిష్ట అమాంతం పెరిగిపోయింది. ప్రపంచ వినాశనాన్ని ఆపిన ఈ తెలుగింటి అల్లుడు, ఇప్పుడు ఇస్లామాబాద్‌ వేదికగా ఏప్రిల్ 10న జరగనున్న తదుపరి కీలక చర్చల్లోనూ ప్రధాన పాత్ర పోషించడానికి సగర్వంగా సిద్ధమవుతున్నారు!