"ఒక దేశాన్ని నామరూపాల్లేకుండా భూస్థాపితం చేస్తాం.. ఆ ప్రాచీన నాగరికతను ఈ రాత్రికే పూర్తిగా అంతం చేస్తాం!" ప్రపంచానికి పెద్దన్నగా వ్యవహరించాల్సిన అమెరికా అధ్యక్షుడి నోటి నుంచి వచ్చిన ఈ భయంకరమైన మాటలు ఇప్పుడు అగ్రరాజ్యాన్ని నిలువునా కుదిపేస్తున్నాయి. ఇరాన్‌తో యుద్ధం ఆగిపోయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే.. స్వదేశంలో డొనాల్డ్ ట్రంప్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన సొంత దేశ ప్రజలు, ప్రతిపక్ష డెమొక్రాట్లు ఏకమై ట్రంప్‌ను అధ్యక్ష పీఠం నుంచి కిందకు దించేందుకు చారిత్రక కదలికకు తెరతీశారు!
25వ సవరణతో వేటు.. 70 మంది ఎంపీల డిమాండ్!
పశ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా చేస్తున్న ఈ భీకర యుద్ధాన్ని స్వయంగా అమెరికన్లే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్ష డెమొక్రాట్లతో పాటు సామాన్య ప్రజలు సైతం అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. ఈ ఉద్రిక్తతల నడుమ ఇరాన్ నాగరికతను తుడిచిపెట్టేస్తామంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అమెరికా రాజకీయాల్లో పెను సంచలనంగా, వివాదంగా మారాయి.
దీంతో ఆయనను వెంటనే అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని పదుల సంఖ్యలో డెమొక్రాట్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అమెరికా రాజ్యాంగంలోని 25వ సవరణను ప్రయోగించి, క్యాబినెట్ ఆయనను పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వారు పట్టుబడుతున్నారు. లేదా కాంగ్రెస్ ఆయనపై తక్షణమే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి దోషిగా నిర్ధారించాలని, సెనేటర్లతో సహా 70 మందికి పైగా చట్టసభ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పిచ్చి పట్టిందా? చట్టసభ సభ్యుల ఫైర్!
మసాచుసెట్స్‌కు చెందిన డెమొక్రాట్ సెనేటర్ ఎడ్ మార్కీ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ప్రతినిధుల సభ, సెనేట్ తక్షణమే సమావేశం కావాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడిపై అభిశంసన తీర్మానాలను ప్రతినిధుల సభ ఆమోదించాలని, ఆ తర్వాత సెనేట్ ఆయనను దోషిగా నిర్ధారించి పదవి నుంచి తొలగించడానికి ఓటింగ్ జరిపించాలని కోరారు. లేదా 25వ సవరణను ప్రయోగించి క్యాబినెట్, ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఆమోదంతో ట్రంప్‌ను సాగనంపాలని ఆయన డిమాండ్ చేశారు.
కనెక్టికట్‌కు చెందిన మరో డెమొక్రాట్ సెనేటర్ క్రిస్ మర్ఫీ స్పందిస్తూ.. ఏమాత్రం తెలివి ఉన్న ఏ అధ్యక్షుడూ ఒక నాగరికతను పూర్తిగా నిర్మూలిస్తానని ఇలా బహిరంగంగా ప్రకటించడని విమర్శించారు. కాలిఫోర్నియా ప్రతినిధి రో ఖన్నా సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. యుద్ధ నేరాలతో బెదిరించడం రాజ్యాంగాన్ని, జెనీవా ఒప్పందాలను బహిరంగంగా ఉల్లంఘించడమేనని, వెంటనే 25వ సవరణ ద్వారా ట్రంప్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు.
మౌనంలో వైట్‌హౌస్.. ఐక్యరాజ్యసమితి సీరియస్!
ఈ ఊహించని పరిణామాలపై స్పందించడానికి అమెరికా అధ్యక్ష భవనం (వైట్‌హౌస్) తక్షణమే నిరాకరించింది. డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఉదయం ఇరాన్‌ను బెదిరించిన కొద్దిసేపటికే ఈ చట్టసభ సభ్యులంతా సోషల్ మీడియాలో ఏకమై ఆయనపై దాడికి దిగారు. తాను విధించిన గడువులోగా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ నాగరికత అంతరించిపోతుందని ట్రంప్ చేసిన బెదిరింపులు డెమొక్రాట్లలో తీవ్ర ఆగ్రహాన్ని, కొంతమంది రిపబ్లికన్లలో సైతం విమర్శలను రేకెత్తించాయి. ఇవి కచ్చితంగా యుద్ధ నేరాలే అని వారు తేల్చి చెప్పారు.
దీనిపై ఐక్యరాజ్యసమితి సైతం అధికారికంగా స్పందించింది. జెనీవా ఒప్పందాలను గుర్తుచేస్తూ "యుద్ధాలకు నియమాలు ఉంటాయి" అని సుతిమెత్తగా చురకలంటించింది. ఐరాస సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు. ఏ సైనిక లక్ష్యం కూడా ఒక సమాజ మౌలిక సదుపాయాలను నాశనం చేయడాన్ని, పౌర జనాభాకు ఉద్దేశపూర్వకంగా బాధలు కలిగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని ఆయన స్పష్టం చేశారు.
సంధి కుదిరినా ఆగని మంటలు.. ముచ్చటగా మూడోసారి?
అయితే, ఈ ఉత్కంఠ నడుమ గడువు ముగియడానికి గంటన్నర ముందే ఇరాన్‌పై దాడులను రెండు వారాల పాటు నిలిపివేస్తూ, ఇరాన్, అమెరికాల మధ్య కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య ఈ సంధి కుదిరినప్పటికీ డెమొక్రాట్లు మాత్రం ఏమాత్రం శాంతించడం లేదు. ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగడానికి అనర్హుడని, ఆయనపై వెంటనే అభిశంసన చేపట్టాలని పట్టుబడుతున్నారు. కాల్పుల విరమణ ఉన్నా లేకున్నా.. ట్రంప్ అభిశంసనకు గురయ్యేంత తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని, దేశానికి, ప్రపంచానికి ఆయన వల్ల మరింత నష్టం జరగకుండా ఆయన్ను తొలగించే ప్రక్రియను కాంగ్రెస్ ప్రారంభించాలని వారు కోరుతున్నారు.
గతంలో తన మొదటి పదవీకాలంలో ట్రంప్ రెండుసార్లు అభిశంసనకు గురయ్యారు. కానీ ప్రతిసారీ రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని సెనేట్ ఆయనను నిర్దోషిగా బయటపడేసింది. అయితే, మూడోసారి కూడా తనపై అభిశంసన కత్తి వేలాడుతుందనే భయం ట్రంప్ మనసులోనూ మెదులుతూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన హౌస్ రిపబ్లికన్ల సమావేశంలో ఆయన స్వయంగా ఒక అంచనా వేశారు. 2026 మధ్యంతర ఎన్నికలలో గనక మనం గెలవకపోతే, డెమొక్రాట్ల ఆధ్వర్యంలోని హౌస్ తనపై ఖచ్చితంగా మరోసారి అభిశంసన తీర్మానం ప్రవేశపెడుతుందని ట్రంప్ ముందే పసిగట్టారు. మొత్తానికి ఒక దేశాన్ని బూడిద చేస్తానన్న అహంకారం.. ఇప్పుడు అగ్రరాజ్య అధ్యక్షుడి పదవికే ఎసరు పెడుతోంది!
Also Read:
US Iran Ceasefire: పాకిస్థాన్నే అమెరికా, ఇరాన్ ఎందుకు నమ్మాయి? తెరవెనుక అసలు కథ!Indians In Iran: ఇరాన్ వదిలి తక్షణమే వచ్చేయండి
Israel Lebanon Conflict: లెబనాన్‌పై దాడులు ఆగవన్న ఇజ్రాయెల్
US Iran Conflict: ట్రంప్ వెనక్కి తగ్గింది అందుకే!
US Iran Ceasefire | యుద్ధానికి బ్రేక్: ట్రంప్, ఇరాన్ 14 రోజుల సంధి!

