ప్రపంచాన్ని శాసించే టెక్ దిగ్గజాలకు సైతం చెమటలు పట్టిస్తున్నారు ఆ సైబర్ దొంగలు. ఐడెంటిటీలు మార్చేసుకుని, నకిలీ రెజ్యూమెలతో అమెరికా (US) ఐటీ కంపెనీల్లోకి చొరబడుతూ అత్యంత రహస్యమైన, సున్నితమైన డేటాను సైలెంట్‌గా తస్కరిస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు.. నియంత కిమ్ జోంగ్ ఉన్ వదిలిన ఉత్తర కొరియా రహస్య ఏజెంట్లు! అయితే, కళ్లుగప్పి కంపెనీల్లోకి వస్తున్న ఈ నకిలీ ఉద్యోగులను పట్టుకునేందుకు అమెరికన్ కంపెనీలు ఇప్పుడు ఒక విచిత్రమైన, ప్రాణాంతకమైన టెస్ట్ పెడుతున్నాయి. అదేంటో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు!
లావు పంది.. కిమ్‌ను తిడితేనే ఉద్యోగం!
ఉత్తర కొరియా ఏజెంట్లను ఇంటర్వ్యూల్లో అడ్డంగా బుక్ చేసేందుకు అమెరికా ఐటీ కంపెనీలు ఒక మైండ్ బ్లోయింగ్ వ్యూహాన్ని అమలు చేస్తున్నాయి. ఆన్‌లైన్ ఇంటర్వ్యూకు హాజరయ్యే వ్యక్తి ఉత్తర కొరియన్ అని ఏమాత్రం అనుమానం వచ్చినా.. వెంటనే ఆ అభ్యర్థికి ఒక విచిత్రమైన టాస్క్ ఇస్తున్నాయి. తమ దేశ నియంత అయిన కిమ్ జోంగ్ ఉన్‌ను ‘లావు పంది’ అని పచ్చిగా అవమానించాలని కండిషన్ పెడుతున్నాయి.
ఉత్తర కొరియన్లు కిమ్‌ను తమ దేవుడిగా భావిస్తారు. ఆయన్ని పల్లెత్తు మాట అన్నా అక్కడ మరణశిక్షే. అందుకే కిమ్‌ను అలా తిట్టలేక ఆ ఏజెంట్లు ఇంటర్వ్యూల్లో అడ్డంగా దొరికిపోతున్నారు.
ప్రాణమే ముఖ్యం.. వైరల్ అవుతున్న వీడియో
తాజాగా ఇదే తరహాలో జరిగిన ఒక వీడియో 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. 'టారో ఐకూచి' అనే పేరుతో ఇంటర్వ్యూకు హాజరైన ఒక కొరియన్ వ్యక్తికి ఈ పరిస్థితే ఎదురైంది. ఆ వీడియో కాలింగ్‌లో ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి.. ‘‘కిమ్ జోంగ్ ఉన్ ఒక లావుపాటి, అసహ్యమైన పంది అని తిట్టు’’ అని ఆ అభ్యర్థిని అడిగాడు.
ఆ మాట వినగానే ఆ అభ్యర్థి ఒక్కసారిగా నివ్వెరపోయాడు. భయంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. ఆ ప్రశ్న తనకు అసలు అర్థం కానట్లు కొద్దిసేపు నటించి.. ఆ తర్వాత సైలెంట్‌గా ఇంటర్వ్యూ మధ్యలోనే కట్ చేసి బయటకు వెళ్లిపోయాడు. తనకు ఉద్యోగం కంటే ప్రాణమే ముఖ్యమని అతడు భావించిన తీరు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
Here is a video of a North Korean IT worker being stopped dead in their tracks upon being required to insult Kim Jong Un.
— tanuki42 (@tanuki42_) April 6, 2026
It won't work forever, but right now it's genuinely an effective filter. I'm yet to come across one who can say it. https://t.co/8FFVPxNm8X pic.twitter.com/KXI5efMo5L
ఏళ్ల నాటి సమస్య.. డేటా చోరీకి కిమ్ స్కెచ్
గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా ఐటీ కంపెనీలకు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఉత్తర కొరియన్లు తాము వేరే ప్రాంతానికి చెందినవారమని నటిస్తూ, ఫేక్ రెజ్యూమెలను తయారు చేస్తున్నారు. కొన్నిసార్లు అమెరికాలో ఉండే వారి సహచరుల సహాయం కూడా తీసుకుని మరీ వందలాది పాశ్చాత్య కంపెనీలలో రిమోట్ ఉద్యోగాల్లో సైలెంట్ గా చేరిపోతున్నారు.
అయితే అమెరికా చట్టాల ప్రకారం ఇలా చేయడం నేరం. ఎందుకంటే నిషేధిత అణ్వాయుధ కార్యక్రమాల కారణంగా ఉత్తర కొరియాపై అమెరికాతో పాటు దాని మిత్రదేశాలు అత్యంత కఠినమైన ఆర్థిక ఆంక్షలను కొనసాగిస్తున్నాయి. ఈ చట్టాల వల్ల ఏ ఐటీ కంపెనీ కూడా ఉత్తర కొరియన్లను అధికారికంగా నియమించుకోవడానికి అస్సలు అనుమతి లేదు.
దేవుడిపై తిట్టు.. అడ్డంగా బుక్
కాలక్రమేణా, ఇంటర్వ్యూ ప్రక్రియలో ఉత్తర కొరియా వాసులను సులువుగా బయటపెట్టడానికి ఈ 'తిట్టు' మార్గం ఒక్కటే కరెక్ట్ అని అమెరికా కంపెనీలు గ్రహించాయి. ఆ దేశంలో కిమ్ జోంగ్ ఉన్‌ను అవమానించడం కఠినమైన చట్టవిరుద్ధం.. దానికి కఠినమైన శిక్షలు పడతాయి.
కాబట్టి, అనుమానం వచ్చిన నకిలీ వ్యక్తిని వారి నియంతను పచ్చిగా అవమానించమని కోరడమే అసలైన బ్రహ్మాస్త్రంగా మారింది. ఇది ఐటీ వర్గాలకు తెలిసిన పాత వ్యూహమే అయినప్పటికీ.. ఇలా రియల్ లైఫ్‌లో ఒక వ్యక్తి అడ్డంగా దొరికిపోయి, ఆ వీడియో రికార్డ్ కావడం మాత్రం చాలా అరుదుగా చూస్తుంటాం.
ఎత్తుగడ ఎప్పుడూ పనిచేస్తుందా?
అయితే ఇక్కడ ఒక కీలకమైన లాజిక్ కూడా ఉంది. కిమ్‌ను తిట్టమనే ఈ ఎత్తుగడ ఎప్పుడూ నూటికి నూరు శాతం పనిచేయకపోవచ్చు. కొంతమంది ఉత్తర కొరియా ఏజెంట్లు ముఖ్యంగా చైనా లేదా రష్యా లాంటి ఇతర దేశాల్లో నివసిస్తుంటారు. తమ మాతృ దేశ సరిహద్దుల్లో ఉండే హ్యాకర్ల మాదిరిగా వీరు ఎల్లప్పుడూ కఠినమైన పర్యవేక్షణలో ఉండరు. అందువల్ల అలాంటి వారు.. ఈ ఎత్తుగడను సులువుగా దాటేసే ప్రమాదం కూడా లేకపోలేదు.
హ్యాకింగ్ తో దేశాలను గడగడలాడించే ఏజెంట్లు.. ఒక చిన్న 'తిట్టు'కి భయపడి పారిపోవడం చూస్తుంటే, టెక్నాలజీ కంటే నియంతృత్వపు భయమే అత్యంత శక్తివంతమైనదని స్పష్టమవుతోంది!
Also Read:
Donald Trump Impeachment | ఇరాన్ ఎఫెక్ట్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ఔట్?మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపిన 'తెలుగింటి అల్లుడు' జేడీ వాన్స్ మంత్రాంగం!
US Iran Ceasefire: పాకిస్థాన్నే అమెరికా, ఇరాన్ ఎందుకు నమ్మాయి? తెరవెనుక అసలు కథ!
Indians In Iran: ఇరాన్ వదిలి తక్షణమే వచ్చేయండి
Israel Lebanon Conflict: లెబనాన్‌పై దాడులు ఆగవన్న ఇజ్రాయెల్

