ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిపై ఇప్పుడు పెను ఆధిపత్య పోరు మొదలైంది! అమెరికా, ఇజ్రాయెల్‌లతో జరుగుతున్న భీకర యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. ఇరాన్ వేసిన ఒక భారీ స్కెచ్ ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. కాల్పుల విరమణ కోసం ఇరాన్ తెరపైకి తెచ్చిన పది డిమాండ్లలో ఒకటైన 'హర్మూజ్ టోల్ ఫీజు' వ్యవహారం ఇప్పుడు మిత్రదేశం ఒమన్‌తోనే చిచ్చు రేపుతోంది. అగ్రరాజ్యాలను వణికించిన ఇరాన్.. ఇప్పుడు ఈ జలసంధిపై ఆధిపత్యం కోసం ఏం చేయబోతోంది?
ఇరాన్ టోల్ ఫీజు డిమాండ్.. ఒమన్ స్ట్రాంగ్ కౌంటర్!
కాల్పుల విరమణకు సంబంధించి ఇరాన్ ప్రతిపాదించిన పది డిమాండ్లలో హర్మూజ్ జల సంధిలో నౌకలకు టోల్ ఫీజు వసూలు చేయడం అత్యంత కీలకమైనది. ఈ జలమార్గం గుండా భారీ ఆయిల్ ట్యాంకర్లు, నౌకలు వెళ్లాలంటే.. భౌగోళికంగా నియంత్రణ కలిగిన ఇరాన్, ఒమన్‌లకు టోల్ రుసుం వసూలు చేసే సంపూర్ణ అధికారం ఉండాలని ఇరాన్ ఒక కఠిన నిబంధనను చేర్చింది.
అయితే, ఇరాన్ డిమాండ్‌తో ఏమాత్రం ఏకీభవించని ఒమన్ దీనిని తీవ్రంగా విభేదించింది. "హర్మూజ్‌ను దాటడానికి నౌకలపై ఎలాంటి సుంకాలు విధించరాదు" అని ఆ దేశం కుండబద్దలు కొట్టింది.
34 కిలోమీటర్ల ఇరుకు సముద్రం.. ప్రపంచానికి ప్రాణాధారం!
ఈ వివాదంపై ఒమన్ రవాణా శాఖ మంత్రి మరింత స్పష్టత ఇచ్చారు. హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఎలాంటి అదనపు రుసుములు విధించబోమనే గట్టి హామీ ఇచ్చే ఒప్పందాలపై తమ సుల్తాన్ ఇప్పటికే సంతకాలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ వ్యూహాత్మక, అత్యంత కీలక ప్రదేశంలో స్వేచ్ఛాయుతమైన, సురక్షితమైన నౌకాయానాన్ని నిర్ధారించడానికి ఒమన్ పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి నొక్కి చెప్పారు.
ఇరాన్, ఒమన్ మధ్య కేవలం 34 కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ వ్యూహాత్మక జల సంధిని అంతర్జాతీయ జలాలుగానే పరిగణిస్తారు. గతంలో ఎప్పుడూ చరిత్రలో హర్మూజ్‌లో టోల్ ఫీజు వసూలు చేసిన సందర్భాలు అసలే లేవు. పర్షియన్ గల్ఫ్‌లో కీలకమైన ఈ జలమార్గం ద్వారానే ప్రపంచ చమురు రవాణాలో ఏకంగా 20 శాతం జరుగుతుండటం దీని ప్రాముఖ్యతకు అద్దం పడుతోంది.
ఆ నష్టం పూడ్చుకునేందుకేనా? ఇరాన్ మాస్టర్ ప్లాన్!
అసలు ఇరాన్ ఎందుకింతలా టోల్ ఫీజు కోసం పట్టుబడుతోంది? దీని వెనుక వాళ్లకో బలమైన వాదన ఉంది. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడులతో పశ్చిమాసియాలో ఈ భయంకరమైన యుద్ధం ప్రారంభమైంది. ఈ సంఘర్షణ తమ దేశ రక్షణ, పరిపాలన, పౌర మౌలిక సదుపాయాలకు ఊహించని స్థాయిలో విస్తృత విధ్వంసం కలిగించిందని ఇరాన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
అందుకే, హర్మూజ్ గుండా వెళ్లే నౌకల ద్వారా టోల్ రూపంలో సేకరించిన డబ్బును.. తమ దేశంలో యుద్ధానంతర పునర్నిర్మాణ పనుల కోసం వినియోగిస్తామని ఇరాన్ బహిరంగంగానే పేర్కొంది. పైగా, తాము కేవలం తాత్కాలిక కాల్పుల విరమణకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, యుద్ధానికి శాశ్వత ముగింపు పలకాల్సిందేనని ఇరాన్ గట్టిగా పట్టుబడుతోంది.
లైసెన్సులు తప్పనిసరి.. ఒమన్‌తో మంతనాలు!
హర్మూజ్‌లో నౌకల నుంచి టోల్ ఫీజు వసూలు చేసే నియంత్రణ కచ్చితంగా తమ చేతుల్లోనే ఉండాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఈ ఫీజు నౌక రకం, దానిలోని సరుకు విలువ, ఇతర ప్రస్తుత పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.
ఈ వ్యవహారంపై ఇరాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి కాజెమ్ గరీబాబ్ది గత వారం స్పందిస్తూ.. హర్మూజ్ గుండా వెళ్లే నౌకలు ఇకపై కచ్చితంగా అనుమతులు, లైసెన్సులు పొందడాన్ని తప్పనిసరి చేస్తూ ఒమన్‌తో ఒక పక్కా ప్రోటోకాల్‌ను తాము రూపొందిస్తామని బాంబు పేల్చారు. అయితే ఈ చర్య రవాణాను పరిమితం చేయడానికి కాకుండా మరింత సులభతరం చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని ఆయన కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ఆ సమయంలో సులభతర రవాణాను నిర్ధారించే మార్గాలపై ఇరాన్‌తో తాము సుదీర్ఘ చర్చలు జరిపినట్లు ఒమన్ కూడా అధికారికంగా తెలిపింది. కానీ, అంతిమంగా ఇరు దేశాల మధ్య ఏమైనా ఒప్పందాలు కుదిరాయా? లేదా? అనేది మాత్రం ఇప్పటికీ గోప్యంగానే ఉంచారు.
అమెరికా దాడుల నష్టాన్ని పూడ్చుకునేందుకు ఇరాన్.. ఇప్పుడు హర్మూజ్ టోల్ పేరుతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటే, ఒమన్ దానికి అడ్డుకట్ట వేస్తుండటం రాబోయే కొత్త ఘర్షణలకు తెరతీస్తోంది. యుద్ధం ఆగినా, ఈ జలసంధిపై పట్టు కోసం జరిగే పోరు మాత్రం ఇప్పట్లో ముగిసేలా లేదు!
Also Read:
ఇంటర్వ్యూల్లో అడ్డంగా దొరికిపోతున్న ఉత్తర కొరియా సైబర్ దొంగలుDonald Trump Impeachment | ఇరాన్ ఎఫెక్ట్: అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ ఔట్?
మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆపిన 'తెలుగింటి అల్లుడు' జేడీ వాన్స్ మంత్రాంగం!
US Iran Ceasefire: పాకిస్థాన్నే అమెరికా, ఇరాన్ ఎందుకు నమ్మాయి? తెరవెనుక అసలు కథ!
Indians In Iran: ఇరాన్ వదిలి తక్షణమే వచ్చేయండి

