మీ బైక్‌కు పెట్రోల్ కొట్టించాలంటే రేపు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి రాబోతోందా? అవును, పశ్చిమాసియాలో రగులుతున్న ఆధిపత్య పోరు ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసించబోతోంది! హర్మూజ్ జలసంధి వేదికగా అగ్రరాజ్యం అమెరికా ఆడుతున్న అదృశ్య యుద్ధం ఏ క్షణమైనా పెను విలయానికి దారితీయవచ్చు. అసలు ఈ ముట్టడి వెనుక ఉన్న డొనాల్డ్ ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఏంటి? సముద్రంలో అమెరికా నౌకలను తగలబెడతామంటూ ఇరాన్ ఎందుకు గర్జిస్తోంది? సామాన్యుడిగా ఈ గ్లోబల్ టెన్షన్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు వాస్తవాలు ఇవే!
ఆయుధం లేని యుద్ధం.. ఇరాన్‌పై ట్రంప్ ఉక్కుపాదం
అమెరికా చేపట్టిన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) దిగ్బంధనంతో ఇరాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో, తన అధికార యంత్రాంగానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసినట్లు అక్కడి మీడియా కోడై కూస్తోంది.
ఇరాన్‌పై కేవలం తాత్కాలికంగా కాకుండా.. ఒక దీర్ఘకాలిక ముట్టడికి సర్వసన్నద్ధం కావాలని ట్రంప్ తన యంత్రాంగానికి స్పష్టం చేసినట్లు కథనాలు వస్తున్నాయి. బాంబులు వేసి సైనిక దాడులు చేయడం లేదా యుద్ధం నుంచి వెనక్కి తగ్గడం కంటే.. ఈ ఆర్థిక దిగ్బంధనమే ఇరాన్ (Iran)కు కోలుకోలేని ఆర్థిక నష్టాన్ని మిగులుస్తుందని ట్రంప్ బలంగా నమ్ముతున్నారు.
దీంతో, ప్రస్తుతం కొనసాగుతోన్న దిగ్బంధనాన్ని మరికొన్ని రోజుల పాటు పొడిగించాలని ఆయన కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఎత్తుగడతో ఇరాన్ చమురు ఎగుమతులు అమాంతం పడిపోయి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతోంది. అమెరికా వ్యూహం ఇలాగే కొనసాగితే ఇరాన్ సుదీర్ఘకాలం ఆర్థిక సమస్యల్లో కూరుకుపోక తప్పదు. మరోవైపు.. అమెరికా చర్యలకు ప్రతిగా ఇరాన్ ఎలాంటి వినాశనానికి దిగుతుందోనన్న ఆందోళనలు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి.
సముద్రంలోనే తగలబెడతాం.. ఇరాన్ భీకర హెచ్చరిక!
అమెరికా ఆడుతున్న ఈ మైండ్ గేమ్‌పై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఒకవేళ అమెరికా మళ్లీ ఏమాత్రం సైనిక చర్యలకు దిగినా.. ఇక్కడ పరిస్థితులు ఊహించని రేంజ్‌లో దారుణంగా ఉంటాయని ఐఆర్‌జీసీ నావికాదళ సీనియర్ అధికారి ఒకరు మీడియా సాక్షిగా అమెరికాకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికా తిరిగి దురాక్రమణకు పాల్పడితే.. పశ్చిమాసియా వ్యాప్తంగా చాపకింద నీరులా ఉన్న ఇరాన్ అనుకూల సాయుధ గ్రూపులన్నీ ఒక్కసారిగా రంగంలోకి దిగుతాయని ఆయన వార్నింగ్ ఇచ్చారు. సముద్రంలో అడుగుపెట్టే అమెరికాకు చెందిన భారీ నౌకలను నడిసముద్రంలోనే నిలువునా తగలబెట్టేస్తామంటూ వారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
వెనక్కి తగ్గిన శత్రువులు.. యుద్ధం ముగియలేదు!
ఇదిలాఉంటే.. అమెరికాతో అధికారికంగా సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) జరిగినా, అది కేవలం కాగితాలకే పరిమితమని ఇరాన్ భావిస్తోంది. ఇప్పటికీ అమెరికాతో యుద్ధం కొనసాగుతున్నట్లే తాము పరిగణిస్తున్నామని ఇరాన్ ఆర్మీ అధికార ప్రతినిధి అమిర్ అక్రమినియా కుండబద్దలు కొట్టారు.
అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధి.. ఇప్పటికీ పూర్తిగా తమ సాయుధ దళాల ఉక్కు పిడికిలిలోనే ఉందని ఆయన సగర్వంగా ప్రకటించారు. తమపై భయంకరమైన భూతల దాడులకు దిగుతామని శత్రువులు పదే పదే ప్రగల్భాలు పలికారని, కానీ చివరకు తోకముడిచి వెనక్కి తగ్గారని ఆయన ఎద్దేవా చేశారు.
జర్మన్ ఛాన్సలర్‌పై ట్రంప్ ఫైర్.. అణ్వాయుధమే అసలు టార్గెట్!
ఇరాన్ ఎపిసోడ్‌పై జర్మన్ ఛాన్సలర్ ఫెడ్రిక్ మెర్జ్ (Friedrich Merz) చేసిన వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల పాకిస్థాన్ వేదికగా జరగాల్సిన దౌత్య చర్చలు పూర్తిగా విఫలమైన నేపథ్యంలో.. ఇరాన్‌పై అమెరికా అనుసరిస్తున్న విధానాలను, ట్రంప్ యంత్రాంగాన్ని మెర్జ్ తీవ్రంగా తప్పుబట్టారు.
దీనిపై ట్రంప్ తన అధికారిక 'ట్రూత్ సోషల్' వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. టెహ్రాన్ అణు కార్యక్రమం విషయాన్ని మెర్జ్ తప్పుగా అంచనా వేశారని, ఈ విషయంలో తన వైఖరిని కూడా ఆయన కావాలనే వక్రీకరిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.
ఇరాన్ లాంటి దేశం అణ్వాయుధం కలిగిఉన్నా మెర్జ్‌కు ఎలాంటి ఫర్వాలేదని, అసలు తానెవరి గురించి మాట్లాడుతున్నానో మెర్జ్‌కే అర్థం కావడం లేదని ట్రంప్ సెటైర్లు వేశారు. ఒకవేళ ఆ దేశం చేతికి అణ్వాయుధం చిక్కితే.. అది ప్రపంచం మొత్తాన్ని భయంకరమైన ఇబ్బందుల్లోకి నెట్టేస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు.
ఆయుధాలతో చేసే యుద్ధం కన్నా, ఆర్థికంగా గొంతు నులిమే వ్యూహమే శత్రువుకు అత్యంత ప్రమాదకరమైనది! హర్మూజ్ జలసంధి ఇప్పుడు కేవలం ఒక సముద్ర మార్గం కాదు, ప్రపంచ ఆధిపత్యానికి కేంద్ర బిందువు. ఇరాన్ నావికా దళం ప్రతీకార దాడులకు దిగితే, ఆ మంటల సెగ గ్లోబల్ సప్లయ్ చైన్‌ను దహించివేసి ఎకనామిక్ క్రైసిస్‌కు దారి తీస్తుంది. అణ్వాయుధాల ముప్పు, కాలిపోతున్న చమురు నావలు... ఈ పరిణామాలన్నీ రాబోయే రోజుల్లో పశ్చిమాసియాను మరింత భయంకరమైన మలుపు తిప్పడం ఖాయం!

