Middle East Conflict : అమెరికాకు ఇరాన్ 3 అంచెల వ్యూహం

naveen
By -
Middle East Conflict


పశ్చిమాసియాలో రగులుతున్న అగ్నిపర్వతాన్ని చల్లార్చేందుకు ఓ మహా వ్యూహం తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి నుంచి ప్రపంచాన్ని వణికిస్తున్న భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా ఇరాన్ ఒక సంచలన అడుగు వేసింది. అగ్రరాజ్యం అమెరికా ముందు ఒక బలమైన 'మూడు దశల ప్రతిపాదన'ను ఉంచి అంతర్జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించింది. పాకిస్థాన్‌లో జరిగిన రెండో విడత చర్చలు విఫలం కావడంతో.. ఏమాత్రం వెనక్కి తగ్గని ఇరాన్, దౌత్య మార్గంలో మధ్యవర్తుల ద్వారా ఈ సరికొత్త వ్యూహాన్ని వాషింగ్టన్‌ గడపకు చేర్చింది.


మూడు అంచెల వ్యూహం.. అగ్రరాజ్యానికి కండిషన్స్!


ఇరాన్ వేసిన ఈ కొత్త స్కెచ్‌లో యుద్ధం, జలసంధి భద్రత, అణు అంశం లాంటి అత్యంత కీలకమైన అంశాలున్నాయి. మొదటి దశ కింద.. ఈ భీకర యుద్ధానికి తక్షణమే పూర్తిస్థాయి ముగింపు పలకాలని ఇరాన్ తేల్చిచెప్పింది. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇరాన్, లెబనాన్‌లపై ఎలాంటి దాడులూ జరగవని అమెరికా ఖచ్చితమైన హామీ ఇవ్వాలని షరతు పెట్టింది.


ఈ మొదటి దశ పూర్తయ్యాక, రెండో దశలో భాగంగా.. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన 'హార్మూజ్ జలసంధి' నిర్వహణ, పరిపాలనపై ఇరు దేశాలు ముఖాముఖి చర్చలు జరుపుతాయని స్పష్టం చేసింది. ఈ రెండు దశలు నూటికి నూరు శాతం విజయవంతమైతేనే.. మూడో దశ అయిన 'అణు అంశం' తెరపైకి వస్తుంది. అగ్రరాజ్యం ఎప్పటి నుంచో పట్టుబడుతున్న యురేనియం నిల్వలపై అప్పుడు మాత్రమే చర్చలకు వస్తామని ఇరాన్ తన పవర్ ఫుల్ ప్లాన్‌ను బయటపెట్టింది.


తగ్గేదే లేదంటున్న వైట్‌హౌస్.. ట్రంప్ అసహనం!


ఇరాన్ విసిరిన ఈ త్రిముఖ వ్యూహంపై అమెరికా వైట్‌హౌస్ అంతే దీటుగా బదులిచ్చింది. వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒలీవియా వేల్స్ స్పందిస్తూ.. దౌత్యపరమైన చర్చలు ఎప్పుడూ పత్రికల ద్వారా సాగవని కుండబద్దలు కొట్టారు. తమకు అమెరికా ప్రజల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. ఇరాన్ ఎప్పటికీ అణు ఆయుధాన్ని కలిగి ఉండే ప్రసక్తే లేదని తమ అధ్యక్షుడు స్పష్టంగా చెప్పారని ఆమె గుర్తుచేశారు. అసలు మీతో చర్చలు నిర్వహించాలా, వద్దా అన్న నిర్ణయం పూర్తిగా తమ చేతుల్లోనే ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.


మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఇరాన్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "ఇకపై మా రాయబారులు ఎవరూ 18 గంటల పాటు సుదీర్ఘ విమాన ప్రయాణాలు చేసి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు.. ఏదైనా ఉంటే నేరుగా ఫోన్ కాల్‌లోనే మాట్లాడుకోవచ్చు" అంటూ తనదైన శైలిలో ఘాటుగా వ్యాఖ్యానించారు.


పాక్ చర్చలు విఫలం.. పుతిన్ వైపు పయనం!


ఈ పరిణామాల వెనుక ఓ పెద్ద వైఫల్యం దాగి ఉంది. పాకిస్థాన్ వేదికగా ఏప్రిల్ 11, 12వ తేదీల్లో జరిగిన కీలక చర్చలు ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ఏకంగా రెండుసార్లు పాకిస్థాన్‌ను సందర్శించినప్పటికీ.. అమెరికా ప్రతినిధులతో నేరుగా ముఖాముఖి మాట్లాడటానికి ససేమిరా అన్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. తాము ఇచ్చినదే 'చివరి ఉత్తమ ఆఫర్' అని తేల్చిచెప్పారు.


ఈ పరిణామాలతో పశ్చిమాసియా ఎపిసోడ్ మరో కీలక మలుపు తిరిగింది. అమెరికాకు చెక్ పెట్టేందుకు అరాగ్చీ నేరుగా రష్యాకు చేరుకున్నారు. అక్కడ ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అత్యంత రహస్యంగా భేటీ అయి, మధ్యప్రాచ్య పరిస్థితులపై వ్యూహాత్మక చర్చలు జరపనున్నారు.


అగ్రరాజ్యంతో నేరుగా తలపడకుండానే, దౌత్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఇరాన్ తాజా ఎత్తుగడ.. పశ్చిమాసియాలో రాబోయే రోజుల్లో ఏ క్షణమైనా పెను మార్పులకు నాంది పలకడం ఖాయం. పుతిన్ రంగంలోకి దిగుతుండటంతో ఈ చదరంగం ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది!