వేసవి సెలవులు వచ్చేశాయి కదా అని పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చి.. వాళ్లు ఇంట్లోనే సేఫ్‌గా ఉన్నారని మీరు మురిసిపోతున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే! ఎందుకంటే, మీ ఇంట్లో ఉన్న ఆ ఐదంగుళాల స్మార్ట్ ఫోన్ తెర మీ పిల్లల పాలిట సైలెంట్ కిల్లర్‌గా మారుతోంది. ఆ చిన్న స్క్రీన్ వెనుక ఏ సైబర్ నేరగాడు పొంచి ఉన్నాడో, మీ బిడ్డ ఏ వ్యసనానికి బానిసవుతున్నాడో తెలుసుకోకపోతే.. రేపు మీరు కన్నీరు పెట్టుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రతి తల్లిదండ్రులూ తక్షణం తెలుసుకోవాల్సిన, ఆలోచించాల్సిన అత్యంత తీవ్రమైన ముప్పుపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ చేసిన హెచ్చరికలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆ ఐదంగుళాల తెర వెనుక దాగున్న మాయాజాలం!
ప్రస్తుతం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వీసీ సజ్జనార్.. కేవలం లా అండ్ ఆర్డర్ దగ్గరే ఆగిపోరు. సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఎన్నో సున్నితమైన అంశాలపై ఆయన నిత్యం ప్రజలను అప్రమత్తం చేస్తూనే ఉంటారు.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆయన ఏ పోస్ట్ చేసినా అది క్షణాల్లోనే వైరల్ అవుతుంది. సైబర్ నేరాలపై నిత్యం అవగాహన కల్పించే సీపీ సజ్జనార్.. తాజాగా వేసవి సెలవుల్లో పిల్లల భద్రతపై చేసిన ఒక ట్వీట్ ప్రతి ఒక్కరి గుండెను తట్టి లేపుతోంది. వేసవి సెలవులే కదా అని పిల్లలను పట్టించుకోవడం అశ్రద్ధ చేస్తే.. అది అత్యంత తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని ఆయన సున్నితంగా హెచ్చరించారు.
సెలవుల వినోదం.. వ్యసనంగా మారకూడదు!
సాధారణంగా వేసవి సెలవుల్లో స్కూళ్లు, ట్యూషన్లు, చదువుల ఒత్తిడి లేక పిల్లలంతా ఖాళీగా ఉంటారు. ఆ సమయంలో కాలక్షేపం కోసం ఫోన్, టీవీ, ల్యాప్ టాప్ స్క్రీన్లకు అతుక్కుపోవడం సర్వసాధారణంగా మారిపోయింది.
అయితే సోషల్ మీడియా విపరీతంగా అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత తరుణంలో.. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ స్మార్ట్ ఫోన్ల మాయలో బందీలవుతున్నారు. ప్రస్తుత వేసవి సెలవుల వినోదం కాస్తా భయంకరమైన డిజిటల్ వ్యసనంగా మారకూడదని తల్లిదండ్రులకు సజ్జనార్ కీలక సూచనలు చేశారు.
నాటి పల్లె జ్ఞాపకాలు.. నేటి ఒంటరితనం!
ఒకప్పుడు వేసవి సెలవులు అంటే చాలు.. అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆడుకునే ఆటపాటల కోలాహలం కళ్ల ముందు మెదిలేదని సజ్జనార్ గుర్తు చేశారు. కానీ, నేటి బాల్యం కేవలం ఒక 5 అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం అత్యంత ఆందోళనకరం అన్నారు.
పనుల ఒత్తిడిలో తల్లిదండ్రులు పిల్లలకు నాణ్యమైన సమయాన్ని కేటాయించలేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని ఆయన కుండబద్దలు కొట్టారు. ఆ డిజిటల్ మాయాజాలంలో చిక్కుకుని పిల్లలు తీవ్రమైన ఒంటరితనానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రీల్స్ మత్తులో.. చేజారుతున్న భవిష్యత్తు!
దీనివల్ల సోషల్ మీడియాలో పిల్లలు అపరిచితుల ఉచ్చులో పడే ప్రమాదం ఉందన్నారు. రీల్స్ లాంటి వ్యసనాలకు బానిసలై.. కనీసం తిండి, నిద్ర కూడా మానేసి తమ ఆరోగ్యాన్ని, భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని సజ్జనార్ హెచ్చరించారు.
నలుగురిలో కలివిడిగా ఉండకపోవడం వల్ల వారిలో సహనం నశిస్తోందని.. తల్లిదండ్రులు చేసే చిన్న చిన్న మందలింపులకే మనస్తాపం చెంది ఏకంగా ఇంటి నుంచి పారిపోతున్న ఘటనలు హైదరాబాద్‌లో ఇటీవల వెలుగు చూస్తున్నాయని గుర్తుచేశారు. ఇవి ఆయా కుటుంబాల్లో తీరని మనోవేదనను మిగిలుస్తున్నాయన్నారు.
గ్యాడ్జెట్లు కాదు.. మీ సమయాన్నే బహుమతిగా ఇవ్వండి!
అందుకే ఈ ఎండాకాలం సెలవుల్లో పిల్లలకు ఖరీదైన గ్యాడ్జెట్లు కొనివ్వడం కంటే.. తల్లిదండ్రులు తమ సమయాన్నే వారికి బహుమతిగా ఇవ్వాలని సీపీ సజ్జనార్ హితవు పలికారు. పిల్లలు ఇంటర్‌నెట్‌లో ఏం చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అన్న అంశాలపై నిరంతరం ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.
మరీ ముఖ్యంగా పరీక్షల ఫలితాలు వచ్చే సమయంలో పిల్లలకు కొండంత భరోసానిస్తూ.. వారి ప్రతి కదలికను గమనిస్తూ సరైన దిశానిర్దేశం చేయాలన్నారు. తల్లిదండ్రుల అప్రమత్తతే.. బిడ్డల బంగారు భవిష్యత్తుకు అసలైన శ్రీరామరక్ష అని ఆయన స్పష్టం చేశారు.
మొబైల్ ఫోన్ అనేది పిల్లలకు లోకాన్ని పరిచయం చేసే సాధనం కావాలి కానీ.. వారి లోకాన్ని శాసించే వ్యసనం కాకూడదు. సజ్జనార్ చెప్పినట్లు, గదిలో కూర్చుని రీల్స్ చూస్తున్నాడు కదా అని వదిలేస్తే, రేపు వాళ్ల మానసిక పరిస్థితి చేజారిపోతే డాక్టర్లు కూడా ఏమీ చేయలేరు. ఈ వేసవిలో కనీసం ఒక గంట మీ పిల్లల పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడండి, వాళ్లతో కలిసి ఆడుకోండి. మీరిచ్చే ఆ ఒక్క గంట సమయమే వాళ్ల జీవితాన్ని గాడిలో పెడుతుంది!
వేసవి వినోదం.. డిజిటల్ వ్యసనం కాకూడదు: తల్లిదండ్రులూ అప్రమత్తం!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) April 6, 2026
ఒకప్పుడు వేసవి సెలవులంటే అమ్మమ్మ ఊరి జ్ఞాపకాలు, పచ్చని చెరువు గట్లు, మైదానాల్లో ఆటపాటల కోలాహలం. కానీ నేడు బాల్యం కేవలం ఐదు అంగుళాల స్మార్ట్ ఫోన్ తెరకే పరిమితమైపోవడం ఆందోళనకరం.
తల్లిదండ్రులు తమ పనుల్లో నిమగ్నమై… pic.twitter.com/azd0q8V1NE
Also Read:
Soil Health Volunteers: తెలంగాణలో 30 వేల మంది వాలంటీర్లుఅప్పా జంక్షన్లో హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!
Indira Mahila Shakti: మహిళల చేతుల్లో పెట్రోల్ బంకులు
టీజీఎస్ఆర్టీసీకి కోర్టు షాక్.. ప్రమాద బాధితుడికి రూ.89 లక్షల పరిహారం!
Telangana New Districts: జిల్లాల రద్దుపై సీఎం క్లారిటీ

.webp)