మండుటెండల్లో.. వానల్లో.. మీ ఇంటి గడప వద్దకు సమయానికి పార్సిల్ తెచ్చే డెలివరీ బాయ్ జీవితం ఎంత కష్టమో ఎప్పుడైనా ఆలోచించారా? మనం ఇంట్లో కూర్చుని ఏసీలో ఆర్డర్ చేస్తే, రోడ్లపై ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగెత్తే ఆ సామాన్య కార్మికులకు ఇప్పుడు ఒక బహుళజాతి సంస్థ కొండంత అండగా నిలబడింది. అవును, ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా తన డెలివరీ బాయ్స్ కోసం తీసుకున్న తాజా నిర్ణయం.. కార్పొరేట్ ప్రపంచంలోనే ఒక సంచలనంగా మారింది.
లక్షల రూపాయల బీమా.. కుటుంబానికీ భరోసా!
సీఎన్‌బీసీ-టీవీ18 రిపోర్ట్ ప్రకారం, దేశవ్యాప్తంగా అమెజాన్ లాస్ట్ మైల్ ఆపరేషన్స్‌లో పనిచేస్తున్న దాదాపు 90 వేల మంది డెలివరీ అసోసియేట్స్‌కు అద్భుతమైన ఆరోగ్య బీమా కవరేజీని సంస్థ విస్తరించింది. రోజుకు పదుల సంఖ్యలో ఇళ్లకు తిరిగే ఈ కార్మికుల మెడిక్లెయిమ్ కవరేజ్‌ను ఏకంగా రూ.1.5 లక్షలకు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
దీనికి తోడు ఓపీడీ ఖర్చుల కింద రూ.10 వేల వరకు సాయం అందించనుంది. రోడ్లపై నిత్యం తిరిగేటప్పుడు ఏమైనా జరగరానిది జరిగితే, వారి కుటుంబాలు రోడ్డున పడకుండా గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్‌ను ఏకంగా రూ.10 లక్షలకు పెంచడం నిజంగా హర్షణీయం. ఈ భారీ కవరేజ్‌లో హాస్పిటలైజేషన్, డిసేబిలిటీ కాంపెన్సేషన్‌తో పాటు ఇతర అత్యవసర వైద్య ఖర్చులు కూడా కలిసి ఉంటాయి.
ఒక్కరికే కాదు.. ఆ ఇంట్లో నలుగురికి రక్షణ!
అమెజాన్ ప్రకటించిన ఈ కొత్త వెల్‌నెస్ బెనిఫిట్స్ కేవలం ఆ ఉద్యోగికే పరిమితం కాలేదు. డెలివరీ బాయ్‌తో పాటు అతని కుటుంబంలోని మరో ముగ్గురు సభ్యులకు కూడా ప్రతి ఏడాదీ ఈ ఉచిత వైద్య సేవలు వర్తిస్తాయి.
ఇందులో భాగంగా వర్చువల్ డాక్టర్ కన్సల్టేషన్స్, ఉచితంగా నేరుగా ఓపీడీ సందర్శనలు ఉంటాయి. అంతేకాకుండా, భారీ డిస్కౌంట్ ధరలకే డయాగ్నోస్టిక్ టెస్టులు, ఫార్మసీ సేవలు, డెంటల్, ఐ కేర్ వంటివి కూడా అందుబాటులోకి తెచ్చారు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా డెలివరీ స్టేషన్ల వద్దే కంటి, దంత, బరువు (BMI) పరీక్షలు నిర్వహించేలా భారీ హెల్త్ క్యాంపులను సైతం అమెజాన్ చేపట్టింది.
రూ. 2,800 కోట్ల భారీ పెట్టుబడి వెనుక అసలు కథ!
తమ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు, తమ కోసం చెమటోడ్చే ఉద్యోగుల భద్రత, శ్రేయస్సే తమకు అత్యంత ముఖ్యమని అమెజాన్ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ సలీం మెమన్ కుండబద్దలు కొట్టారు. కేవలం లాభాలే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్య, ఆర్థిక భద్రత కోసం సంస్థ ఏకంగా రూ. 2,800 కోట్లకు పైగా భారీ పెట్టుబడులు పెట్టినట్లు వెల్లడించారు.
ఈ నిధులతో కార్మికులకు విశ్రాంతి గదులు, అత్యవసర అంబులెన్స్ సేవలు, రోడ్డు భద్రతపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతకంటే ముఖ్యంగా.. ఆ డెలివరీ ఉద్యోగుల పిల్లల భవిష్యత్తు కోసం ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్స్ కూడా అందజేస్తూ ఒక కార్పొరేట్ సంస్థ బాధ్యతకు కొత్త అర్థం చెబుతున్నారు.
నెలకు 50 వేల సంపాదన.. కష్టానికి తగ్గ ఫలితం!
ప్రస్తుతం ఇండియాలో అమెజాన్ లాస్ట్ మైల్ నెట్‌వర్క్‌లో సుమారు 90 వేల మంది డెలివరీ అసోసియేట్స్ అలుపెరగకుండా శ్రమిస్తున్నారు. ఇది పూర్తిగా వారి పనితీరు (ఇన్సెంటివ్) మీద ఆధారపడి ఉండే అద్భుతమైన ఉద్యోగ అవకాశం.
నగరం, అనుభవం, చేసే పని రకాన్ని బట్టి వీరు నెలకు రూ.12,000 నుంచి గరిష్టంగా రూ.50,000 వరకు సునాయాసంగా సంపాదించుకుంటున్నారు. ఎన్ని ఎక్కువ పార్సిల్స్ డెలివరీ చేస్తే అంత ఎక్కువ ఇన్సెంటివ్స్ వాళ్ల జేబులో పడతాయి. ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కాంట్రాక్ట్ బేసిస్.. ఇలా ఏ విధానంలో చేరినా, కష్టపడే తత్వం ఉండి అనుభవం పెరిగే కొద్దీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది.
ఒక బహుళజాతి సంస్థ లాభాల వెంట పరుగెత్తడం సర్వసాధారణం.. కానీ ఆ లాభాలను తెచ్చిపెట్టే సామాన్య డెలివరీ బాయ్స్ జీవితాలకు ఇలా భద్రత కల్పించడం అసాధారణం! పనికి తగ్గ ప్రతిఫలంతో పాటు, ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే నాకంటూ ఒక సంస్థ అండగా నిలబడుతుందన్న భరోసా.. ఆ కార్మికుడిలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతుంది. ఇతర ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలు కూడా కేవలం 'టార్గెట్స్' అంటూ ఒత్తిడి పెంచడం మాత్రమే కాకుండా, తమ కార్మికుల ప్రాణాలకు ఇలాగే భరోసా కల్పిస్తేనే.. ఇండియాలో గిగ్ ఎకానమీ (Gig Economy)కి బలమైన భవిష్యత్తు ఉంటుంది. కస్టమర్ ముఖం మీద చిరునవ్వు చూడాలంటే.. ముందు డెలివరీ చేసేవాడి కడుపు నిండాలి, వాడి కుటుంబం భద్రంగా ఉండాలి!

