మార్పు కోసం ఒక కొత్త నాయకుడికి ప్రజలు ఓటేసి ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిస్తే.. ఆ కుర్చీ వెనుక ఉండి రాష్ట్రాన్ని ఒక జ్యోతిష్కుడు శాసిస్తే సామాన్యుడి పరిస్థితి ఏంటి? మూఢనమ్మకాలకు తావులేని ద్రావిడ రాజకీయాల్లో స్వచ్ఛమైన మార్పు తెస్తాడని దళపతి విజయ్‌కి ప్రజలు పట్టం కడితే.. ఇప్పుడు ఆయన తీసుకున్న తొలి నిర్ణయమే భయంకరమైన సంచలనానికి తెరలేపింది. ప్రభుత్వ నిర్ణయాలు ఫైళ్ల ద్వారా జరుగుతాయా లేక గ్రహగతుల ద్వారా జరుగుతాయా అన్న అనుమానం ప్రతి సామాన్యుడిలో మొదలైంది!
సీఎం ఆఫీసులో జ్యోతిష్కుడికి పెద్దపీట!
తమిళనాడు ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) తనదైన మార్క్ పాలన కోసం వేగంగా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో (CMO) తన కోర్ టీమ్‌ను అత్యంత పకడ్బందీగా సెట్ చేసుకునే పనిలో పడ్డారు.
కానీ, ఈ క్రమంలో ఆయన తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి రాజేసింది. విజయ్‌కు అత్యంత సన్నిహితుడు, ఆయన వ్యక్తిగత జ్యోతిష్కుడిగా సుపరిచితుడైన రికీ రాధన్ పండిట్ వెట్రివేల్‌ను.. ఏకంగా ప్రభుత్వంలోని అత్యంత కీలక పదవిలో కూర్చోబెట్టడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది.
దాదాపు క్యాబినెట్ హోదా.. సీఎస్ అధికారిక ఉత్తర్వులు
రికీ రాధన్‌కు ముఖ్యమంత్రికి ప్రత్యేక విధి అధికారి (OSD - Officer on Special Duty) గా కీలక బాధ్యతలు అప్పగిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీటా హరీష్ థక్కర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ముఖ్యమంత్రి రాజకీయ వ్యవహారాల విభాగానికి ఓఎస్డీగా చక్రం తిప్పనున్నారు.
ఈ పదవిలో ఉన్న వారికి దాదాపు 'క్యాబినెట్ హోదా' దక్కుతుంది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో ఇట్టే అర్థమవుతోంది. ఇకపై విజయ్‌కు ప్రధాన రాజకీయ వ్యూహకర్తగా ఆయనే తెరవెనుక కథ నడపనున్నారు.
జాతకాలు చెప్పే వ్యక్తి నుంచి టీవీకే వ్యూహకర్తగా..
రికీ రాధన్ కేవలం విజయ్‌కు జ్యోతిష్యం చెప్పే వ్యక్తి మాత్రమే కాదు. తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ పుట్టినప్పటి నుంచి ఆయన అందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీ అధికార ప్రతినిధులలో ఒకరిగా ఉంటూ, టీవీ డిబేట్లలో టీవీకే గళాన్ని బలంగా వినిపించిన నేత ఆయన.
పార్టీ సిద్ధాంతాల రూపకల్పన దగ్గర్నుంచి, మొన్నటి ఎన్నికల వ్యూహాల వరకు విజయ్ ఈయన సలహాలను తు.చ. తప్పకుండా పాటించారని పార్టీ వర్గాల్లో టాక్. ఇప్పుడు నేరుగా సీఎం ఆఫీసులోనే తన మిత్రుడికి చోటు కల్పించడం ద్వారా విజయ్ ఆయనపై తనకున్న అపారమైన నమ్మకాన్ని చాటుకున్నారు.
లౌకిక ప్రభుత్వమా? గ్రహగతుల పాలనా?
అయితే, ఈ సంచలన నియామకంపై ప్రతిపక్షాలు, సామాజిక సంఘాలు తీవ్ర స్థాయిలో భగ్గుమంటున్నాయి. ఒక లౌకిక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో.. సైంటిఫిక్ అప్రోచ్‌తో పాలన సాగించాల్సిన చోట ఒక 'జ్యోతిష్కుడికి' ఇంతటి అధికారిక హోదా కల్పించడం ఏంటని నిలదీస్తున్నాయి.
పరిపాలనా దక్షత ఉన్న ఐఏఎస్‌లకో, సీనియర్ రాజకీయ నేతలకో ఇవ్వాల్సిన ఉన్నత పదవిని కేవలం గ్రహగతులు చెప్పే వ్యక్తికి కట్టబెట్టడం దారుణమని విమర్శకులు మండిపడుతున్నారు.
రికీ రాధన్ నేపథ్యం పరిశీలిస్తే రాజకీయాలతో ఆయనకున్న బంధం ఈనాటిది కాదు. గతంలో దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఆయన వ్యక్తిగత జ్యోతిష్కుడిగా పనిచేశారు. అయితే, అప్పట్లో రాజకీయ నేతలకు కేవలం సలహాలు మాత్రమే ఇచ్చిన జ్యోతిష్యులను.. ఇప్పుడు నేరుగా ప్రభుత్వ అధికార పీఠంపై కూర్చోబెట్టడమే అసలు వివాదానికి కారణం.
నాయకులకు వ్యక్తిగత నమ్మకాలు, విశ్వాసాలు ఉండొచ్చు.. కానీ అవి ఎన్నటికీ ప్రభుత్వ విధానాలను శాసించే స్థాయికి వెళ్లకూడదు! స్వచ్ఛమైన మార్పు తెస్తానని అధికారంలోకి వచ్చిన విజయ్, తన తొలి అడుగులోనే ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం కచ్చితంగా ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుంది. గ్రహాల అనుగ్రహంతో రాజ్యాధికారం రావచ్చునేమో కానీ, ప్రజల మద్దతు నిలవాలంటే పారదర్శకమైన, హేతుబద్ధమైన పాలనే ముఖ్యం. రికీ రాధన్ ఈ విమర్శల తుఫానును ఎలా ఎదుర్కొంటారో, విజయ్ తన నిర్ణయాన్ని ప్రజల ముందు ఎలా సమర్థించుకుంటారో చూడాలి!

