[FEATURED_IMAGE]
ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ చేతిలో లేనిదే పూట గడవని పరిస్థితి నేటి సమాజంలో నెలకొంది. ఫోన్ ముఖమే చూస్తూ లోకాన్ని మర్చిపోతున్న ఎంతోమందికి సీనియర్ నటి షకీలా ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం ఒక చెంపపెట్టు లాంటిది. సోషల్ మీడియాలో రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూడటం, ముఖ్యంగా గంటల తరబడి గేమ్స్ ఆడటం తనకు తీవ్రమైన వ్యసనంగా మారిపోయిందని ఆమె స్వయంగా అంగీకరించారు.
నిద్రపోయే సమయంలో కూడా సరైన భంగిమలో కాకుండా, ఫోన్ వైపే చూస్తూ పడుకోవడం వల్ల తన మెడపై ఊహించని స్థాయిలో ఒత్తిడి పడిందని షకీలా వెల్లడించారు. ఈ క్రమంలో మెడలోని నరాలు తీవ్రంగా దెబ్బతినడంతో, ఆ భరించలేని నొప్పి నుంచి బయటపడటానికి వైద్యుల సూచన మేరకు ఏకంగా మెడకు శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. కేవలం ఫోన్ వాడకం వల్ల వచ్చిన ఈ సమస్యకు తాను అక్షరాలా మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో ముఖ్యంగా చిన్న పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలని షకీలా సున్నితంగా హెచ్చరించారు. అవసరం లేని వీడియోలు చూస్తూ సమయంతో పాటు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకోవద్దని, తనలాగా శారీరక, ఆర్థిక బాధలు పడవద్దని అభిమానులకు హితవు పలికారు. 18 ఏళ్ల వయసులో 'ప్లే గర్ల్స్' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి, మలయాళంలో 'కిన్నార తుంబికల్', తెలుగులో తేజ 'జయం', 'నిజం' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షకీలా చేసిన ఈ హెచ్చరిక ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

