అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్: నరకం అనుభవించానంటూ ఎమోషనల్

naveen
By -

Anupama Parameswaran breakup

గ్లామరస్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను, బ్రేకప్ బాధను తొలిసారిగా బహిరంగంగా వెల్లడించి సంచలనం సృష్టించారు. గత రెండేళ్లుగా ఒక నార్సిసిస్టిక్ వ్యక్తి చేతిలో తాను తీవ్ర శారీరక, మానసిక వేధింపులకు గురయ్యానని, ఆ బ్రేకప్ వల్ల తన కెరీర్ కూడా దెబ్బతిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన మాజీ ప్రియుడి ప్రవర్తన 'అపరిచితుడు' సినిమాలోని విక్రమ్ పాత్రలా ఉండేదని అనుపమ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.


[FEATURED_IMAGE]

వెండితెరపై ఎప్పుడూ చలాకీగా, నవ్వుతూ కనిపించే అనుపమ పరమేశ్వరన్ జీవితంలో ఊహించని విషాదం దాగి ఉందన్న నిజం అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, గత రెండేళ్లుగా తాను అనుభవించిన నరకాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. ప్రేమ పేరుతో తన జీవితంలోకి వచ్చిన ఒక వ్యక్తి వల్ల తాను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా కుంగిపోయానని, నార్సిసిస్టిక్ అబ్యూజ్‌కు గురయ్యానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.


తాను 'నార్సిసిస్టిక్ అబ్యూజ్' ఎదుర్కొన్నానని అనుపమ చెప్పడంతో అసలు ఆ పదం అర్థం ఏంటని సామాన్య ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు. సైకాలజీ ప్రకారం.. తమ గురించి తాము అతిగా గొప్పలు ఊహించుకోవడం, ఎదుటివారి భావాలకు ఏమాత్రం విలువ ఇవ్వకపోవడం, ఎప్పుడూ తమనే పొగడాలని కోరుకుంటూ అవతలి వారిని స్వార్థం కోసం కంట్రోల్ చేసే ఒక మానసిక పరిస్థితిని 'నార్సిసిజం' అంటారు. సరిగ్గా ఇలాంటి వ్యక్తి చేతిలోనే అనుపమ రెండేళ్ల పాటు తీవ్ర మానసిక క్షోభ అనుభవించారు.


రిలేషన్‌షిప్ మొదలైన కొద్ది రోజులకే అతడు తనను కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని, మూడు నెలల్లోనే ఎంగేజ్‌మెంట్ వరకు వెళ్లాడని అనుపమ గుర్తుచేసుకున్నారు. అయితే తనకు కాస్త సమయం కావాలని అడగడం వల్లే పెను ప్రమాదం తప్పిందని, అప్పుడే పెళ్లి చేసుకుని ఉంటే కచ్చితంగా ఆ బంధం విడాకుల వరకు వెళ్లేదని ఆమె స్పష్టం చేశారు. 


ఆ వ్యక్తి తన జీవితంలోని ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ కంట్రోల్ చేసేవాడని, అతడి ప్రవర్తన 'అపరిచితుడు' సినిమాలోని విక్రమ్ క్యారెక్టర్‌ను తలపించేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రోజు ఎంతో ప్రేమగా ఉండి, మరుసటి రోజు క్రూరంగా ప్రవర్తించేవాడని ఆమె తెలిపారు.


ఈ టాక్సిక్ రిలేషన్ వల్ల తన కెరీర్ కూడా తీవ్రంగా దెబ్బతిందని అనుపమ ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్స్‌లో కూడా తాను సరిగ్గా పాల్గొనలేకపోయానని, అతడి కండిషన్స్ వల్ల ఎన్నో మంచి ప్రాజెక్టులను వదులుకున్నానని ఆమె అసలు నిజాలు బయటపెట్టారు. 


తాను పడుతున్న బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదన్న ఆవేదనతోనే, సోషల్ మీడియాలో పసుపు రంగు డ్రెస్ ఫొటో పెట్టి 'అనుపమ చనిపోయింది' అని రాస్తే ఎక్కువ ప్రేమ దక్కుతుందేమో అని ఆమె తీవ్ర ఎమోషనల్ అయ్యారు. ఏదేమైనా ఆ చేదు గతం నుంచి బయటపడి, ఇటీవల 'పెట్ డిటెక్టివ్' లాంటి సినిమాలతో మళ్లీ ప్రశాంతంగా తన కెరీర్‌పై ఫోకస్ చేసిన అనుపమ ధైర్యాన్ని ఫ్యాన్స్ ఎంతగానో అభినందిస్తున్నారు.