చెత్త సినిమాకు 20 కోట్లా? 'నియు లాయ్' సెన్సేషన్

naveen
By -
Niu Lai Chinese animated movie poster and terrible animation

సాధారణంగా మనం ఒక సినిమా చూడాలంటే ముందుగా రివ్యూలు చదువుతాం. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తేనే వందలు ఖర్చుపెట్టి థియేటర్‌కు వెళ్తాం. కానీ, ఒక సినిమా 'పరమ చెత్తగా ఉంది' అని తెలిసిన తర్వాత కూడా.. అసలు ఆ చెత్త ఎలా ఉందో చూద్దాం అంటూ జనాలు థియేటర్ల ముందు క్యూ కడితే ఎలా ఉంటుంది? ప్రస్తుతం చైనాలో ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఏమాత్రం అంచనాలు లేకుండా విడుదలై, ట్రోల్స్ కారణంగా కోట్లు కొల్లగొడుతున్న ఒక చైనీస్ యానిమేషన్ సినిమా కథ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేపుతోంది. నెగెటివ్ పబ్లిసిటీ కూడా ఒక పబ్లిసిటీనే అనడానికి ఇదొక లైవ్ ఎగ్జాంపుల్!


[FEATURED_IMAGE]

‘నియు లాయ్’.. 2026లో అత్యంత చెత్త సినిమా!


చైనా భాషలో ‘నియు లాయ్’ (Niu Lai) అంటే ‘ది కౌ ఈజ్ కమింగ్’ అని అర్థం. ఒక దూడ, ఒక పక్షి మధ్య ఉన్న సంబంధాన్ని చూపిస్తూ 86 నిమిషాల నిడివితో ఒక యానిమేషన్ సినిమా తీశారు. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమా, మొదటి పది రోజుల్లో కేవలం లక్ష రూపాయలు మాత్రమే (7,700 యువాన్లు) వసూలు చేసింది.


కథలో లాజిక్ లేకపోవడం, నాసిరకం గ్రాఫిక్స్, విచిత్రమైన వాయిస్ ఓవర్స్ ఉండటంతో సోషల్ మీడియాలో ఈ సినిమా క్లిప్స్ వైరల్ అయ్యాయి. 'ఏఐ కంటే దారుణంగా ఉంది', '2026లో ఇదే అత్యంత చెత్త సినిమా' అంటూ నెటిజన్లు దారుణంగా జోకులు పేల్చారు.


ట్రోల్స్ తెచ్చిన క్రేజ్.. బాక్సాఫీస్ వద్ద 20 కోట్లు!


నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తుండటంతో, అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అసలు ఈ 'నియు లాయ్' అంత చెత్తగా ఎలా ఉందో థియేటర్‌లో చూద్దాం అంటూ జనాలు క్యూ కట్టడం మొదలుపెట్టారు.


ఫలితంగా, లక్ష రూపాయలు కూడా రావు అనుకున్న ఈ సినిమా ఏకంగా రూ.20 కోట్లు (14.9 మిలియన్ యువాన్లు) వసూలు చేసి బిగ్గెస్ట్ బాక్సాఫీస్ మిరాకిల్‌గా నిలిచింది. చైనాలో భారీ బడ్జెట్ హాలీవుడ్ చిత్రాలైన 'ది ఒడిస్సీ', 'స్పైడర్-మ్యాన్' వంటి సినిమాలకు దీటుగా ఈ చిన్న యానిమేషన్ మూవీ వసూళ్లు రాబట్టడం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది.


ఐదేళ్ల కష్టం.. తల్లీకొడుకుల పోరాటం!


ఈ సినిమా వెనుక ఒక ఎమోషనల్ స్టోరీ కూడా ఉంది. జిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ అనే తల్లీకొడుకులు దాదాపు ఐదేళ్లపాటు కష్టపడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వారే స్వయంగా కథ రాసుకుని, దర్శకత్వం వహించి, వాయిస్ ఓవర్ ఇచ్చారు.


ఈ సినిమా పోస్టర్ చూస్తే ఒక అందమైన చైనీస్ పెయింటింగ్‌లా ఉంటుంది కానీ, లోపల యానిమేషన్ మాత్రం పూర్తి భిన్నంగా ఉండటమే అసలు గందరగోళానికి కారణమైంది.


 ఏఐ (Artificial Intelligence) వాడితే చిటికెలో అత్యద్భుతమైన విజువల్స్ సృష్టించగల కాలం ఇది. కానీ, ఏ టెక్నాలజీ లేకుండా ఇద్దరు వ్యక్తులు తమ చేతులతో చేసిన ఈ పచ్చి యానిమేషన్ ప్రేక్షకులకు ఏదో కొత్తగా అనిపించింది. ఈ డీజిటల్ యుగంలో 'హేట్-వాచింగ్' (Hate-watching) అనేది ఒక బలమైన మార్కెటింగ్ టూల్‌గా మారిపోయింది. ఒక ప్రొడక్ట్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే కాదు, అందులో ఉన్న విపరీతమైన లోపాలు కూడా ఒక్కోసారి దాన్ని వైరల్ చేసి కోట్లు కురిపిస్తాయని ఈ 'నియు లాయ్' విజయం మనకు ప్రాక్టికల్‌గా నేర్పుతున్న పాఠం.