ఒకప్పుడు మనదేశంలో పది గ్రాముల బంగారం ధర కేవలం 100 రూపాయలు మాత్రమే ఉండేది. ఇప్పుడు అదే పది గ్రాములు లక్ష రూపాయలకు చేరువలో ఉంది. వంద రూపాయల నుండి లక్ష రూపాయల వరకు సాగిన బంగారం ధరల ప్రయాణంలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు ఉన్నాయి. ఒక్కో మలుపు ఒక్కో రికార్డును సృష్టించింది. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా సాగిన బంగారం ధరలపై ఒకసారి దృష్టి సారిద్దాం.
1959 నుండి 2025 వరకు - బంగారం ధరల ఒడిదుడుకులు
మీరు నమ్మినా నమ్మకపోయినా, 1959లో మొదటిసారిగా పది గ్రాముల బంగారం ధర 100 రూపాయలను తాకింది. ఆ తర్వాత 20 ఏళ్లకు, అంటే 1979లో అదే పది గ్రాముల బంగారం ధర వెయ్యి రూపాయలకు చేరుకుంది. ఇది కాస్తా 2007 నాటికి 10 వేల రూపాయలైంది. ఇలా పది రెట్లు పెరగడానికి దాదాపు 28 సంవత్సరాల సమయం పట్టింది. వెయ్యి రూపాయల నుండి 10 వేల రూపాయలకు పెరగడానికి దాదాపు మూడు దశాబ్దాలు తీసుకున్న బంగారం, ఆ తర్వాత 40 వేల రూపాయలు పెరగడానికి కేవలం నాలుగేళ్ల సమయం మాత్రమే తీసుకుంది. 2021లో తులం బంగారం ధర 50 వేల రూపాయలు ఉంటే, ఈ ఏడాది (2025) ఏకంగా 90 వేల రూపాయలను దాటింది. ప్రస్తుతం 98 వేల రూపాయల మార్క్‌ను కూడా అధిగమించింది.
10 వేల తర్వాత పరుగులు - ప్లాటినంను దాటి రికార్డుల మోత
బంగారం ధర వంద రూపాయల నుండి వెయ్యి రూపాయలకు పెరగడానికి 20 సంవత్సరాలు పట్టింది. వెయ్యి రూపాయల నుండి 10 వేల రూపాయలకు పెరగడానికి ఏకంగా 28 సంవత్సరాలు పట్టింది. అదే తులం బంగారం 10 వేల రూపాయల నుండి 50 వేల రూపాయలను తాకడానికి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే పట్టింది. జాగ్రత్తగా గమనిస్తే, ఎప్పుడైతే బంగారం ధర 10 వేల రూపాయలను దాటిందో, అప్పటి నుండి దాని పరుగులు మొదలయ్యాయి.
ఈ 14 సంవత్సరాల కాలంలోనే, ప్రపంచంలో అత్యంత విలువైన లోహంగా ఉన్న ప్లాటినంను కూడా దాటి, దానిని వెనక్కి నెట్టి బంగారం దూసుకుపోయింది. అప్పటి వరకు అత్యధిక ధర పలికి, లోహాలలో రారాజుగా ఉన్న ప్లాటినం, బంగారం యొక్క దూకుడును తట్టుకోలేకపోయింది. ఇక 50 వేల రూపాయలు దాటిన తర్వాత బంగారం ధరలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.
కేవలం నాలుగేళ్లలో 90 వేల రూపాయలకు చేరుకుంది. 2025 నాటికి ప్రస్తుతం 98 వేల రూపాయల మార్క్‌ను దాటేసింది. తాజా అంచనాల ప్రకారం, ఈ సంవత్సరం చివరి నాటికి బంగారం ధర లక్ష రూపాయలను దాటి, ఏకంగా లక్షా పాతిక వేల రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది.