నేటి బిజీ జీవనశైలి కారణంగా మన కోసం మనం కొంచెం సమయం కూడా కేటాయించుకోలేకపోతున్నాము. ఇది మనలో అనేక భావోద్వేగాలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో మన శరీరం కూడా అనేక విధాలుగా స్పందిస్తుంది. మనం అనుభూతి చెందే ప్రతిదానికీ మన శరీరం ప్రతిస్పందిస్తుంది.
ఆనందం, కోపం, భయం, ఆందోళన మరియు విచారం వంటి భావోద్వేగాలు మన మనస్సును మాత్రమే కాకుండా మన శరీరంలోని వివిధ భాగాలను కూడా ప్రభావితం చేస్తాయి. మీరు చాలా కాలంగా ఏదో విషయం గురించి మీలో మీరే బాధపడుతూ మీలోని భావోద్వేగాలను అణిచివేసుకుంటున్నారా? అయితే, మీరు ప్రమాదంలో ఉన్నట్లే.
ఎందుకంటే అది మీ అవయవాలను దెబ్బతీస్తుంది మరియు దీని వల్ల మనం తీవ్ర అనారోగ్యానికి గురవుతాము. అవును, మన భావోద్వేగాలు మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మన భావోద్వేగాలు మన శరీర భాగాలను ఎలా ప్రభావితం చేస్తాయో ఇక్కడ తెలుసుకుందాం...
కోపం - కాలేయంపై ప్రభావం
ఈ రోజుల్లో చాలా మందికి చాలా త్వరగా కోపం వస్తుంది. ఎక్కువ మంది ఎప్పుడూ నిరాశలోనే ఉంటుంటారు. అలాంటి వారు చిన్న చిన్న విషయాలకు కూడా వెంటనే స్పందిస్తూ కోపంగా ఉంటారు. అలా ఎవరికైనా ఎక్కువ కోపం వస్తే, అది వారి కాలేయంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల తలనొప్పి, చిరాకు, జీర్ణ సమస్యలు మరియు అధిక రక్తపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
భయం మరియు ఆందోళన - మూత్రపిండాలపై ప్రభావం
ఎప్పుడూ ఏదో ఒక భయం లేదా ఆందోళనతో ఉండే వారు త్వరగా మూత్రపిండాల వ్యాధుల బారినపడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. భయం మరియు ఆందోళన వంటి ఉద్వేగాలు మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయని చెబుతున్నారు. దీనివల్ల అలసట, వెన్నునొప్పి, నిద్రలేమి మరియు తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు వస్తాయి.
విచారం - ఊపిరితిత్తులపై ప్రభావం
కొందరు ఎప్పుడూ విచారంగా ఉంటూ ఉంటారు. అలా ఉండటం మీ ఊపిరితిత్తులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో బరువు మరియు బలహీనత వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఆందోళన - ప్లీహము మరియు కడుపుపై ప్రభావం
ప్రతి చిన్న లేదా పెద్ద విషయం గురించి ఎక్కువగా ఆందోళన చెందడం వల్ల ప్లీహము బలహీనపడుతుంది. ఇది నేరుగా మన కడుపుపై ప్రభావం చూపుతుంది. దీని వలన ఆకలి లేకపోవడం, అజీర్ణం మరియు కడుపులో భారమైన భావన కలుగుతుంది.
నిరాశ - గుండెపై ప్రభావం
ఎక్కువ కాలం నిరాశకు గురికావడం మన గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది క్రమరహిత హృదయ స్పందన మరియు నిరంతర అలసట మరియు బలహీనతకు కారణం కావచ్చు.
అసూయ - కాలేయం మరియు పిత్తాశయంపై ప్రభావం
మీరు ఎవరినైనా చూసి అసూయపడితే, అది మీ కాలేయం మరియు పిత్తాశయంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది అజీర్ణానికి కారణమవుతుంది మరియు మీ మనస్సును అశాంతితో నింపేస్తుంది.
భావోద్వేగాలను ఎలా నియంత్రించాలి?
మనస్సు సంతోషంగా ఉన్నప్పుడు శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే మీలోని భావోద్వేగాలను అణచివేయకూడదు అంటున్నారు. వాటిని అర్థం చేసుకున్న తర్వాత వ్యక్తీకరించడం నేర్చుకోవాలి. కోపం, భయం, ఆందోళన మరియు విచారాన్ని మీ మనసులోనే దాచుకోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. అదే నవ్వుతూ, సంతోషంగా ఉంటూ నలుగురితో కలిసి మెలిసి ఉంటూ మీ భావోద్వేగాలను మీ సన్నిహితులతో పంచుకోవడం వల్ల ఓదార్పు లభిస్తుంది. అందరితో హృదయపూర్వకంగా మాట్లాడటం ద్వారా జీవితాన్ని అందంగా మరియు ఆరోగ్యంగా మార్చుకోవచ్చు.
0 కామెంట్‌లు