కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
కొత్త రేషన్ కార్డులు, మార్పులు-చేర్పులకు అవకాశం
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకోవడంతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రేషన్ కార్డు స్ల్పిట్, కొత్త సభ్యుల చేరిక మరియు చిరునామా మార్పులు వంటి వాటి కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే రేషన్ కార్డుల్లో మార్పుల కోసం 3.28 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వాటిని పరిశీలించి మార్పులు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
స్మార్ట్ కార్డులు, క్యూఆర్ కోడ్ సెక్యూరిటీ
రేషన్ కార్డుల్లో మార్పులు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వివరించారు. QR కోడ్ సెక్యూరిటీ ఫీచర్లతో స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్డులపై ప్రభుత్వాధినేతల ఫోటోలు ఉండవని, కేవలం ప్రభుత్వ చిహ్నాలతోనే స్మార్ట్ కార్డులు జారీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు స్పష్టంగా కనిపిస్తాయని, అలాగే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే గత ఆరు నెలల రేషన్ వివరాలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు.
నెల రోజుల పాటు దరఖాస్తుల స్వీకరణ
నెల రోజుల పాటు ఈ రేషన్ కార్డు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలు తమ వివరాలు తెలుసుకోవడానికి గ్రామ మరియు వార్డు సచివాలయాలను సందర్శించవచ్చు. జూన్ నుండి స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఏపీలో 95 శాతం మేర ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తయిందని, ఈ-కేవైసీ పూర్తి అయిన వారు కొత్తగా దరఖాస్తు చేయవలసిన అవసరం లేదని మంత్రి తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈ నెల 12 నుండి దరఖాస్తులు స్వీకరిస్తామని కూడా ఆయన వెల్లడించారు. దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే సౌలభ్యం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.
0 కామెంట్‌లు