భారత్, బ్రిటన్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం!


భారత్ మరియు బ్రిటన్ మధ్య ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ చారిత్రాత్మక ఒప్పందం గురించి ప్రకటించారు. ఈ ఒప్పందంతో పాటు, సామాజిక భద్రతా ఒప్పందం కూడా ఖరారైనట్లు ఆయన తెలిపారు. ఇరు దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని మోదీ అభివర్ణించారు. ఇది రెండు దేశాలకు కూడా ఎంతో లాభదాయకమని ఆయన పేర్కొన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ త్వరలో భారత్‌లో పర్యటించడానికి ఎదురుచూస్తున్నట్లు కూడా మోదీ తెలిపారు.

మూడేళ్ల చర్చలకు ఫలించిన ఫలితం

ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం ఇరు దేశాల మధ్య గత మూడేళ్లుగా విస్తృతమైన చర్చలు జరిగాయి. బ్రిటన్ ప్రధానిగా బోరిస్ జాన్సన్ ఉన్న కాలం నుండి ఈ చర్చలు కొనసాగుతున్నాయి. స్వేచ్ఛా మార్కెట్‌ను ప్రోత్సహించడం మరియు వాణిజ్య ఆంక్షలను సడలించడం ద్వారా 2040 నాటికి ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 25.5 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా దాదాపు 14 దఫాలుగా చర్చలు జరిగాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఇరు దేశాల వాణిజ్యం 20.36 బిలియన్ డాలర్లుగా ఉండగా, 2023-24 నాటికి అది 21.34 బిలియన్ డాలర్లకు పెరిగింది. రాబోయే పదేళ్లలో ఈ వాణిజ్యాన్ని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ఒప్పందంలోని ముఖ్యాంశాలు

ఈ ఒప్పందంలో భాగంగా, భారత్ నుండి ఎగుమతి అయ్యే దాదాపు 99 శాతం ఉత్పత్తులకు సుంకం ఉండదు. అలాగే, బ్రిటన్ నుండి భారత్‌కు దిగుమతి అయ్యే విస్కీపై సుంకం ప్రస్తుతం ఉన్న 150 శాతం నుండి 75 శాతానికి తగ్గనుంది. నిర్ణీత పరిమితి మేరకు ఆటోమొబైల్ దిగుమతులపై సుంకం 100 శాతం నుండి 10 శాతానికి తగ్గనుంది. వీటితో పాటు, వైద్య పరికరాలు, అధునాతన యంత్ర పరికరాలు, చాక్లెట్లు మరియు బిస్కెట్లపై కూడా భారత్ సుంకాలను తగ్గించనుంది. ఇక సామాజిక భద్రతా ఒప్పందం ప్రకారం, బ్రిటన్‌లో పనిచేసే భారతీయులు తమ సోషల్ సెక్యూరిటీ ఫండ్స్‌కు రెట్టింపు చెల్లించాల్సిన అవసరం ఉండదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు