పహల్గాం ఉగ్రదాడి: ఖర్గే వ్యాఖ్యలపై భాజపా ఆగ్రహం!


జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలపై భాజపా తీవ్రంగా స్పందించింది. ఖర్గే వ్యాఖ్యలు భద్రతా బలగాల స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఖర్గే ఆరోపణలు

పహల్గాం ఘటన గురించి మాట్లాడుతూ.. ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి ముందే సమాచారం అందిందని ఖర్గే ఆరోపించారు. ‘‘దేశంలో పరిస్థితుల గురించి మీ అందరికీ తెలుసు. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ఇంటెలిజెన్స్‌ను పటిష్ఠ పరచుకుంటామని వాళ్లే చెప్పారు. దాడికి మూడు రోజుల ముందే నిఘా సమాచారం ఉందని నాకు తెలిసింది. అలాంటప్పుడు అక్కడ (పహల్గాంలో) తగినంత భద్రతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నా. ఏదేమైనా పహల్గాం దాడికి వ్యతిరేకంగా పాకిస్థాన్‌పై ఎటువంటి చర్య తీసుకున్నా ప్రభుత్వానికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలుస్తుంది’’ అని రాంచీలో నిర్వహించిన కార్యక్రమంలో ఖర్గే అన్నారు.

భాజపా ప్రతిస్పందన

కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని భాజపా అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మీడియాతో అన్నారు. ఉగ్రవాదంపై పోరు నిర్ణయాత్మక దశకు చేరుకున్న సమయంలో ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడాన్ని మరో నేత ప్రశ్నించారు. ‘‘పాకిస్థాన్‌పై దాడి విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మేం మద్దతు ఇస్తామని చెప్తూనే.. మరోవైపు దేశాన్ని బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు. పహల్గాం ఘటన విషయంలో ప్రధానిపై విమర్శలు చేయడం దురదృష్టకరం’’ అని భాజపా సీనియర్ నేత రవిశంకర్ మండిపడ్డారు.

పహల్గాం దాడి వివరాలు, పాక్ హస్తం

పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి తాము బాధ్యులమని పాక్ కేంద్రంగా ఉన్న లష్కరే తోయిబాకు చెందిన ‘‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’’ బాధ్యత ప్రకటించుకుంది. దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఈ ఘటన తర్వాత పాక్‌పై చర్యలు తీసుకునే దిశగా భారత ప్రభుత్వం అడుగులు వేస్తోంది.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు